వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఉపగ్రహం ద్వారా పంట నష్టం అంచనా
Posted On:
11 FEB 2025 5:23PM by PIB Hyderabad
మహలనోబిస్ జాతీయ సస్య సూచన కేంద్రం (ఎంఎన్ సీఎఫ్సీ) ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేయడం ద్వారా రిమోట్ సెన్సింగ్ సమాచారం (ఉపగ్రహ) సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద సకాలంలో, పారదర్శకంగా దిగుబడిని అంచనా వేయడం కోసం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రయోగాత్మక అధ్యయనాలు నిర్వహించింది. వీటి ఆధారంగా.. భాగస్వాములతో చర్చలు, సాంకేతికపరమైన సంప్రదింపుల అనంతరం 2023 ఖరీఫ్ నుంచి వరి, గోధుమ పంటల కోసం ఎస్-టెక్ (సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనా వ్యవస్థ)ను ప్రవేశపెట్టారు. పంట నష్టం అంచనాను మెరుగుపరచడానికి, రైతులకు సకాలంలో బీమా క్లయిముల చెల్లింపులను అందించడం కోసం.. సాంప్రదాయక పంట కోత ప్రయోగాల (సీసీఈ)తో కలిసి సాంకేతికత ఆధారిత దిగుబడి అంచనాను ప్రభుత్వం అమలు చేసింది. దిగుబడి అంచనాలో ఎస్-టెక్ ద్వారా పొందిన సమాచారానికి ఈ కార్యక్రమం ద్వారా 30% వెయిటేజీ కేటాయింపును తప్పనిసరి చేశారు.
దీనిని అమలు చేస్తున్న అన్ని రాష్ట్రాలు 2023 ఖరీఫ్ లో ఎస్ టెక్ ను ఉపయోగించి క్లయిముల లెక్కింపు, చెల్లింపులను విజయవంతంగా పూర్తిచేశాయి. ఇందులో భాగస్వాములైన వారెవరూ ఎలాంటి వివాదాన్నీ లేవనెత్తలేదు. దీంతో వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరిగింది.
ప్రధానమంత్ర ఫసల్ బీమా యోజన ప్రధానంగా ‘విస్తీర్ణ ఆధారిత’ ప్రాతిపదికన అమలవుతుంది. విత్తక ముందు నుంచి పంట కోత అనంతర దశ వరకు.. అనివార్యమైన అన్ని ప్రకృతి విపత్తుల నుంచి రైతులకు కలిగే పంట నష్టాలు సమగ్రంగా దీని పరిధిలోకి వస్తాయి. ఈ పథకం కింద రైతులు అతి స్వల్ప ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అయితే వడగండ్ల వాన, కొండ చరియలు విరిగిపడడం, ముంపు, క్లౌడ్ బరస్ట్, అడవుల్లో మంటల వంటి స్థానిక కారణాల వల్ల నష్టాలపాటు.. తుఫాను, అకాల వర్షాలు, వడగండ్ల వానల వంటి పంట కోత అనంతర నష్టాలను వ్యక్తిగతంగా బీమా చేసిన వ్యవసాయ క్షేత్ర ప్రాతిపదికన లెక్కిస్తారు.
ఏజెన్సీలు కొనుగోలు చేయకపోవడం లేదా వాటి ద్వారా సేకరణలో జాప్యం వల్ల పంటలకు కలిగే నష్టం ఫసల్ బీమా యోజన పరిధిలోకి రాదు.
పంటల బీమా పథకాల్లో సమీక్ష/ సవరణలు/ హేతుబద్ధీకరణ/ మెరుగుదల నిరంతర ప్రక్రియ. భాగస్వాముల/ అధ్యయనాల ద్వారా సలహాలు/ విజ్ఞప్తులు/ సిఫార్సులను ఎప్పటికప్పుడు స్వీకరిస్తారు. వీటి ద్వారా పొందిన అనుభవం, వివిధ భాగస్వాముల అభిప్రాయాల ఆధారంగా.. పారదర్శకత, జవాబుదారీతనాలను మెరుగుపరచడంతోపాటు రైతులకు సకాలంలో క్లయిములను చెల్లించి, ఈ పథకాన్ని రైతులకు మరింత అనువైనదిగా మార్చడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మార్గదర్శకాలను ప్రభుత్వం కాలానుగుణంగా సమగ్రంగా సవరించింది. తద్వారా ఈ పథకం ద్వారా లభించాల్సిన ప్రయోజనాలు రైతులకు సకాలంలో, పారదర్శకంగా అందేలా చూస్తోంది.
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ లోకసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2102776)
Visitor Counter : 16