బొగ్గు మంత్రిత్వ శాఖ
చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయ్ తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి భేటీ
గనుల ఆధారిత ఆర్థిక వృద్ధి, కీలక ఖనిజాల అభివృద్ధి, కార్పొరేట్ సామాజిక బాధ్యత ( సీఎస్ఆర్ ) కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి.
Posted On:
11 APR 2025 7:15PM by PIB Hyderabad
గనుల కార్యకలాపాలను సమీక్షించడానికి, సీఎస్ఆర్ కార్యక్రమాలను అంచనా వేయడానికి, రాష్ట్ర అధికారులతో సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి రెండు రోజుల సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) పర్యటన చేపట్టారు. బొగ్గు ఉత్పత్తిని పెంచడం, సుస్థిర మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించడం, ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధిని సాధించడం ఈ పర్యటన ఉద్దేశం.
చత్తీస్ గఢ్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయ్ తో శ్రీ కిషన్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మైనింగ్ ఆధారిత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, గనుల విస్తరణ కోసం భూసేకరణను వేగవంతం చేయడం, పర్యావరణ అనుమతులను వేగవంతం చేయడం, సమీకృత పునరావాసం, పునరావాస స్థలాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించారు. చత్తీస్ గఢ్ లో కీలకమైన ఖనిజాభివృద్ధి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఈ చర్చలో ప్రధానాంశంగా నిలిచింది.
ఈ సమావేశంలో చత్తీస్ గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమితాబ్ జైన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి బి.పి.పాటి, కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ పీఎం ప్రసాద్, ఎస్ఈసీఎల్ సీఎండీ హరీశ్ దుహాన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.
కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి అంతకుముందు ఎస్ఈసీఎల్ ప్రతిష్ఠాత్మక సీఎస్ఆర్ కార్యక్రమం ‘ ఎస్ఈసీఎల్ కే సుశ్రుత్’ ద్వారా మద్దతు పొందుతున్న నీట్ అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. బొగ్గు గనుల ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం కింద ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌ను అందిస్తారు. వారు తమ వైద్య విద్య లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. విద్యార్థుల విజయాలను మంత్రి అభినందించారు. బొగ్గు గనుల ప్రదేశాల్లోని యువతకు విద్య అవకాశాలను పెంపొందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
రాయ్పూర్ లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో, పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు (సీహెచ్దీ) ఉచిత చికిత్స, శస్త్రచికిత్సలను అందించే సీఎస్ఆర్ కార్యక్రమం 'ఎస్ఈసీఎల్ కి ధడ్కాన్' యువ లబ్ధిదారులతోనూ, వారి కుటుంబాలతోనూ కేంద్రమంత్రి సమావేశమయ్యారు. ప్రజల ప్రాణాలను రక్షించే దిశగా ఎస్ఈసీఎల్ తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే, ఆరోగ్య సేవలు, సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వ బొగ్గు రంగ సంస్థలు (పీఎస్యూలు ) ప్రభావవంతమైన చొరవలతో సహకారం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.
ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులతో నిర్వహించిన మరో సమీక్షా సమావేశంలో, ప్రస్తుతం జరుగుతున్న అన్వేషణ కార్యకలాపాలు, సర్వే పురోగతిని కేంద్రమంత్రి సమీక్షించారు. అధునాతన అన్వేషణ, మెరుగైన సమన్వయం ద్వారా చత్తీస్ గఢ్ లో ఖనిజ సామర్థ్యాన్ని వెలికితీసే వ్యూహాలపై చర్చించారు.
బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పర్యటన సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం మైనింగ్ సామర్థ్యాన్ని ఉపయోగించడానికి ప్రభుత్వ బలమైన నిబద్ధతను తెలియచేస్తుంది. సుస్థిరత, సామాజిక సమానత్వం, ప్రాంతీయ పురోగతి వంటి జాతీయ ప్రాధాన్యాలతో బొగ్గు రంగ వృద్ధిని సమీకృతం చేయాలన్న స్పష్టమైన దార్శనికతను ఇది ప్రతిబింబిస్తుంది. ఖనిజ అన్వేషణను వేగవంతం చేయడం మొదలుకొని ఔత్సాహిక యువతకు సాధికారత కల్పించడం, ఆరోగ్య సంరక్షణ ద్వారా ప్రాణాలను కాపాడటం వరకు క్షేత్రస్థాయి ప్రభావంతో ప్రభుత్వ విధానాన్ని అనుసంధానించడం ద్వారా బొగ్గు గనుల ప్రాంతాలను సౌభాగ్యం, ప్రతికూలతలను ఎదుర్కొనే సామర్థ్యం, సమగ్ర అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలనే ప్రభుత్వ అచంచల సంకల్పాన్ని ఈ పర్యటన పునరుద్ఘాటించింది.
***
(Release ID: 2121161)
Visitor Counter : 41