పర్యటక మంత్రిత్వ శాఖ
ప్రధాన పర్యాటక ప్రదేశాలలో రద్దీ నిర్వహణ వ్యూహాలు
Posted On:
27 MAR 2025 4:23PM by PIB Hyderabad
పర్యాటక ప్రదేశాల్లో స్వదేశీ దర్శన్ 1.0 ద్వారా ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యూట్‌లను గుర్తించి పర్యాటకులకు భద్రత కల్పించే ప్రాజెక్టులను మంజూరు చేశారు. పర్యాటక ప్రదేశాలలో రద్దీ నిర్వహణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అయినప్పటికీ పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యాటక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిరంతరం చర్చలు చేపడుతోంది. పర్యాటక శాఖ ప్రయత్నాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, కర్ణాటక కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఏదో ఒక రూపంలో పర్యాటక పోలీసులను మోహరించాయి.
పర్యాటక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్, ప్రసాద్, కేంద్ర ఏజెన్సీల పథకాలకు నిధులు అందించడం ద్వారా మౌలిక సదుపాయాలను సమ్మిళితంగా, సమగ్రంగా, స్థిరమైన పద్ధతిలో అభివృద్ధి చేస్తారు. ఇతర విషయాలతో పాటుగా భద్రత, రవాణా అనుసంధానం, పర్యావరణ పరిరక్షణ పై దృష్టి సారిస్తారు.
సందర్శకులకు భద్రత, రక్షణ, పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ర్యాంపులు, రెయిలింగ్‌లు, సీసీటీవీ వ్యవస్థలు, ప్రజా ప్రకటన పరికరాలు, సూచనా బోర్డులు, ఇల్యూమినేషన్, క్యూ కాంప్లెక్స్, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర పనులు మంజూరయ్యాయి.
పర్యాటక మంత్రిత్వ శాఖ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవరోధాలు లేని రవాణా సౌకర్యాలు, స్వచ్ఛ ఇంధన వనరులు, నిర్మాణం కోసం స్థానికంగా లభించే పదార్థాల వినియోగం, చివరి గమ్యస్థానాన్ని సైతం అనుసంధానించడం కోసం పర్యావరణ అనుకూల రవాణా ఎంపికలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ప్రోత్సహిస్తుంది. అదనంగా సుస్థిరమైన కార్యకలాపాలు, నిర్వహణ ప్రణాళికలను చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంది.
జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సూచించినట్లుగా 2014లో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు, నిర్వాహకులకు బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ప్రజల రద్దీ నిర్వహణ కోసం మార్గదర్శకాలను జారీ చేసింది.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా అందించారు.
***
(Release ID: 2116062)
Visitor Counter : 15