సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ‘జయతి జయ మమః భారతం’: గణతంత్ర దినోత్సవ పరేడ్ లో సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ప్రదర్శన
50కి పైగా నృత్య రూపాలను ప్రదర్శించిన 5000 మందికి పైగా జానపద, గిరిజన కళాకారులు
‘అతిపెద్ద భారతీయ జానపద నృత్యాల ప్రదర్శన’గా గిన్నిస్ ప్రపంచ రికార్డు
Posted On:
26 JAN 2025 8:59PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవ కవాతులో సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ అద్భుత ప్రదర్శన ‘జయతి జయ మమః భారతం (జేజేఎంబీ)’ చూపరులను మంత్రముగ్ధులను చేసింది. భారతీయ జానపద, సాంస్కృతిక కళారూపాల సుసంపన్నతనూ వైశిష్ట్యాన్నీ చాటిన సాంస్కృతిక ఉత్సవంగా నిలిచింది. దేశ సాంస్కృతిక, వారసత్వపు వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహించేలా దేశం నలుమూలల నుంచీ ఎంపిక చేసిన 5000 మందికి పైగా జానపద, గిరిజన కళాకారుల బృందం కళాత్మక వారసత్వాన్ని, యువశక్తిని, నారీశక్తిని ప్రతిబించింది.
సుసంపన్నమైన భారతీయ వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికపై చాటేలా 5,000 మందికి పైగా కళాకారులు 50కి పైగా జానపద, గిరిజన నృత్యరూపాలను ప్రదర్శించారు. నృత్యరీతుల కూర్పు వికసిత భారత్, విరాసత్ భీ వికాస్ భీ, ఏక్ భారత్ శ్రేష్టతా భారత్ ఇతివృత్తాలను చాటింది. లక్షలాదిమందిని సమ్మోహితులను చేస్తూ, వైభవంగా సాగిన ఈ కార్యక్రమం ‘అతిపెద్ద భారతీయ జానపద నృత్యాల ప్రదర్శన’గా గిన్నిస్ ప్రపంచ రికార్డుల గుర్తింపు పొందింది. భారతీయ సాంస్కృతిక సుసంపన్నతను అంతర్జాతీయంగా చాటేలా ఈ ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు.
50కి పైగా జానపద, గిరిజన నృత్యరీతులు:
50కి పైగా జానపద, గిరిజన నృత్యరీతులతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన ఈ ప్రదర్శన ప్రాంతీయ అస్తిత్వాలన్నింటినీ మేళవించి దేశ ఐక్యతను సగర్వంగా చాటింది. స్థానిక వ్యవసాయ పద్ధతులు - పంటకోత విధానాలను ప్రదర్శించడంతోపాటు జంతువుల అనుకరణను, శుభ సందర్భాలనూ కొత్త ఆరంభాలనూ సూచించేవిగానూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటేవిగానూ ఈ నృత్యరూపాలు ఉన్నాయి.
మంచు సింహం, మోన్పా మాస్కు నృత్యాలకు జీవం పోసి అరుణాచలప్రదేశ్ కళాకారులు సంభ్రమాన్ని కలిగించారు. అస్సాం కళాకారుల అద్భుతమైన బిహు నృత్య ప్రదర్శన, హుషారుగా సాగిన రాజస్థాన్ కళాకారుల కల్బేలియా నాట్యం భారతీయ జానపద చేతనకు నిదర్శనంగా నిలిచాయి. మంత్రముగ్ధులను చేసిన కేరళ కళాకారుల పదాయని ప్రదర్శన, బెంగాల్ కళాకారుల గంభీరమైన ఛౌ నృత్యం ప్రేక్షకులను కట్టిపడేశాయి. భారతీయ నృత్యరూపాల కథన కౌశలానికి ఇవి నిదర్శనంగా నిలిచాయి. మధ్యప్రదేశ్ బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన బఢాయి జానపద నృత్యం, మెంటాక్ పుష్ప నృత్యం శుభ సందర్భాలనూ సరికొత్త ఆరంభాలనూ సూచించేవిగా ఉన్నాయి. ప్రతి నృత్యమూ ఆ ప్రాంత సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రతిబింబించింది. సంగీతాన్నీ నృత్యాన్నీ ఆహార్య విశేషాలనూ మేళవించి సాధికారికంగా కాళ్లను కదుపుతూ కళాకారులు చేసిన ప్రదర్శన వీక్షకులను సమ్మోహితులను చేసింది.
ఈ ఘనమైన ప్రదర్శన భారతదేశ భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ప్రాంతీయ నృత్యరీతులు, సంగీత సంప్రదాయాల విశేష సమ్మేళనం భారతీయ సంస్కృతిలోని పరస్పర అనుసంధానతను చాటింది. అతిశయం ఉట్టిపడే భంగ్రా నృత్యం నుంచి మనోహరమైన అడుగులేసే గర్భా నాట్యం వరకు.. సంక్లిష్ట కథన విశేషమైన యక్షగానం నుంచి లయబద్ధమైన సంబల్పురి ప్రదర్శన వరకు... తమ మౌలిక సాంస్కృతిక వారసత్వ వైశిష్ట్యాన్ని చాటాయి, భారతీయ సంస్కృతి ఘనతను సమష్టిగా ప్రతిబింబించాయి. విశేషంగా వినియోగించిన అంబాలా కావడి, పూజా కావడి వంటి పుష్ప, ఉత్సవ సామగ్రి వేడుకగా సాగిన ఈ కార్యక్రమ ఆధ్యాత్మిక కోణాన్నీ వెల్లడించాయి. భక్తి, ఆనందాలను ప్రతీకాత్మక భావాలుగా ఈ ప్రదర్శన సాంప్రదాయక కళారూపాల్లో ఆవిష్కరించింది.
దుస్తులు, వస్తు విశేషాలు
దుస్తులు, అవసరమైన వస్తువులను సమకూర్చుకునే విషయంలో అత్యంత శ్రద్ధ వహించడం ‘జయతి జయ మమః భారతం’ విజయవంతం కావడంలో కీలకమైన అంశం. కాంతివంతమైన రంగులు, అందమైన ఎంబ్రాయిడరీలతో.. తమ ప్రాంత ప్రత్యేకతలను చాటేలా సాంప్రదాయక వేషధారణలో కళాకారులు అలంకరించుకున్నారు. అచ్చమైన ఆభరణాలు, విశేషంగా అలంకరించిన తలపాగా, వివిధ ఉపకరణాలు ఈ ప్రదర్శనకు అదనపు ఆకర్షణలు. మరోవైపు ఈటెలు, ఖడ్గాలు, కావడి, పూల అమరికల వంటి ఏర్పాట్లు నృత్యరీతుల్లో కూర్పునకు పరిణతినీ ప్రామాణికతనూ తీసుకొచ్చాయి.
ఉత్సవ వస్తువులు, ముసుగులు, వివిధ బొమ్మలు, జంతు చిత్రాలు సహా 60కి పైగా ప్రత్యేకమైన వస్తువుల విషయంలో దర్శకుడు చిత్తరంజన్ త్రిపాఠి నేతృత్వంలోని అరుణ కుమార్ మాలిక్, పరాగ్ శర్మ, నళినీ జోషితో కూడిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిపుణుల బృందం కీలక పాత్ర పోషించింది. నృత్యరీతుల కూర్పునకు తోడు ప్రత్యేకంగా రూపొందించిన ఈ అంశాలు ప్రదర్శనకు మరింత వన్నెతెచ్చాయి. వ్యక్తిగత, ప్రాంతీయ ప్రత్యేకతలతోపాటు సమష్టి జాతీయతా స్ఫూర్తిని ఇవి చాటాయి. ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తూ ఆ బొమ్మలు, జంతువుల బొమ్మలతో మమేకమయ్యారు.
సంగీతం, గేయాలు, వ్యాఖ్యానం, నృత్యరీతుల కూర్పు
చారిత్రక ప్రదర్శన అయిన ‘జయతి జయ మమః భారతం’ సంగీత కూర్పునకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి - సుభాష్ సెహగల్ రచించగా, శంకర్ మహదేవన్ స్వరపరిచారు. దీనికి హరీశ్ భీమని నేపథ్య గాత్రాన్ని అందించారు. భారతీయ సాంప్రదాయిక స్వరాలను సమకాలీన శ్రుతులతో నైపుణ్యంతో అనుసంధానించడం ద్వారా అన్ని తరాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్న ఈ ప్రదర్శన కర్తవ్యపథ్ లో ఆహ్లాదాన్ని నింపింది.
ఈ కళాత్మక ప్రదర్శనను సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ సంధ్య పురేచ ఆధ్వర్యంలో రూపొందించి, నిర్వహించారు. సహాయక నృత్య దర్శకులు సుభాష్ నకాషె, అంకుర్ పఠాన్, కల్పేశ్ దలాల్, సంజయ్ శర్మ, రంజిత్ గగోయ్ ఆమెకు సహకరించారు.
కోట్లాది మంది భారతీయుల హృదయ స్పందనలూ ఆశలూ శ్రావ్యంగా ప్రతిధ్వనిస్తుండగా.. 300 మంది కళాకారుల బృందం దేశీయ యుద్ధ వాయిద్యాలతో గణతంత్ర దినోత్సవ కవాతును నిర్వహించింది. ఢోలు, బాన్సురీ, షెహనాయిలు, మృదంగాల వంటి సాంప్రదాయిక, ప్రస్తుత వాయిద్య పరికరాలను నైపుణ్యంతో మిళితం చేసిన ‘సారే జహాసె అచ్చా’ ఆలాపన ఉత్తేజకరంగా సాగింది. ఈ వాయిద్యాల శ్రావ్యమైన మేళవింపుతో ప్రేక్షకుల్లో ఏకతా భావం ప్రతిధ్వనించింది. రణశింగ, టుటారి, శంఖం వంటి నాందీ వాయిద్యాలతో కార్యక్రమం మంగళప్రదంగా మొదలైంది. కవాతు మొదటినుంచే ఉత్తేజవంతంగా సాగేలా లయబద్ధతను అవి సృష్టించాయి.
గిన్నిస్ ప్రపంచ రికార్డులో స్థానం
ఇంతటి వైభవమూ పండుగ వాతావరణానికి తోడు ‘అతిపెద్ద భారతీయ జానపద నృత్యాల ప్రదర్శన’గా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పి ‘జయతి జయ మమఃభారతం’ చరిత్ర సృష్టించింది. మధ్యాహ్నం ఢిల్లీలోని పూసాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గిన్నిస్ అధికారులు ఈ చరిత్రాత్మక విజయాన్ని ప్రకటించారు.
సాంస్కృతిక - పర్యాటక శాఖల మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ అరుణీశ్ చావ్లా, ఆ శాఖ ఇతర అధికారులు కళాకారులందరి తరఫునా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ చరిత్రాత్మక గుర్తింపును పొందిన క్షణం దేశానికి గర్వకారణంగా నిలిచింది. వేలాది మంది కళాకారుల సమష్టి కృషి, సంగీత నాటక అకాడమీ, దేశ కళాత్మక వారసత్వాన్ని అసమాన స్థాయిలో ప్రదర్శించడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతనూ చాటింది.
***
(Release ID: 2097027)
Visitor Counter : 8