నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువ కార్మికశక్తి నైపుణ్యం... ప్రమాణాల వల్ల ప్రపంచ ప్రతిభా కూడలిగా భారత్ ప్రతిష్ఠ నానాటికీ ఇనుమడిస్తోంది: నరేంద్ర మోదీ


‘‘దేశంలోని 8 లక్షల మంది నిపుణ ప‌ట్ట‌భ‌ద్రుల విజ‌యాల‌కు ఈ నైపుణ్య శిక్ష‌ణ స్నాత‌కోత్స‌వం-2024 ఒక నిద‌ర్శ‌నం’’

Posted On: 26 OCT 2024 6:58PM by PIB Hyderabad

దేశంలోని వివిధ నైపుణ్యాభివృద్ధి సంస్థలలో నైపుణ్య శిక్షణ పూర్తిచేసి, అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థులను ‘వార్షిక నైపుణ్య శిక్షణ స్నాతకోత్సవం-2024’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ మేరకు ‘క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్’ (సిటిఎస్), ‘క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్’ (సిఐటిఎస్) కింద ‘ఐటిఐ’లు, ‘ఎన్‌ఎస్‌టిఐ’లలో శిక్షణ పొందిన వీరికి ఆయన అభినందన సందేశం పంపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డిఇ) నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగాగల 8 లక్షల మంది పట్టభద్రుల విజయాలను, నైపుణ్య సాధనపై వారి అంకితభావాన్ని ప్రతిబింబించింది.

   దేశంలోని 15,000కుపైగా పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ)లు, 33 జాతీయ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ (ఎన్‌ఎస్‌టిఐ)లన్నింటా ఏకకాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశంలోని నిపుణులను వెలికితీయడంలో/గుర్తించడంలో కీలక అంశం గా నిలుస్తుంది.  న్యూఢిల్లీలోని ‘కౌశల్ భవన్’ ఆడిటోరియంలో ‘ఎంఎస్‌డిఇ’ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డిజిటి) ఈ జాతీయ వేడుకను నిర్వహించింది. ‘ఎంఎస్‌డిఇ’ (స్వతంత్ర బాధ్యతగల) సహాయమంత్రిగా, విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ జయంత్ చౌదరి సహా కీలక భాగస్వాములు, 19 లక్షల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని సంస్థలలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
   ‘ఎంఎస్‌డిఇ’ పరిధిలోని ‘డిజిటి’ నిర్వహించిన ఈ నైపుణ్య శిక్షణ స్నాతకోత్సవం ఒక విశిష్ట  కార్యక్రమమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశంలో ప్రశంసించారు. దేశంలోని ‘ఐటిఐ’లు, ‘ఎన్‌ఎస్‌టిఐ’లు, ‘ఐటిఒటి’లు సహా అనేక ఇతర శిక్షణ సంస్థల విద్యార్థులను ఇది ఒక వేదికపైకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, నైపుణ్య శిక్షణ చరిత్రలో ఈ వేడుక ఓ మైలురాయి వంటిదని అభివర్ణించారు. ఇది శిక్షణ సమాప్తి వేడుక మాత్రమే కాదని, అభ్యర్థుల జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే శుభ ముహూర్తమని పేర్కొన్నారు. వివిధ అంశాల్లో ఈ యువ నిపుణులు సముపార్జించిన నైపుణ్యం దేశ ప్రగతికి సమర్థ సారథ్యం వహించగలదని చెప్పారు. అంతేగాక ‘స్వయం సమృద్ధ భార‌త్‌’ స్వప్న సాకారంపై దేశ సంకల్పాన్ని మరింత బలోపేతం చేయగలదని స్పష్టం చేశారు.
   దేశానికి తిరుగులేని శక్తిగా, జాతి పురోభివృద్ధిలో అత్యావశ్యక సూత్రధారులుగా నిపుణులైన యువతరం కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత యువ కార్మిక శక్తి నైపుణ్యం, ప్రమాణాల వల్ల ప్రపంచ ప్రతిభా కూడలిగా భారత్ ప్రతిష్ఠ నానాటికీ ఇనుమడిస్తున్న తీరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. యువత సాధికారతకు ప్రాధాన్యమిచ్చే విధానాలతో భవిష్యత్ సంసిద్ధ, ప్రపంచ అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణకు ‘ఎంఎస్‌డిఇ’ హామీ ఇస్తున్నదని ప్రధాని గుర్తుచేశారు. దీనికితోడు అనుభవ శిక్షణకు (ఇంటర్న్‌షిప్) మెరుగైన అవకాశాలు, సాంకేతిక విద్యా ఉన్నతీకరణ, విలువైన అంతర్జాతీయ భాగస్వామ్యాల తోడ్పాటుతో భారత యువ నిపుణులు ప్రపంచ కార్మిక శక్తిపై శాశ్వత ప్రభావం చూపగలరని స్పష్టం చేశారు. అంతేగాక ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడంలోనూ కీలక పాత్ర పోషించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
   దీర్ఘకాలిక నైపుణ్య వెలికితీత కార్యక్రమంలో భాగంగా ‘క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్’ (సిటిఎస్) కింద 2023-24 (ఏడాది కోర్సులు), 2022-24 (రెండేళ్ల కోర్సులు) విద్యా సంవత్సరాలకుగాను ‘ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్’ (ఎఐటిటి)ను ‘డిజిటి’ నిర్వహించింది. ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో ‘ఐటిఐ’ల స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు నెలలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 152 కోర్సులలో 19 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాయగా, 87.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.
   అలాగే ‘క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్’ (సిఐటిఎస్) కింద దేశవ్యాప్తంగా ‘ఎన్ఎస్‌టిఐ’లు సహా శిక్షకుల శిక్షణ సంస్థ (ఐటిఒటి)ల ద్వారా వివిధ కోర్సుల బోధకులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన తుది పరీక్షకు హాజరైన 9,292 మంది అభ్యర్థులలో 7,873 మంది (84.73 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
   న్యూఢిల్లీలోని ‘కౌశల్ భవన్‌’లో నిర్వహించిన నైపుణ్య శిక్ష‌ణ స్నాత‌కోత్స‌వంలో ‘ఎంఎస్‌డిఇ’ పరిధిలోని ‘డిజిటి’ ఆధ్వర్యంలోగల ‘సిటిఎస్’, ‘సిఐటిఎస్’లలో శిక్షణ పొందిన 48 మంది విద్యార్థులు పురస్కారం అందుకున్నారు. వీరిలో అఖిల భారత స్థాయిలో అగ్రస్థానం సాధించినవారు, ‘సిటిఎస్’లలోని 10 ప్రధాన కోర్సులతోపాటు ‘సిఐటిఎస్’లలోని 5 ప్రధాన కోర్సులలో అగ్రస్థానం పొందినవారు సహా ‘హార్డ్ ఇంజినీరింగ్’ కోర్సులలో మహిళా, దివ్యాంగ విభాగాల వారు, ‘సిటిఎస్’, ‘ఫ్లెక్సి-ఎంఓయు’ పథకం, న్యూ ఏజ్’ కోర్సులలో అగ్రస్థానాల్లో నిలిచిన వారు కూడా ఉన్నారు.
   దేశవ్యాప్తంగా 15000కుపైగా ‘ఐటిఐ’లు, ‘ఎన్ఎస్‌టిఐ’ల‌లో ఈ స్నాత‌కోత్స‌వం నిర్వ‌హించారు. వివిధ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని సంస్థ‌ల‌లో అక్క‌డి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉత్సాహంగా పాల్గొని, ఉత్త‌ీర్ణులైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణపై శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ- ‘‘ఈ వేడుకలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన‌డం దేశం న‌లుమూల‌లా నైపుణ్యాభివృద్ధిపై మా ప్ర‌భుత్వ స‌మ‌ష్టి నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం. వారి భాగస్వామ్యంతో ఈ స్నాత‌కోత్స‌వం మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకుంది. అంతేగాక దేశాభివృద్ధికి, స్వావలంబనకు నైపుణ్యం ఒక మార్గ‌మ‌నే స్ఫూర్తిదాయ‌క‌ భావ‌న యువతలో క‌లుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
   విద్యార్థుల అంకిత భావాన్ని, కఠోర కృషిని కూడా శ్రీ జయంత్ చౌదరి తన ప్రసంగంలో  ప్రశంసించారు. ఈ మేరకు ‘‘భారత నైపుణ్య వ్యవస్థకు 15,000కుపైగా ‘ఐటిఐ’ల  విస్తృత నెట్‌వర్క్‌ ఉంది. ఇవన్నీ కొన్నేళ్లుగా తమ విశ్వసనీయతను చాటుకుంటున్నాయి. పరిశ్రమల నుంచి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మన నెట్‌వర్క్ కూడా నిరంతరం తగురీతిలో స్పందిస్తూ అవసరాలు తీర్చగల స్థాయికి ఎదగాలి. ప్రతి ఒక్కరికీ నైపుణ్యాకాంక్ష కలిగేలా చేయడంలో నేటి వేడుక ఓ కీలక ముందడుగు. మా డైరెక్టరేట్లు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాత్మక కృషితో యువత తమ భవిష్యత్తును రూపొందించుకునేలా సాధికారత కల్పించే శక్తిమంతమైన మూల్యాంకన వ్యవస్థను మేము ఏర్పరిచాం. తదనుగణంగా నిర్వహించిన వివిధ పరీక్షలు, మూల్యాంకనాల్లో మహిళల అద్భుత విజయాలు మన దేశ ఉత్తేజపూరిత ప్రగతికి ప్రతిబింబాలు. మన దేశం ప్రగతిశీల భారత్‌గా రూపొందడంపై ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణంగా కేంద్ర బడ్జెట్ చరిత్రలో తొలిసారి ప్రభుత్వం ‘ఐటిఐ’ల  మెరుగుదలకు సముచిత ప్రాధాన్యమిచ్చింది’’ అని వివరించారు.
   ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా ‘ఐటిఐ’ల నిర్వహణ అత్యావశ్యకమని శ్రీ జయంత్ చౌదరి స్పష్టం చేశారు. ‘‘మన ‘ఐటిఐ’లు స్థానిక పరిశ్రమల అవసరాలను తీర్చగలిగేలా రూపొందాలి. ఆ మేరకు ప్రభావశీల, సముచిత నైపుణ్యాభివృద్ధికి భరోసా ఇవ్వాలి. ఈ దిశగా శిక్షణ సంస్థల ఉన్నతీకరణపై పరిశ్రమలే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపాలని ఆకాంక్షిస్తున్నాను. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమార్హతగల, నిపుణ కార్మిక శక్తి రూపకల్పనపై మన లక్ష్యసాధనకు ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదం చేస్తుంది’’ అన్నారు.
   ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఇటీవలి పారాలింపిక్స్‌ క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగర దివ్యాంగ క్రీడాకారిణి ప్రీతిపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన క్రీడా పయనంలో ఎదురైన సమస్యలు, సవాళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎలాంటి అవరోధాలనైనా మొక్కవోని దీక్షతో ఎదుర్కొంటూ లక్ష్యం దిశగా ఏకాగ్రత సాధించాలంటూ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. అలాగే ‘వరల్డ్ స్కిల్ కాంపిటీషన్-2024’లో భాగంగా అంతర్జాతీయ నైపుణ్య వేదికపై భారత్ మెరిసిన తీరును వివరిస్తూ ఈ పోటీల పతక విజేతలు తమ అనుభవాలను పంచుకున్నారు.
   పరిశ్రమల అవసరాలు, అత్యాధునిక సాంకేతికతలకు అనుగుణంగా నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో  ‘ఎంఎస్‌డిఇ’ అమలు చేసే తాజా కార్యక్రమాలను కూడా ఈ వేడుక ప్రముఖంగా చాటింది. ఇందులో భాగంగా దేశంలోని ‘ఐటిఐ’ విద్యార్థుల కోసం కృత్రిమ మేధ (ఎఐ)పై ‘డిజిటి’ రూపొందించిన ప్రాథమిక మాడ్యూల్‌ను ప్రారంభించినట్లు ‘ఎంఎస్‌డిఇ’ ప్రకటించింది. ఈ 7.5 గంటల పాఠ్యప్రణాళిక విద్యార్థులకు కీలక ‘ఎఐ’ భావనలను పరిచయం చేస్తుంది. తద్వారా సాంకేతికత ఆధారిత ఉపాధి పొందడానికి వారిని సంసిద్ధం చేస్తుంది. అలాగే శిక్షకుల కోసం ‘ఎంప్లాయబిలిటీ స్కిల్స్ (ఇఎస్) ఫెసిలిటేటర్ మాన్యువల్’ను కూడా ఆవిష్కరించింది. సముచిత ఉపాధి నైపుణ్యాలపై సరళీకృత, అనుభవపూర్వక పద్ధతులలో నిర్మాణాత్మక, ప్రభావశీల పాఠ్యాంశాలను బోధించేలా ఇది బోధకులకు తోడ్పడుతుంది.
   ‘క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్’ (సిఐటిఎస్) కింద సరికొత్త అభ్యసన సరంజామాను  ప్రవేశపెడుతున్నట్లు ‘డిజిటి’ మరొక కీలక ప్రకటన చేసింది. ‘డిజిటి’ పరిధిలోని ‘ఎన్ఎస్‌టిఐ’ల శిక్షకులు, నేషనల్ ఇన్‌స్ట్రక్షనల్ మీడియా ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఐఎంఐ) ద్వారా సంస్థాగతంగా వీటికి రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఎన్ఎస్‌క్యుఎఫ్‌ 5వ స్థాయి కింద పరిశ్రమల ప్రమాణాలకు అనుగుణమైన ఈ సమగ్ర ‘సిఐటిఎస్’ వనరులు ‘ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ సాఫ్ట్‌ వేర్ అప్లికేషన్స్’ వంటి కోర్సులకు తగురీతిలో ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా వృత్తి శిక్షణ పొందేవారి అభ్యసన అనుభవాన్ని, వృత్తి-సంసిద్ధతను పెంచడంలో బోధకులు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సమర్థ బోధన  నైపుణ్యం సముపార్జించేందుకు ఈ సరంజామా తోడ్పడుతుంది.
   ఈ స్నాతకోత్సవం పట్టభద్రుల విజయాలను మాత్రమేగాక భారత నైపుణ్య కార్మిక శక్తికి సాధికారత కల్పనలో అధ్యాపకులు, శిక్షకులు, విధాన రూపకర్తల అకుంఠిత దీక్షను ఘనంగా చాటింది. సుసంపన్న, స్వావలంబిత భవిష్యత్తు దిశగా స్వయం సమృద్ధ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేసేలా తమ నైపుణ్యాన్ని వినియోగించడంలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతకు ప్రేరణ ఇవ్వాలన్నది ‘ఎంఎస్‌డిఇ’ లక్ష్యం.

 

****




(Release ID: 2068582) Visitor Counter : 20


Read this release in: English , Hindi