ప్రధాన మంత్రి కార్యాలయం
ఎల్ఐసీ బీమా సఖి యోజన ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
కర్నాల్‌లో మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ చేసిన పీఎం
గడచిన పదేళ్లలో మహిళా సాధికారతకు మా ప్రభుత్వం అసాధారణ చర్యలు చేపట్టింది: పీఎం
2047నాటికి అభివృద్ది చెందాలనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోంది: పీఎం
మహిళా సాధికారత సాధించేందుకు వారికి అపారమైన అవకాశాలు కల్పించడం, వారి మార్గంలో అవరోధాలను తొలగించడం ముఖ్యం: పీఎం
నేడు లక్షలాది మంది అమ్మాయిలను బీమా సఖీలుగా మార్చే కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది: పీఎం
Posted On:
09 DEC 2024 6:11PM by PIB Hyderabad
మహిళా సాధికారతను, ఆర్థిక రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన ‘బీమా సఖి యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే కర్నాల్ లోని మహారాణా ప్రతాప్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. మహిళా సాధికారత దిశగా ఈ రోజు మరో ముందడుగు వేశామని అన్నారు. మన గ్రంథాల్లో 9ని పవిత్రమైన అంకెగా భావిస్తారు. నవరాత్రి సమయంలో నవ దుర్గలుగా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రోజు 9వ తేదీనే కావడం విశేషం. ఈ రోజు నారీశక్తిని ఆరాధిస్తున్న రోజు కూడా అని ఆయన వివరించారు.
రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9నే జరిగిందని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. అలాగే రాజ్యాంగ రూపకల్పన జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో సమానత్వం, సమగ్రాభివృద్ధి సాధించే దిశగా ఈ తేదీ మనకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.
ప్రపంచానికి విలువలను, మత జ్ఞానాన్ని అందించిన భూమిగా హర్యానాను వర్ణించిన శ్రీ మోదీ, ఈ ఏడాది అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవం కురుక్షేత్రలో జరుగుతుడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గీతాభూమికి నమస్సులు అర్పించిన ప్రధానమంత్రి హర్యానాలోని దేశభక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏక్ హై తో సేఫ్ హై’ – ‘కలసి ఉంటేనే సురక్షితం’ అనే భావనను హర్యానా ప్రజలు స్వీకరించారని, ఇది దేశానికంతటికీ ఉదాహరణగా నిలిచిందని శ్రీ మోదీ ప్రశంసించారు.
హర్యానాతో తనకున్న దృఢమైన అనుంబంధాన్ని వివరించిన ప్రధానమంత్రి, తమకు వరుసగా మూడోసారి అధికారమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతికి తావు లేకుండా వేలాది మంది యువత శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విధానాన్ని దేశమంతా వీక్షించిందని తెలిపారు. హర్యానా మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. దేశంలో మహిళలకు ఉద్యోగాలు కల్పించేందుకే బీమా సఖి పథకాన్ని ప్రారంభించామని వివరించారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కొన్నేళ్ల క్రితం బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని పానిపట్ నుంచి ప్రారంభించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ అది హర్యానాతో పాటుగా దేశవ్యాప్తంగా మంచి ప్రభావం చూపించిందని అన్నారు. ఒక్క హర్యానాలోనే గత దశాబ్దంలో వేలాది మంది అమ్మాయిల ప్రాణాలను రక్షించగలిగామని తెలిపారు. దశాబ్దం తర్వాత మళ్లీ పానిపట్ నుంచే సోదరీమణులు, కుమార్తెల కోసం బీమా సఖి యోజనను ప్రారంభిస్తున్నానని శ్రీ మోదీ అన్నారు. మహిళాశక్తికి పానిపట్ ప్రతీకగా మారిందని ఆయన అభివర్ణించారు.
2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకొనే దిశగా భారతదేశం ముందుకు సాగుతోందన్న శ్రీ మోదీ, 1947 నుంచి ఇప్పటి వరకు ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం ధారపోసిన శక్తే భారత్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని అన్నారు. 2047 నాటి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తయారు చేయాలంటే నూతన శక్తి వనరులు అవసరమని తెలిపారు. ఈశాన్య భారతం అలాంటి వనరుల్లో ఒకటి అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. మహిళా స్వయం సహాయక బృందాలు, బీమా సఖిలు, వ్యవసాయ సఖిలు తదితర రూపాల్లో నారీశక్తి ప్రధానమైన వనరుల్లో భాగంగా ఉందని, అభివృద్ధి చెందిన భారత్ కలను ఈ శక్తి సాకారం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలకు అపారమైన అవకాశాలను కల్పిస్తూ.. సాధికారత దిశగా వారు సాగిస్తున్న ప్రయాణంలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడం అత్యవసరమని ప్రధాని అన్నారు. మహిళలు సాధికారతను సాధించినప్పుడే నూతన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయని అభిప్రాయపడ్డారు. మహిళల ప్రవేశాన్ని నిషేధించిన రంగాల్లో వారికి ఉద్యోగావకాశాలను తమ ప్రభుత్వం కల్పించిందన్న శ్రీ మోదీ, భారతీయ వీర పుత్రికలు సైన్యంలో ముందుండి పనిచేస్తున్నారని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఫైటర్ పైలట్లుగా మారుతున్నారని, పోలీసు శాఖలో చేరుతున్నారని, కార్పొరేట్ సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయ, పాడి రైతులకు ఉన్న ఉత్పత్తిదారుల సంఘాలు లేదా సహకార సంఘాల్లో 1200 సంఘాలు మహిళల సారథ్యంలోనే నడుస్తున్నాయని తెలిపారు. క్రీడల నుంచి విద్య వరకు ప్రతి రంగంలోనూ లక్షలాది మంది బాలికలు తమ ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచడం ద్వారా లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందారని తెలిపారు.
ఈ రోజు ప్రారంభించిన బీమా సఖి కార్యక్రమం ఏళ్ల తరబడి చేసిన కృషి అనే పునాదిపై ఆధారపడి ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు గడిచినా చాలా మంది మహిళలకు బ్యాంకు ఖాతాలు లేవని, వారు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరమయ్యారని పేర్కొన్నారు. జన్ ధన్ యోజన ద్వారా 30 కోట్ల మందికి పైగా మహిళలకు బ్యాంకు ఖాతాలున్నాయని ప్రధానమంత్రి సగర్వంగా తెలిపారు. గ్యాస్ సబ్సిడీ లాంటి రాయితీలను కుటుంబంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేవారికి నేరుగా అందించేందుకే జన్ ధన్ ఖాతాలను ప్రభుత్వం ప్రారంభించినట్టు శ్రీ మోదీ వివరించారు. కిసాన్ కల్యాణ్ నిధి, సుకన్య సమృద్ధి యోజన, సొంత ఇల్లు నిర్మించుకొనేందుకు, చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటుచేసుకొనేందుకు నిధులు, ముద్రయోజన తదితర పథకాల ద్వారా నగదు బదిలీకి జన్ ధన్ యోజన దోహదపడిందని ఆయన తెలిపారు.
ప్రతి గ్రామంలో బ్యాంకింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంలో మహిళలు కీలకపాత్ర పోషించారని ప్రశంసించిన ప్రధానమంత్రి, ఒకప్పుడు బ్యాంకు ఖాతాలకు నోచుకోని వారు ఇప్పుడు బ్యాంకు సఖిలుగా మారి గ్రామీణులకు, బ్యాంకులకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బ్యాంకులో డబ్బులు ఎలా దాచుకోవాలో, లక్షల రూపాయల రుణాలను ఎలా పొందాలో ప్రజలకు బ్యాంకు సఖిలు వివరిస్తున్నారని తెలిపారు.
గతంలో భారత్‌లో మహిళలకు బీమా చేసేవారు కాదని గుర్తు చేస్తూ లక్షల మంది మహిళలను ఇన్స్యూరెన్స్ ఏజెంట్లుగా లేదా బీమా సఖిలుగా మార్చే కార్యక్రమం ఈరోజు ప్రారంభమైందని శ్రీ మోదీ అన్నారు. బీమా లాంటి ఇతర రంగాల విస్తరణలోనూ మహిళలు ప్రధానపాత్ర పోషిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీమా సఖి యోజన ద్వారా 2 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ప్రధాని తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు బీమా సఖి యోజన ద్వారా మూడేళ్లపాటు శిక్షణ ఇస్తామన్నారు. బీమా రంగానికి చెందిన డేటాను ఉటంకిస్తూ ఎల్ఐసీ ఏజెంట్ ప్రతి నెలా 15 వేల రూపాయలు సంపాదిస్తున్నారని, మన బీమా సఖిలు ప్రతి ఏటా రూ 1.75 లక్షల కంటే ఎక్కువే ఆర్జిస్తారని అన్నారు. ఇది వారి కుటుంబానికి అదనపు ఆదాయంగా మారుతుందని తెలిపారు.
బీమా సఖిల పాత్ర డబ్బు సంపాదనకన్నా ఎంతో మిన్నగా ఉంటుందని ప్రధానమంత్రి అంటూ, భారతదేశంలో అందరికీ బీమా రక్షణను కల్పించడమే అంతిమ లక్ష్యమని స్పష్టంచేశారు. సామాజిక భద్రతను కల్పించడానికి, పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడానికి ఇది ఎంతో అవసరమని కూడా ఆయన అన్నారు. అందరికీ బీమా కవచం అందించాలనే ఉద్యమాన్ని బీమా సఖిలు పటిష్టపరచనున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఒక వ్యక్తికి బీమా సదుపాయం సమకూరినప్పుడు ఆ వ్యక్తికి లభించే ప్రయోజనం అమితంగా ఉంటుందని శ్రీ మోదీ చెబుతూ, ప్రభుత్వం ‘ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన’ను, ‘ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన’ను అమలుచేస్తోందని తెలిపారు. ఈ పథకాల్లో భాగంగా చాలా తక్కువ ప్రీమియంకే రూ.2 లక్షల బీమా రక్షణను అందిస్తున్నారని ఆయన అన్నారు. బీమాను గురించి ఎన్నడూ ఆలోచనైనా చేయని 20 కోట్ల మందికి పైగా ప్రజలకు బీమా రక్షణ లభించిందని శ్రీ మోదీ తెలిపారు. ఈ రెండు పథకాల్లో ఇంతవరకు దాదాపు రూ.20,000 కోట్ల క్లెయిము సొమ్మును ఇచ్చారన్నారు. దేశంలో అనేక కుటుంబాలకు సామాజిక భద్రత కవచాన్ని అందించడానికి బీమా సఖీలు పాటుపడనున్నారని, దీనిని ఒక మంచి పనిగా చెప్పవచ్చని శ్రీ మోదీ అన్నారు.
గత పదేళ్ళలో భారతదేశంలో పల్లెప్రాంతాల మహిళలను దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చిన విప్లవాత్మక విధానాలతోపాటు ఇతర విధాన నిర్ణయాలు నిజానికి ఒక అధ్యయనాంశమని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. బీమా సఖి, బ్యాంకు సఖి, కృషి సఖి, పశు సఖి, డ్రోన్ దీదీ, లఖ్ పతి దీదీ.. ఈ పేర్లు వినడానికి సీదాసాదాగా, సామాన్యమైనవిగా కనిపిస్తున్నా, ఇవి భారతదేశం భాగ్యాన్ని మార్చివేస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశంలో స్వయం సహాయ బృందాల ఉద్యమం (ఎస్‌హెచ్‌జీ అభియాన్) సాకారం చేసిన మహిళా సాధికారితను లెక్కలోకి తీసుకొంటే ఆ ఉద్యమం చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో మార్పును తీసుకువచ్చేందుకు ఒక ప్రధాన సాధనంగా మహిళా స్వయం సహాయ బృందాలను ప్రభుత్వం తీర్చిదిద్దందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశం నలుమూలలా 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ బృందాలతో అనుబంధాన్ని కలిగి ఉన్నారన్నారు. గత దశాబ్ద కాలంలో రూ.8 లక్షల కోట్ల కన్నా ఎక్కువ నిధులను మహిళా స్వయం సహాయ బృందాలకు సాయంగా అందించారని ఆయన వివరించారు.
దేశమంతటా స్వయం సహాయ బృందాలతో అనుబంధాన్ని కలిగి ఉన్న మహిళల పాత్ర, వారు అందిస్తున్న తోడ్పాటు అసాధారణమైందిగా ఉందని ప్రధానమంత్రి ప్రశంసించారు. వారు భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టడానికి శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రక్రియలో సమాజంలో ప్రతి వర్గానికి చెందిన, ప్రతి కుటుంబానికి చెందిన మహిళలు పాలుపంచుకొంటున్నారని, దీనిలో ప్రతి ఒక్క మహిళకు అవకాశాలు లభిస్తున్నాయని ఆయన వివరించారు. స్వయం సహాయ బృందాల ఉద్యమం సామాజిక సద్భావనను, సాంఘిక న్యాయాన్ని పటిష్ట పరుస్తోందన్నారు. స్వయం సహాయ బృందాలు ఒక మహిళకు ఆదాయాన్ని పెంచడం మాత్రమే కాదు, కుటుంబసభ్యుల్లోనూ, పూర్తి గ్రామంలోనూ ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేస్తున్నాయని కూడా ఆయన ప్రధానంగా చెప్పారు. వారు చేస్తున్న ఈ మంచి పనికిగాను వారందరినీ ఆయన మెచ్చుకొన్నారు.
తాను 3 కోట్ల మంది సోదరీమణులను లఖ్‌పతి దీదీలుగా ఎదిగేటట్లు చేస్తానంటూ ఎర్రకోట బురుజుల మీద నుంచి చేసిన ప్రకటనను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత వరకు దేశవ్యాప్తంగా 1.15 కోట్ల మందికి పైగా లఖ్‌పతి దీదీలను చేసే ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ మహిళలు ప్రతి ఏటా రూ.1 లక్ష కన్నా ఎక్కువ మొత్తాన్ని సంపాదించడం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. లఖ్‌పతి దీదీ ఉద్యమానికి ఎంతో అవసరమైన మద్దతు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ యోజన ద్వారా లభిస్తోందని, ఈ విషయాన్ని హర్యానాలో చర్చించుకొంటున్నారని ప్రధాని అన్నారు. హర్యానాలో అమలవుతున్న నమో డ్రోన్ దీదీ పథకాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ, ఈ పథకం మహిళల జీవనంలోనూ, వ్యవసాయంలోనూ పెనుమార్పులను తీసుకువస్తోందన్నారు.
దేశంలో ఆధునిక వ్యవసాయం, ప్రాకృతిక వ్యవసాయంలపై అవగాహనను పెంచే దిశలో వేల మంది కృషి సఖిలకు శిక్షణను ఇస్తున్నారని ప్రధాని వెల్లడించారు. సుమారు 70 వేల మంది కృషి సఖిలు ఇప్పటికే సర్టిఫికెట్లను అందుకున్నారని, ఏటా రూ.60,000 కన్నా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే సామర్థ్యాన్ని ఈ కృషి సఖిలు చేజిక్కించుకొన్నారని ఆయన వివరించారు. పశు సఖిలను గురించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 1.25 లక్షలకు పైగా పశు సఖిలు పశు పాలన పట్ల చైతన్యాన్ని పెంచే ఉద్యమంలో భాగస్తులయ్యారన్నారు. ఇది ఒక్క ఉపాధిమార్గమే కాదు, మానవజాతికి గొప్ప సేవను కూడా అందిస్తోందని ఆయన అన్నారు. కృషి సఖిలు ప్రాకృతిక వ్యవసాయం పై మన రైతుల్లో చైతన్యాన్ని పెంచుతూ ఇటు నేలతల్లికీ తమ సేవల్ని అందిస్తున్నారు. అటు భావి తరాలవారి కోసం భూమిని సురక్షితంగా ఉంచడానికి కూడా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదే విధంగా మన పశు సఖిలు పశువుల సంరక్షణ దిశలో పాటుపడుతూ, ఆ రూపేణా మానవీయతకు కూడా తోడ్పడే పవిత్ర విధులను నిర్వర్తిస్తున్నారని శ్రీ మోదీ అన్నారు.
దేశంలో తల్లులు, అక్కచెల్లెళ్ళ ప్రేమానురాగాలు దక్కుతున్న సంగతిని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా చెబుతూ, తన ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో దేశంలో 12 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించడంతో, టాయిలెట్ వసతి లేని ఇళ్లలో నివసిస్తున్న ఎంతో మంది మహిళలకు మేలు కలిగిందన్నారు. 10 సంవత్సరాల కిందట గ్యాస్ కనెక్షన్ లేని కోట్లాది మహిళలకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌లను ఉచితంగా ఇచ్చారని ఆయన తెలిపారు. నీటి సరఫరాకు నీటి కనెక్షన్లు, పక్కా ఇళ్ళు లేని మహిళలకు వాటిని సమకూర్చినట్లు తెలిపారు. లోక్ సభ లోను, విధాన సభల్లోను మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు వీలు కల్పించే చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. సరైన ఉద్దేశాలతో, నిజాయితీగా ప్రయత్నాలు చేస్తేనే తల్లుల, అక్కచెల్లెళ్ళ ఆశీర్వాదాలు లభిస్తాయని ఆయన అన్నారు.
రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ప్రధానమంత్రి వివరిస్తూ, మొదటి రెండు పదవీకాలాల్లో హర్యానా రైతులు రూ. 1.25 లక్షల కోట్లకు పైగా సొమ్మును కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) రూపంలో అందుకొన్నారని, హర్యానాలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.14,000 కోట్ల డబ్బును వరి, చిరుధాన్యాలు, పెసర్లను పండించే రైతులకు ఎమ్ఎస్‌పీగా అందజేశారన్నారు. రూ.800 కోట్లకు పైగా డబ్బును కరవు బాధిత రైతులకు సాయపడడానికి ఇచ్చారన్నారు. హర్యానాను హరిత క్రాంతికి సారథిని చేయడంలో చౌధరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం పోషించిన ప్రధాన పాత్రను శ్రీ నరేంద్ర మోదీ గుర్తుకుతెస్తూ, ప్రస్తుతం 21వ శతాబ్దంలో తోటపంటల రంగంలో హర్యానాను నాయకత్వ స్థానంలో నిలబెట్టడంలో మహారాణా ప్రతాప్ విశ్వవిద్యాలయం పోషించే భూమిక ముఖ్యమైంది అవుతుందని ఆయన అన్నారు. మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపనను ఈ రోజు పూర్తిచేశారని, ఇది ఈ విశ్వవిద్యాలయంలో చదువుకొనే యువతకు కొత్త సదుపాయాలను అందించనుందన్నారు.
హర్యానా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మూడో పదవీకాలంలో మూడింతల వేగంతో పనిచేస్తాయని రాష్ట్ర మహిళలకు శ్రీ నరేంద్ర మోదీ హామీనిస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు. హర్యానాలో మహిళా శక్తి పోషిస్తున్న పాత్ర అంతకంతకు మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నరు శ్రీ బండారు దత్తాత్రేయ, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్తు శాఖ మంత్ర శ్రీ మనోహర్ లాల్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
నేపథ్యం
పదో తరగతి పాసైన 18 ఏళ్ళు మొదలుకొని 70 ఏళ్ళలోపు మహిళలకు సాధికారితను కల్పించడానికి ‘భారతీయ జీవన బీమా సంస్థ (ఎల్ఐసీ)’ రూపొందించిన కార్యక్రమమే ‘బీమా సఖి యోజన’. వారు ఆర్థిక వ్యవహారాల జ్ఞానాన్ని, బీమా పథకాల గురించిన అవగాహనను పెంచడానికి ప్రత్యేక శిక్షణను పొందడంతోపాటు మొదటి మూడేళ్ళపాటు స్టైపండునును కూడా అందుకొంటారు. శిక్షణ పూర్తి అయిన తరువాత వారు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేసేందుకు వీలుంటుంది. పట్టభద్రులైన బీమా సఖిలకు ఎల్ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా పనిచేయడానికి ఎంపికయ్యే అవకాశం లభిస్తుంది.
కర్నాల్‌లో మహారాణా ప్రతాప్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌ను, ఆరు ప్రాంతీయ పరిశోధన కేంద్రాలను 495 ఎకరాల స్థలంలో రూ.700 కోట్లకు పైగా ఖర్చుతో ఏర్పాటుచేయనున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సుల బోధనకు ఒక హార్టికల్చర్ కాలేజీతోపాటు ఉద్యాన శాస్త్రానికి సంబంధించిన 10 విభాగాలతో కూడిన అయిదు స్కూళ్లను కూడా ఏర్పాటుచేస్తారు. ఈ విశ్వవిద్యాలయం పంటలలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉద్యాన శాస్త్ర సంబంధిత టెక్నాలజీలను అభివృద్ధిపరచడానికి ప్రపంచస్థాయి పరిశోధనలకు కృషిచేస్తుంది.
(Release ID: 2083481)
Visitor Counter : 8
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam