రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో డీఆర్డీవో డా. ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ ను సందర్శించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 28 FEB 2025 5:23PM by PIB Hyderabad

స్వదేశీ క్షిపణి వ్యవస్థలను రూపొందించి, అభివృద్ధి చేయడంలో ప్రధాన కేంద్రంగా పరిగణించే డీఆర్డీవోకు చెందిన డా. ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ ను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు సందర్శించారు. ఇది తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) చేపడుతున్న క్షిపణి సాంకేతికతలు, వాటికి సంబంధించిన కార్యక్రమాల గురించి ఆయన తెలుసుకున్నారు. రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగ కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, ఆర్సీఐ సీనియర్ శాస్త్రవేత్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గతేడాది నవంబర్‌లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ యాంటీ-షిప్ మిస్సైల్ ప్రాజెక్ట్ బృందాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సత్కరించారు. ఈ విజయం ద్వారా హైపర్సోనిక్ క్షిపణి సామర్థ్యాలు కలిగిన దేశాల జాబితాలో భారత్‌కు చోటు దక్కింది.

దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు అసమానమైన సహకారం అందిస్తున్న శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి ప్రశంసించారు. ఈ తరహా సమష్టి  ప్రయత్నాల ద్వారా 2027 నాటికి భారత్ మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అంకితభావంతో, నిజాయితీతో పని చేస్తూ, వేగంగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను తమ ప్రాజెక్టుల్లో వినియోగించాలని శాస్త్రవేత్తలకు ఆయన సూచించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. సైన్స్,  టెక్నాలజీ రంగంలో, ముఖ్యంగా క్షిపణి అభివృద్ధికి మాజీ రాష్ట్రపతి చేసిన కృషిని ఎప్పటికీ మరచిపోలేమని ఆయన పేర్కొన్నారు.

క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి, ఆత్మనిర్భర భారత్‌ను సాధించడంతో పాటు సాంకేతికతల్లో దేశాన్ని అగ్రస్థానానికి చేర్చే దిశగా డీఆర్డీవోకున్న నిబద్ధత గురించి సంస్థ ఛైర్మన్ వివరించారు.. "ప్రపంచం కోసం రక్షణ వ్యవస్థలు భారత్‌లో తయారవుతాయి’’ అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడానికి డీఆర్డీవో కృషి చేస్తుంది" అని ఆయన తెలిపారు.

 

****


(Release ID: 2107289)
Read this release in: English , Urdu , Hindi