నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ల్యాడింగ్ బిల్లు-2025 బిల్లులను ఆమోదించిన లోకసభ: 169 ఏళ్ల నాటి వలస చట్టానికి కొత్త రూపు
“భారతదేశపు చట్టాలను ఆధునికీకరించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా లోకసభలో ‘ల్యాడింగ్ బిల్లు-2025 బిల్లుల ఆమోదం’ కీలకమైన ముందడుగు. తద్వారా దానిని మరింత ఔచిత్యవంతంగా, ఆధునికంగా, సులభంగా తీర్చిదిద్దడంతోపాటు మన పురోగతికి ఎంతోకాలం అవరోధంగా ఉన్న వలసవాద ఛాయల నుంచి విముక్తం చేయడం మా సంకల్పం’’: శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
10 MAR 2025 9:40PM by PIB Hyderabad
దేశ నౌకారవాణా రంగంలో పెరుగుతున్న వృద్ధికి ఊతమిచ్చే చర్యల్లో భాగంగా.. ‘ల్యాడింగ్ బిల్లు-2025’ బిల్లులను కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రవేశపెట్టారు. నౌకాయాన పత్రాల కోసం చట్టపరమైన చట్రాన్ని నవీకరించడం, సరళీకృతం చేయడం దీని లక్ష్యం. వలసపాలన నాటి భారత ల్యాడింగ్ బిల్లుల చట్టం- 1856 స్థానంలో ఈ ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు. సముద్ర రవాణా కోసం దీని ద్వారా మరింత ఆధునికమైన, వినియోగదారీ అనుకూల విధానాన్ని ఇది అందిస్తుంది. 169 ఏళ్ల నాటి వలస కాలపు షిప్పింగ్ చట్టాన్ని ఆధునికీకరిస్తూ, ల్యాడింగ్ బిల్లు- 2025 బిల్లులను లోకసభ ఆమోదించింది.
మూడు సంక్షిప్త విభాగాలతో కూడిన ప్రస్తుత చట్టం.. ప్రధానంగా హక్కుల బదిలీ, నౌకలో సరుకుల లోడింగ్ ధ్రువీకరణ వ్యవహారాలను నియంత్రిస్తుంది. షిప్పింగ్ పరిశ్రమలో సరికొత్త పరిణామాలు, అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మార్పుల నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత సమగ్రమైన, సులభంగా అర్థమయ్యే చట్టాన్ని రూపొందించుకోవడం భారత్ కు అత్యావశ్యకం.
ల్యాడింగ్ బిల్లు-2024 బిల్లుల ద్వారా ప్రస్తుత చట్టం పేరు ల్యాడింగ్ బిల్లుల చట్టం-2025గా మారుతుంది. పలు కీలక సంస్కరణలు ఇందులో ఉన్నాయి. భాషను సులభతరం చేయడం, వాటి అంతర్లీన సారాన్ని మార్చకుండా నిబంధనలను పునర్వ్యవస్థీకరించడం కొత్త చట్టం లక్ష్యం. 1856 చట్టంలోని వలసవాద ఛాయలను తొలగిస్తూ.. ప్రామాణిక రద్దు, పొదుపు క్లాజును చేర్చడంతోపాటు చట్టం అమలును సులభతరం చేయడానికి ఆదేశాలు జారీ చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఇది అధికారం ఇస్తుంది.
ఈ సందర్భంగా కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. “ఆధునిక, సమర్థవంతమైన, అంతర్జాతీయంగా పోటీ పడగల నౌకారవాణా రంగం దిశగా భారత ప్రస్థానంలో ఈ రోజు చరిత్రాత్మకమైనది. భారతదేశపు చట్టవ్యవస్థను ఆధునికీకరించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా లోకసభలో ‘ల్యాడింగ్ బిల్లు-2025 బిల్లుల ఆమోదం’ కీలకమైన ముందడుగు. తద్వారా దానిని మరింత ఔచిత్యవంతంగా, ఆధునికంగా, సులభంగా తీర్చిదిద్దడంతోపాటు మన పురోగతికి ఎంతోకాలం అవరోధంగా ఉన్న వలసవాద ఛాయల నుంచి విముక్తం చేయడం మా సంకల్పం. కాలం చెల్లిన భారతీయ లాడింగ్ బిల్లుల చట్టం-1856 స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లు పాతకాలపు నిబంధనలను తొలగిస్తుంది. భారత సముద్ర చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుంది. సులభమైన, మరింత సురక్షితమైన నౌకారవాణా పద్ధతులకు అవకాశం కల్పిస్తుంది’’ అన్నారు.
క్రమబద్ధమైన వ్యాపార ప్రక్రియ, వివాదాలను తగ్గించడంతోపాటు రవాణాదారులు (క్యారియర్స్), సరుకు సరఫరాదారులు (షిప్పర్లు), సరుకుపై చట్టబద్ధమైన హక్కుదారులకు మెరుగైన స్పష్టతను అందించడం సహా అనేక ప్రయోజనాలు ఈ మార్పుల వల్ల లభిస్తాయి. ఈ నవీకరణలు మరింత సమర్థవంతమైన, విశ్వసనీయమైన షిప్పింగ్ వాతావరణాన్ని పెంపొందిస్తాయని భావిస్తున్నారు.
‘‘వివాదాలను తగ్గిస్తూ వ్యాపారాల్లో నౌకారవాణా ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ ప్రాధాన్యాన్ని పెంచేందుకు ల్యాడింగ్ బిల్లుల చట్టంలో ఈ ఆధునికీకరణ ఉపయోగపడుతుంది. సముద్ర వాణిజ్యంలో భారత్ ను అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలిపే దిశగా ఇది కీలకమైన ముందడుగు. ఈ చట్టంలో విప్లవాత్మకమైన మార్పులు కేవలం ఓ సాంకేతిక నవీకరణ మాత్రమే కాదు.. వికసిత భారత్ ను సాకారం చేయడంలో మా అంకిత భావాన్ని ఇది వెల్లడిస్తుంది. కాలం చెల్లిన వలస కాలం నాటి విధానాలను వికసిత భారత్ లో మేం కొనసాగించబోం. భాషను సులభతరం చేయడం, నిబంధనలను పునర్వ్యవస్థీకరించడం, ఈ చట్టాన్ని మెరుగ్గా అమలు చేసి నిర్వహించేలా ప్రభుత్వానికి అధికారాన్నివ్వడం ద్వారా మరింత వాణిజ్యానుకూల పరిస్థితులను కల్పిస్తున్నాం. అది చట్టపరమైన సంక్లిష్టతలను తగ్గించడంతోపాటు మన సముద్ర వాణిజ్యంలో విశ్వసనీయతను మరింతగా పెంపొందిస్తుంది. వాణిజ్యాన్ని సులభతరం చేయడం, వివాదాలను తగ్గించడం, ప్రపంచ నౌకారవాణాలో భారత్ ను ముందంజలో నిలపడం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు ఆమోదం నిదర్శనం. మనం పురోగమిస్తున్న తరుణంలో- వ్యాపారాలను, వ్యక్తులను సాధికారికం చేస్తూ.. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పాత్రను పెంచే కీలకమైన సాధనంగా ఈ బిల్లు ఉపయోగపడుతుంది. తద్వారా వేగంగా మారుతున్న అంతర్జాతీయ మార్కెటులో భారత్ వేగంగా ముందుకు సాగుతుంది’’ అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.
భారత సముద్ర చట్టాల ఆధునికీకరణ, అంతర్జాతీయ నౌకారవాణా రంగంలో దేశ పోటీతత్వాన్ని పెంచేందుకు చేస్తున్న విస్తృత కృషిలో ల్యాడింగ్ బిల్లు- 2024 బిల్లులు ఓ భాగం. నేడు లోకసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.
***
(Release ID: 2110230)
Visitor Counter : 20