యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పాఠశాల క్రీడలు, కోచ్‌లు, క్రీడాకారుల సంక్షేమంపై కొత్త ఆలోచనలతో ముగిసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల క్రీడామంత్రుల మేధోమథన (చింతన్ శిబిర్) సమావేశాలు
ఎల్ఏ 2028 సన్నద్ధతపై దృష్టి సారించిన రెండు రోజుల సెషన్: 2036 ఒలింపిక్స్ ఆతిథ్య ప్రణాళికపై చర్చ
Posted On:
08 MAR 2025 5:41PM by PIB Hyderabad
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా మంత్రులు, ఇతర ముఖ్య భాగస్వాముల రెండు రోజుల చింతనా శిబిరం నేడు హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసింది. 2036 వేసవి ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించే కలను సాకారం చేయడానికి, 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి సమష్టి దృష్టికోణం అవసరమని సమావేశం ఏకగ్రీవంగా అంగీకారానికి వచ్చింది.
ఈ రెండు రోజుల మేధోమథన సమావేశాలకు నేతృత్వం వహించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ఈ చింతనా శిబిరంలో జరిగిన చర్చలు కాన్ఫరెన్స్ రూమ్ నాలుగు గోడల మధ్య పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తున్న 2047 నాటికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత భారత్ దార్శనికతను సాకారం చేయడానికి అవి ఉత్ప్రేరకంగా పని చేయాలని ఆయన కోరారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
కన్హా శాంతి వనంలో చింతనా శిబిరం మొదటి రోజున, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు క్రీడల అభివృద్ధి, నిర్వహణపై కేంద్రీకృతమయ్యాయి. రెండో రోజున చర్చలలో పాఠశాల క్రీడలను ప్రోత్సహించ డానికి, సమర్థులైన కోచ్ లను తయారు చేయడానికి, అథ్లెట్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని భాగస్వాములు అంగీకరించారు.
శక్తివంతమైన యంత్రాంగం ద్వారా ప్రతిభను గుర్తించే ప్రక్రియ వేగంగా జరగాలని, ఏ ఒక్క ప్రతిభావంతుడినీ విస్మరించే పరిస్థితి ఉండకూడదని నిర్ణయించారు. డాక్టర్ మాండవియా మాట్లాడుతూ, క్రీడాకారులు దేశానికి అమూల్యమైన ఆస్తి అని, ప్రతి నమోదిత క్రీడాకారుని సమగ్రంగా పర్యవేక్షించి, సమర్థులుగా తీర్చిదిద్దడానికి జాతీయ క్రీడా సమాచార వ్యవస్థ (నేషనల్ స్పోర్ట్స్ రిపోజిటరీ సిస్టం) ను మరింత ఆధునీకరిస్తున్నామని తెలిపారు.
2036 ఒలింపిక్స్‌లో భారత్ టాప్ 10లో స్థానం సాధించాలంటే ప్రతిభను గుర్తించడం, వారిని సిద్ధం చేయడం ముందునుంచే ప్రారంభమవాల్సిన అవసరం ఉందని చర్చలో ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, జాతీయ పాఠశాల క్రీడల నిర్వహణను కొత్త రీతిలో రూపకల్పన చేయాలన్న ప్రతిపాదనను భాగస్వాములు జిల్లా స్థాయిలోనే పోటీ అనుభవాన్ని అందిస్తూ, క్రీడాకారుల ఎదుగుదలకు స్పష్టమైన దిశను చూపించే ఒక వ్యవస్థాబద్ధమైన వేదికగా దీన్ని తీర్చిదిద్దేలా చర్చలు జరిగాయి.
భారతదేశంలో 15 లక్షల పాఠశాలలు, ఎనిమిది కోట్ల మంది విద్యార్థులు ఉన్న నేపథ్యంలో అవకాశాలు అపారమని భాగస్వాములు భావించారు. రాష్ట్రాలు ఈ అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవడానికి జాతీయ క్రీడా సమాచార వ్యవస్థ (ఎన్ఎస్ఆర్ఎస్), ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ (కె ఐ ఆర్ టి ఐ) కార్యక్రమం సహాయాన్ని పొందవచ్చని సూచించారు.
ఈ చింతనా శిబిరంలోని ప్రధాన అంశాల్లో కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, మాజీ క్రీడాకారులు మళ్లీ క్రీడారంగానికి ఎలా తోడ్పడగలరో అన్వేషించాలని భావించారు. అత్యుత్తమ కోచ్‌లను వ్యవస్థలోకి తీసుకురావడానికి సరైన ప్రామాణీకరణ విధానం, అర్హతా నిబంధనలు ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. అలాగే, కోచ్‌ల సంక్షేమం, వారి సమగ్ర నైపుణ్యాభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.
క్రీడాకారులే అన్ని అభివృద్ధి కార్యక్రమాల కేంద్ర బిందువుగా ఉండాలని చర్చలో అభిప్రాయపడ్డారు. క్రీడాకారుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులో ఉంచిందని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని డాక్టర్ మాండవియా రాష్ట్రాలను కోరారు. ఖేలో ఇండియా స్టేట్ ట్రైనింగ్ సెంటర్లను ఉపయోగించుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని డాక్టర్ మాండవీయ కోరారు.
బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించడంలో రాష్ట్రాలు... కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన పిలుపును కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే పునరుద్ఘాటించారు. 'మా లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి-ఒలింపిక్స్ లో రాణించాలంటే కలిసికట్టుగా పనిచేయాలి' అని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాలు తమ క్రీడా యంత్రాంగాలను పెంపొందించుకోవడానికి పరస్పరం ఉత్తమ పద్ధతులను అవలంబించాలని, అమలు చేయాలని శ్రీమతి ఖడ్సే కోరారు.. దీనిపై తాము పరస్పర అభ్యాసం సహకారానికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్రాలు పునరుద్ఘాటించాయి. స్వాతంత్ర్య వందో వత్సరం నాటికి భారతదేశాన్ని శక్తిమంతమైన అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా మార్చేందుకు నిబద్ధతను ప్రకటించాయి.
*****
(Release ID: 2109518)
Visitor Counter : 22