కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశ 6జీ దార్శనికత
Posted On:
03 APR 2025 2:57PM by PIB Hyderabad
ప్రభుత్వం 2023 మార్చి నెలలో భారత్ 6జి దార్శనిక పత్రాన్ని విడుదల చేసింది. దీని ఉద్దేశం 6జి నెట్‌వర్క్ సంబంధిత టెక్నాలజీలను డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడం, అమల్లోకి తేవడం ఈ దార్శనిక పత్రం ఉద్దేశాలు. ఇవి ప్రపంచానికి ఉన్నత నాణ్యతతో కూడిన జీవన అనుభూతిని ఇవ్వడానికి ఆధునిక, సురక్షిత సంధాన సదుపాయాన్ని సమకూరుస్తాయి. దీంతో 2030వ సంవత్సరానికల్లా భారత్‌కు 6జి టెక్నాలజీలో ప్రపంచంలోనే నాయకత్వ స్థానాన్ని కట్టబెట్టే అవకాశం ఉంటుంది. దేశంలో 6జి టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఈ కింది చర్యలను చేపట్టింది:
దేశంలో పరిశోధన-అభివృద్ధిని, నవకల్పనను ప్రోత్సహించడానికి 6జి టీహెచ్‌జడ్ టెస్ట్‌బెడ్, అడ్వాన్స్ ఆప్టికల్ కమ్యూనికేషన్ టెస్ట్‌బెడ్ అనే పేర్లు గల రెండు టెస్ట్‌బెడ్‌లకు అవసరమయ్యే నిధులను సమకూర్చడం.
భారత్‌లో సామర్థ్యాల పెంపు కోసం, 6జి కోసం సన్నద్ధంగా ఉండే విద్యాసంబంధమైన, అంకుర సంస్థలు దన్నుగా నిలిచే అనుబంధ విస్తారిత వ్యవస్థను నిర్మించడానికి 2023- 24 ఆర్థిక సంవత్సరంలో దేశమంతటా విద్యాసంస్థల్లో 100 5జి ప్రయోగశాలలను మంజూరు చేశారు.
6జి ఇకోసిస్టమ్ కోసం పరిశోధనల్లో వేగాన్ని పెంచడానికి, 6జి టెక్నాలజీ కోసం ప్రపంచ స్థాయి మార్గసూచీకి (రోడ్‌మ్యాప్)
అనుగుణంగా పరిశోధనను, నవకల్పనను ప్రోత్సహించడానికి 6జి నెట్‌వర్క్ ఇకోసిస్టమ్స్‌పై 111 రిసర్చ్ ప్రతిపాదనలను ఆమోదించారు.
ప్రభుత్వం ‘భారత్ 6జి అలయన్స్’ను ఏర్పాటు చేయడానికి మార్గాన్ని సుగమం చేసింది. భారత్ 6జి దార్శనికతతో సరిపోలే కార్యాచరణను రూపొందించడానికి దేశీయ పరిశ్రమ, విద్య, జాతీయ పరిశోధన సంస్థలతోపాటు ప్రామాణిక సంస్థలతో కూడిన ఒక కూటమి ఇది. 6జి వైర్‌లెస్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించే దృష్టితో అగ్రగామి ప్రపంచ 6జి కూటములతో కలసి అవగాహన ఒప్పంద పత్రంపై సంతకాలు చేసింది. ఇది డబ్ల్యూటీఎస్ఏ 2024, ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024తో చేతులు కలిపి అంతర్జాతీయ 6జి సదస్సును (సింపోజియమ్) నిర్వహించింది. పారిశ్రామిక రంగ ప్రముఖులను, విద్యారంగ ప్రముఖులను, ప్రభుత్వ అధికారులను ఒక చోటుకు తీసుకువచ్చి6జి టెక్నాలజీలో స్థానిక, ప్రపంచ స్థాయి ప్రగతిని అవగాహన చేసుకోవడం ఈ సదస్సు ఉద్దేశం.
భారతదేశం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్‌కు చెందిన ఇంటర్నేషనల్ మొబైల్ టెక్నాలజీ (ఐఎంటీ)-2030 ఫ్రేంవర్కుకు తోడ్పాటును అందించింది. దీనినే పరిశ్రమ ‘6జి’ అని కూడా వ్యవహరిస్తోంది. దీనిలో ‘6జి’ వాడుక విధానాలైన ఆరింటిలోనూ ఒక రూపమనదగ్గ ‘‘ఆధునిక సంధానాన్ని’’ (‘యూబిక్విటస్ కనెక్టివిటీ’) ఒకటిగా చేర్చారు. దీనికి అదనంగా కవరేజిని, ఒక వ్యవస్థ మరొక వ్యవస్థ భాగాలు లేదా పరికరాలతో పనిచేయడానికి లేదా ఉపయోగించగల సామర్థ్యాన్ని (ఇంటర్ ఆపరబులిటీ), సుస్థిరత్వాన్ని సైతం 6జి టెక్నాలజీ సామర్థ్యాలలో చేర్చారు.
ఈ సమాచారాన్ని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజ్యసభలో ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2118647)