వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఈ-నామ్ ప్లాట్‌ఫాంలో పాలుపంచుకోవాల్సిందిగా రైతులకు ప్రోత్సాహం
Posted On:
18 MAR 2025 6:12PM by PIB Hyderabad
మంచి ధరలను రాబట్టుకోవడానికి జాతీయ వ్యవసాయ మార్కెట్టు (ఈ-నామ్..e-NAM)లో పాలుపంచుకోవాలంటూ చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించే దిశగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఈ-నామ్ పోర్టల్, మొబైల్ యాప్ (ఇది యాండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంది) .. ఈ వేదిక (ప్లాట్‌ఫాం)లను ఉపయోగించుకొంటూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. నమోదు, ట్రేడింగు ప్రక్రియల్లో రైతులకు సాయపడడానికి వ్యవసాయ ఉత్పాదన మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు టోల్-ఫ్రీ నంబర్ (18002700224) ను కూడా సమకూర్చారు.
చిన్న, సన్నకారు రైతులు పండించిన పంట వ్యక్తిగత ప్రాతిపదికన చూస్తే చిన్నదిగా ఉండవచ్చు, ఆయా పంటలను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ) మాధ్యమం ద్వారా ఒక చోటుకు తీసుకువచ్చినప్పుడు భారీ పరిమాణం వల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి వీలు ఉంటుంది. ఎఫ్‌పీఓలు సభ్య రైతులు సాధించిన దిగుబడులను ఒక చోటుకు చేర్చగలుగుతాయి. ఎఫ్‌పీఓ ట్రేడింగ్ మాడ్యూల్ ద్వారా ఈ-నామ్ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు.
ఫిబ్రవరి 28 నాటికి 4392 ఎఫ్‌పీఓలు ఈ-నామ్ వేదికపైకి వచ్చి నిలిచాయి.
దీనికి తోడు, ఒక రైతు తాను పండించిన పంటను.. ఏపీఎంసీ వద్దకు వెళ్లనక్కర లేకుండానే ఫాం గేట్ మాడ్యూలును ఉపయోగించుకోవడం ద్వారా అమ్మకానికి పెట్టుకోవచ్చు.
ఏపీఎంసీలు ఆయా రాష్ట్రాల ఏపీఎంసీ చట్టం నియంత్రణ పరిధిలో పనిచేస్తుంటాయి. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా అంతర్ రాష్ట్ర వ్యాపారం చేయాలంటే గనక ఇతర రాష్ట్రాల వ్యాపార లైసెన్సులకు గుర్తింపునివ్వడానికి తదనుగుణమైన నిబంధనలు అవసరమవుతాయి.
రాష్ట్రాల మధ్య వ్యాపారంతోపాటు మార్కెట్ల మధ్య వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్)కు సంబంధించిన సవాళ్లు ఎదురవుతాయన్న సంగతిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ-నామ్ ప్లాట్‌ఫాంను ‘ఈ-నామ్ 2.0’ అనే రూపంలో ఉన్నతీకరించాలని (అప్‌గ్రేడేషన్) నిర్ణయించింది. ఇది లాజిస్టిక్ సేవలను అందించే వివిధ సంస్థలను కలుపుకొని ముందుకుపోవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. లాజిస్టిక్ సంబంధిత అంతరాన్ని తొలగించడంతోపాటు వ్యాపారాన్ని వేగవంతం చేయాలని, వ్యర్థాలను తగ్గించాలని, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలన్నవి కూడా ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశాలే.
రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాల వ్యవసాయ మార్కెటింగ్ బోర్డుల నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా ఆయా సరకులకు వ్యాపార యోగ్య కొలమానాలను ఖరారు చేస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నాటికి ఈ-నామ్ వేదిక ద్వారా ఆన్‌లైన్ వేలంపాట కోసం 231 సరకులకు వ్యాపార యోగ్య కొలమానాలను ఖరారు చేశారు.
ప్రస్తుత ఈ-నామ్ వేదికను మరింత సమర్ధమైందిగా, యూజర్లకు అనుకూలమైందిగా, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకుపోయేదిగా, బాహాటమైన నెట్‌వర్కుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ఉన్నతీకరించాలని నిర్ణయించారు. బ్యాంకు ఖాతా నిజమైందేనని తెలియజేయడం, ఆధార్‌ను ఉపయోగించి ఈకేవైసీ సౌకర్యం- నిర్ధారణ, లాజిస్టిక్స్, ఇంకా ఇతర విలువ జోడించిన సేవలను అందించే సంస్థలను చేర్చుకోవడం.. ఇవి ఈ-నామ్ 2.0 విశేషాంశాలలో చెప్పుకోదగ్గవి.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2112767)
Visitor Counter : 6