రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
మందుల ధరల క్రమబద్ధీకరణ సూత్రాలను నిర్ధరిస్తున్న జాతీయ ఔషధ ధరల విధానం (ఎన్‌పీపీపీ), 2012
• వినియోగదారులకు మేలు చేయడంతోపాటు పారదర్శకత కోసం
‘ఫార్మా సహీ దామ్’ పేరిట ఎన్‌పీపీఏ మొబైల్ యాప్
Posted On:
11 MAR 2025 3:15PM by PIB Hyderabad
మందుల ధరలకు క్రమబద్ధీకరణ సూత్రాలను జాతీయ ఔషధ ధరల విధానం (ఎన్‌పీపీపీ), 2012 నిర్ధరిస్తోంది. ఈ విధానంలో భాగంగా ధరల క్రమబద్ధీకరణకు అనుసరించే కీలక సూత్రాల్లో ఒకటోది మందులు ఎంత అత్యవసరం అనే ప్రాతిపదిక; రెండోది ఫార్ములేషన్స్ ధరల విషయంలో మాత్రమే క్రమబద్ధీకరణ; ఇక మూడోది.. ఖర్చు ఆధారిత ధరల విధానం కాకుండా మార్కెట్ ఆధారిత ధరల ఖరారు విధానం. ప్రస్తావిత విధానానికి అనుగుణంగా, ఔషధ విభాగం (డీఓపీ) పరిధిలోని జాతీయ ఔషధ ధరల ఖరారు ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) మందుల (ధరల నియంత్రణ) ఉత్తర్వు (డీపీసీఓ)-2013లోని నిబంధనల మేరకు గరిష్ఠ ధరలను ఖాయపరుస్తుంది.
డీపీసీఓ, 2013 పరిధిలో అవసరమైన మేరకు మందులకు సంబంధించిన మార్కెట్ ఆధారిత సమాచారాన్ని (డేటా) సేకరించడానికి ఇంటిగ్రేటెడ్ ఫార్మస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐపీడీఎంఎస్)ను ఏర్పాటు చేశారు. ఇది రిటర్నులను, నివేదికలను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా సమర్పించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. దీని తాజా వెర్షను పేరు ఐపీడీఎంఎస్ 2.0. ఇది కట్టుదిట్టమైన గరిష్ఠ ధరలు, చిల్లర ధరల (రిటైల్ ప్రైసెస్)కు సంబంధించిన సమాచారాన్ని చూపుతుంది. ఈ సమాచారాన్ని అందరు ఆసక్తిదారులకు చేరవేయడానికి అప్పుడప్పుడు సవరించి తాజాపరుస్తుంటారు.
డీలర్లు, రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, ప్రభుత్వం.. వీటికి ప్రతి తయారీదారు సంస్థ ధరల జాబితాను, ధరల అనుబంధ జాబితాను జారీ చేయాలని డీపీసీఓ- 2013 సూచిస్తోంది. ఈ విషయంలో ఫార్మలేషన్స్‌కయితే ఫాం-V, వైద్య పరికరాలకయితే ఫాం-VIను అనుసరించాలి. ఇంకా, ప్రతి చిల్లర విక్రేత (రిటైలర్), డీలరు.. వీరు తయారీదారు సంస్థ ధరల జాబితాను, ధరల అనుబంధ జాబితాను అందించి ఉంటే వాటిని తమ వ్యాపార ప్రదేశాల్లో ప్రముఖంగా కనిపించేలా పెట్టాలి. ఉత్పాదన (ప్రోడక్ట్) వివరాలు, పంపిణీదారులకు ఏ ధర, చిల్లర విక్రేతలకయితే ఏ ధర, ధరల్లో మార్పులు, ఏ తేదీ నుంచి ధరలలో సవరణ వర్తిస్తుంది వగైరా అంశాలన్నీ ప్రస్తావించిన ఫారాలలో భాగంగా ఉంటాయి.
వినియోగదారులకు మేలు చేయడానికి, పారదర్శకతకు చోటు ఇవ్వడానికి ఎన్‌పీపీఏ మొబైల్ యాప్2ను ఫార్మా సహీ దామ్ (పీఎస్‌డీ) పేరుతో తీసుకువచ్చింది. దీనిని యాండ్రాయిడ్‌పై ఆధారపడి పనిచేసే పరికరాలను దృష్టిలో పెట్టుకొని గూగల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. ఆపిల్ అయితే, యాప్‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొనే వీలు ఉంటుంది. మందుల బ్రాండ్ పేరు, కంపోజిషను, గరిష్ఠ ధర, గరిష్ఠ చిల్లర ధర.. ఈ వివరాలను పీఎస్‌డీ చూపుతుంది. ధరలను ఖాయపరిచిన, లేదా సవరించిన ఫార్ములేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్లన్నీ ఎన్‌పీపీఏ వెబ్‌సైట్ (www.nppaindia.nic.in) లో ఉంటాయి. అంతేకాకుండా, పారదర్శకత్వానికి పెద్ద పీటను వేసే క్రమంలో ప్రతిపాదిత సవరించిన ధరల నోటిఫికేషన్లకు సంబంధించిన ధరల లెక్కింపు షీట్ల ముసాయిదా వెర్షనును ఆసక్తిదారుల నుంచి వారి వ్యాఖ్యలను కోరుతూ 10 పనిదినాల పాటు ఎన్‌పీపీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో, చిల్లర విక్రేతకు వర్తించే ధర, లెక్కింపు కోసం అనుసరించే చలనశీల వార్షిక టర్నోవర్ విలువలను.. అవి వర్తించే చోటల్లా.. జోడిస్తారు. పైన ప్రస్తావించిన కాలంలోపు అందిన వ్యాఖ్యలను లెక్కలోకి తీసుకొన్న తరువాత గరిష్ఠ ధరలను, చిల్లర ధరలను ఎన్‌పీపీఏ ఖాయపరుస్తుంది.ఈ విధంగా, ప్రస్తుత విధానానికి అనుగుణంగా ఉన్న ధరల ఖరారు ప్రక్రియంతా కూడా బహిరంగంగా అందుబాటులో ఉంది. దీనివల్ల పారదర్శకత్వానికి, జవాబుదారుతనానికి పెద్దపీట వేసినట్లయింది. ఇక ఇందులో ఎలాంటి మార్పునకూ అవకాశం లేదు.
***
(Release ID: 2110333)
Visitor Counter : 8