జల శక్తి మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన – సత్వర నీటిపారుదల ప్రయోజనాల (పీఎంకేఎస్ వై- ఏఐబీపీ) పరిధిలోకి బీహార్ లోని కోసి- మెచి నదీ అనుసంధాన ప్రాజెక్టు: కేబినెట్ ఆమోదం
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 6,282.32 కోట్లు: బీహార్ కు కేంద్ర సాయం రూ. 3,652.56 కోట్లు.. 2029 మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యం
ప్రస్తుత తూర్పు కోసి ప్రధాన కాలువను 41.30 కిలోమీటర్ల వరకు పునర్నిర్మించాలని, దానిని మేచి నది వరకు 117.50 కి.మీ. మేర విస్తరించాలని ప్రణాళిక
బీహార్‌లోని అరారియా, పూర్నియా, కిషన్‌గంజ్, కతిహార్ జిల్లాల్లో 2,10,516 హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ సమయంలో అదనపు వార్షిక నీటిపారుదల సౌకర్యాలు
తూర్పు కోసీ ప్రధాన కాలువ ప్రస్తుత ఆయకట్టుకు సరఫరా లోటు పునరుద్ధరణ
వర్షాకాలంలో మహానంద ఆయకట్టులో 2050 మిలియన్ క్యూబిక్ మీటర్ల కోసీ జలాల మళ్లింపు
Posted On:
28 MAR 2025 4:13PM by PIB Hyderabad
బీహార్‌లోని కోసీ - మెచి నదుల అనుసంధాన ప్రాజెక్టును జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన సత్వర నీటిపారుదల ప్రయోజనాల కార్యక్రమం (పీఎంకేఎస్ వై-ఏఐబీపీ)లో చేర్చడానికి ఆమోదం లభించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
2029 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం బీహారుకు రూ. 3,652.56 కోట్ల కేంద్ర సాయాన్ని కూడా సీసీఈఏ ఆమోదించింది. కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,282.32 కోట్లు.
కోసి మెచి నదీ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడున్న తూర్పు కోసీ ప్రధాన కాలువను పునర్నిర్మించడం, దానిని మరో 41.30 కిలోమీటర్లు- మేచీ నది దాకా 117.50 కిలోమీటర్ల వరకు విస్తరించడం ద్వారా.. కోసీ నది మిగులు జలాల్లో కొంత భాగాన్ని బీహార్‌లోని మహానంద పరీవాహక ప్రాంతానికి మళ్లించాలని భావిస్తున్నారు. తద్వారా బీహార్ గుండా ప్రవహిస్తున్న కోసి, మేచి నదులను బీహార్ లోనే అనుసంధానించవచ్చు.
ఈ ప్రాజెక్టు బీహార్‌లోని అరారియా, పూర్నియా, కిషన్‌గంజ్, కతిహార్ జిల్లాల్లో ఖరీఫ్ సమయంలో 2,10,516 హెక్టార్లలో అదనపు వార్షిక నీటిపారుదల సదుపాయాన్ని అందిస్తుంది. ప్రతిపాదిత అనుసంధాన కాలువ ద్వారా కోసి నదిలోని దాదాపు 2,050 మిలియన్ క్యూబిక్ మీటర్ల మిగులు జలాలను మళ్లించే/ఉపయోగించుకునే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంది. అంతేకాకుండా ఇప్పుడున్న తూర్పు కోసీ ప్రధాన కాలువను పునర్నిర్మించిన తర్వాత.. దాని ప్రస్తుత పరీవాహక ప్రాంతం 1.57 లక్షల హెక్టార్లకు నీటి సరఫరాలో లోటును పునరుద్ధరిస్తారు.
నేపథ్యం:
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్ వై) 2015-16లో ప్రారంభమైంది. వ్యవసాయ క్షేత్రాలకు నీటి లభ్యతను మెరుగుపరచడం, సాగు విస్తీర్ణాన్ని పెంచి నీటిపారుదలకు భరోసా కల్పించడం, వ్యవసాయ క్షేత్రాల్లో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, సుస్థిర జల సంరక్షణ పద్ధతులను ప్రవేశపెట్టడం మొదలైనవి ఈ కార్యక్రమ లక్ష్యాలు.
2021-26 కాలానికి పీఎంకేఎస్ వై అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని మొత్తం వ్యయం రూ.93,068.56 కోట్లు (కేంద్ర సాయం రూ.37,454 కోట్లు). పీఎంకేఎస్ వైలో భాగమైన సత్వర నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం (ఏఐబీపీ) ప్రధాన, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
పీఎంకేఎస్ వై - ఏఐబీపీ కింద ఇప్పటివరకు 63 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2016 ఏప్రిల్ నుంచి 26.11 లక్షల హెక్టార్లకు అదనపు నీటిపారుదల సామర్థ్యాన్ని కల్పించారు. 2021-22 నుంచి పీఎంకేఎస్ వై-2.0 మొదలుపెట్టిన తర్వాత ఏఐబీపీలో తొమ్మిది ప్రాజెక్టులను చేర్చారు. కోసి- మెచి అనుసంధాన ప్రాజెక్టు ఇందులో చేరిన పదో ప్రాజెక్టు.
***
(Release ID: 2116498)
Visitor Counter : 18