శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సుస్థిరమైన అంకుర వ్యవస్థ కోసం ఆవిష్కరణలు, పరిశ్రమల మధ్య మరింత సమన్వయం అవసరమన్న డాక్టర్ జితేంద్ర సింగ్ అంకుర వ్యవస్థ ప్రపంచస్థాయిలో పోటీపడేలా ఉండేందుకు భాగస్వాములందరినీ కలుపుకొని ముందుకుసాగాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
కలిసి పనిచేసే సమయమిదే... హైదరాబాద్ సదస్సులో శాస్త్ర విజ్ఞానం-పరిశ్రమల మధ్య సమన్వయానికి పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి
వ్యవసాయం భారతదేశానికి ప్రత్యేకం...కానీ పరిశోధనలకు అంతగా నోచుకోని రంగం కూడా ఇదే: మంత్రి
సమ్మిళిత ఆవిష్కరణల దిశగా హైదరబాద్ అంకుర సదస్సు ఒక ప్రధాన మెట్టు: మంత్రి
Posted On:
22 APR 2025 5:22PM by PIB Hyderabad
సుస్థిరమైన అంకుర వ్యవస్థ కోసం ఆవిష్కరణలు, పరిశ్రమల మధ్య మరింత సమన్వయం అవసరమని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర).. ప్రధానమంత్రి కార్యాలయం, అణుశక్తి-అంతరిక్ష శాఖలు, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అడ్డంకులను చెరిపేసి పరిశ్రమలు, పెట్టుబడిదారులు, ప్రజలతో సహా భాగస్వాములతో భారతీయ విజ్ఞాన శాస్త్రం ఏకీకృతం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
సీఎస్ఐఆర్-ఐఐసీటీ, సీఎస్ఐఆర్-సీసీఎంబీ, సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్ఐ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన అంకుర సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్ సమయం వచ్చిందన్నారు.
శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, విధాన నిర్ణేతలు హాజరైన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన మూడు సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు ఉమ్మడిగా చేపట్టిన అరుదైన కార్యక్రమాన్ని ప్రశంసించారు. "ఒకే గొడుగు కింద శాస్త్ర విజ్ఞానం, పాలన ఏకీకృతమైన ఇలాంటి దృశ్యం" సహకార, సమ్మిళిత ఆవిష్కరణల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రతిబింబిస్తోందని తెలిపారు.
దెయ్యాలు తిరిగే, కప్పలను కోసే కేంద్రాలుగా ప్రభుత్వ ప్రయోగశాలలుకున్న పేరును పోగొట్టేందుకు గట్టి ప్రయత్నం జరగాలని అన్నారు. ఒకప్పుడు సరైన ప్రచారం లేకపోవటంతో సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలలు చేస్తున్న పనిని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. “శాస్త్ర విజ్ఞానం కేవలం ఆయా కేంద్రాలకే పరిమితం కాకూడదు. మీరు వ్యవసాయంపై పని చేస్తుంటే.. రైతులను పిలిచి మీరు ఏం చేస్తున్నారో వారిని చూపండి” అని వ్యాఖ్యానించారు.
పరిశోధన, ఆవిష్కరణలకు సంబంధించి ప్రారంభంలోనే లోతుగా పరిశ్రమ ప్రయేయం ఉండాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు. ఈ విషయంలో సీఎస్ఐఆర్ ఆరోమా మిషన్ విజయాన్ని ఉదాహరణగా తెలియజేశారు. వ్యవసాయ రంగంలో- ఆరోమా మిషన్ ద్వారా 3,000 మందికి పైగా యువకులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారారు. వారి కనీస వార్షిక ఆదాయం రూ .60 లక్షలుగా ఉందని చెప్పారు. వారిలో చాలా మంది డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. "అదే నిజమైన పరివర్తన- సాంకేతికత, జీవనోపాధి, గౌరవాల సమ్మేళనం" అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న జీవసాంకేతిక రంగాన్ని ప్రస్తావిస్తూ.. 2014లో కేవలం 50 జీవ సాంకేతికత అంకురాలు మాత్రమే ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 వేలకు పైగా ఉందన్నారు. కేవలం అంకెలే కాదు.. జీవ సాంకేతిక రంగం విలువ కూడా 10 బిలియన్ డాలర్ల నుంచి 170 బిలియన్ డాలర్లకు పెరిగింది. “ఇది కేవలం వృద్ధి మాత్రమే కాదు, ఇది విప్లవం” అని అన్నారు. బయో-ఈ3, నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి ప్రభుత్వ ప్రత్యేక విధానాలను ఈ సందర్భంగా ఉదహరించారు.
సీఎస్ఐఆర్‌లో అంతర్గతంగా, తన సొంత మంత్రిత్వ శాఖలో వివిధ విభాగాల మధ్య సమన్వయం తగ్గి విడి విడిగా పనిచేయటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాలు వివిధ విభాగాలు పునరావృతం చేయకుండా ఏకీకృతంగా నిర్వహించేలా చూసేందుకు అణుశక్తి, అంతరిక్షం, బయోటెక్నాలజీ సహా అన్ని శాస్త్ర విజ్ఞాన విభాగాల నెలవారీ సంయుక్త సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. “మన పక్కనున్న ప్రయోగశాలలు చేస్తున్న వాటి గురించి తెలియనప్పుడు మనం అంతర్జాతీయంగా ఎలా పోటీ పడగలం?” అని ఆయన ప్రశ్నించారు.
అణు రంగం ద్వారాలు తెరిచే ప్రణాళికలను కూడా మంత్రి ప్రకటించారు. ఒకప్పుడు శాస్త్రీయ అంశాలకు సంబంధించి గోప్యత అవసరం ఉండేదని, కానీ ప్రస్తుత వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉందని అన్నారు. “గూగుల్ మన జీవితాల్లోకి తొంగి చూడగలిగినప్పుడు, గోప్యత పేరుతో భాగస్వాములకు సమాచారం అందుబాటులో ఉండకుండా చేయటంలో అర్థం ఏమిటి?” అన్ని ఆయన ప్రశ్నించారు.
వాస్తవికమైన, డిమాండ్ ఆధారిత ఆవిష్కరణలకు మంత్రి ఒక మంచి ఉదాహరణను ఇచ్చారు. ''పరిశ్రమనే మ్యాపింగ్ చేయనివ్వండి. మొదటి రోజు నుంచే పెట్టుబడి పెట్టనివ్వండి. వారు రూ.20 పెడితే మీ అంకురం విఫలం కాకుండా చూసుకుంటారు”' అంటూ పరిశోధకులను ప్రోత్సహించారు. పరిశ్రమను కేవలం వినియోగదారుడిగానే కాకుండా సహ పెట్టుబడిదారుడిగా చూడాలని అన్నారు.
2014 నుండి సీఎస్ఐఆర్, డీఎస్ఐఆర్ బడ్జెట్‌లు 230% పైగా పెంచి ప్రభుత్వం గణనీయంగా మద్దతునిచ్చినప్పటికీ.. నిజమైన సుస్థిరత స్వయం సమృద్ధి, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అంగీకరించారు. ”అంకురాలను మొదలుపెట్టవచ్చు కానీ వాటిని నిలబెట్టుకోవటం సవాలే. సామాజిక, ఆర్థిక అంశాలకు అనుగుణంగా ఆకాంక్ష ఉండాలి” అని అన్నారు.
శాస్త్ర విజ్ఞాన వారసత్వం, సాంకేతిక పరిజ్ఞానాల ప్రత్యేక సమ్మేళనంతో భారత శాస్త్ర విజ్ఞాన ఆధారిత అభివృద్ధి ఎజెండాకు నాయకత్వం వహించడానికి హైదరాబాద్ మంచి స్థానంలో ఉందని తెలియజేస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు. “ఇది కేవలం హైదరాబాద్ లేదా సీఎస్ఐఆర్ గురించి మాత్రమే కాదు. ఇతరుల నీడలో ఉండే స్థాయి నుంచి బయటపడి ప్రపంచ ఆవిష్కరణలకు భారత్ నాయకత్వం వహించటం గురించి” అని వ్యాఖ్యానించారు.
దశాబ్ద కాలంలోనే ప్రపంచ ఆవిష్కరణల సూచీలో భారత్ 81 నుంచి 39కి ఎగబాకింది. ఇలాంటి సమయంలో జరిగిన ఈ కార్యక్రమం శాస్త్ర విజ్ఞానాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లటం, యువత సాధికారత, భారత్ను ప్రపంచ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి గుర్తుగా నిలిచింది.
***
(Release ID: 2123630)
Visitor Counter : 6