బొగ్గు మంత్రిత్వ శాఖ
కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన బొగ్గు రంగంపై ఒక రోజంతా అర్ధ సంవత్సర సమీక్ష
గని కార్మికుల సంక్షేమం... భద్రతకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం బొగ్గు రంగంలో సామర్థ్యం పెంపు.. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను స్పష్టం చేసిన మంత్రి
Posted On:
22 OCT 2024 8:39PM by PIB Hyderabad
దేశంలో బొగ్గు రంగం పురోగమనంపై కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ తన అధ్యక్షతన న్యూఢిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో అర్ధ సంవత్సర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే సహాధ్యక్షత వహించారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శులు శ్రీమతి రూపీందర్ బ్రార్, శ్రీమతి విస్మిత తేజ్, ఇతర సీనియర్ అధికారులతోపాటు ప్రభుత్వ రంగ బొగ్గు-లిగ్నైట్ సంస్థల ‘సిఎండి’లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష సహా భవిష్యత్ వ్యూహాలు, బొగ్గు రంగం వృద్ధికి పథనిర్దేశంపై వారు చర్చించారు.
ఈ సందర్భంగా బొగ్గు రంగంలో సుస్థిరత, వనరుల సామర్థ్యం దిశగా కీలక చర్యల్లో భాగంగా తవ్వకపు వ్యర్థాలను లాభదాయకంగా మార్చుకోవడంపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను శ్రీ జి.కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
బొగ్గు గనుల తవ్వకపు వ్యర్థాలను విలువైన వనరుగా మార్చడానికి తగిన చట్రాన్ని ఈ నివేదిక నిర్దేశించింది. ఈ వ్యర్థాలు నిరుపయోగమని భావించే చారిత్రక పరిస్థితి దీర్ఘకాలం కొనసాగింది. అయితే, ఇప్పుడు దీన్ని పర్యావరణ సుస్థిరత సహా ఆర్థిక ప్రగతికి, స్థానిక ప్రజల ఉపాధి అవకాశాల సృష్టికి గణనీయంగా దోహదం చేసే ఆస్తిగా పరిగణిస్తున్నారు.
ఈ అర్ధ సంవత్సర సమీక్షలో భాగంగా వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ప్ లిమిటెడ్ (డబ్ల్యుసిఎల్) పరిధిలోని మూడు భూగర్భ గనుల శాశ్వత మూసివేత ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ మేరకు పఠాఖేరా-I, II సహా సతాపురా-II గనుల మూసివేతను సమావేశం ఆమోదించింది. స్వాతంత్య్రానంతరం అధికారికంగా బొగ్గు గనుల మూసివేత ధ్రువీకరణ జారీ చేయడం ఇదే తొలిసారి. తదనుగుణంగా ‘డబ్ల్యుసిఎల్’ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జె.పి.ద్వివేది, జనరల్ మేనేజర్ (భద్రత విభాగం) శ్రీ దీపక్ రేవత్కర్, పఠాఖేరా ప్రాంత జనరల్ మేనేజర్ శ్రీ ఎల్.కె.మహపాత్రకు కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
బొగ్గు రంగంలో ఉత్పత్తి సామర్థ్యం పెంపు, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరాన్ని శ్రీ జి.కిషన్ రెడ్డి తన కీలక ప్రసంగంలో వివరించారు. ఆ మేరకు పర్యావరణ దుష్ప్రభావాల తగ్గింపుతోపాటు ఉత్పత్తిని పెంచే వినూత్న సాంకేతికతల వినియోగ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ- గనుల తవ్వకంలో నిర్దేశిత బాధ్యతాయుత విధానాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని ఈ రంగంలోగల భాగస్వామ్య సంస్థలన్నిటినీ సూచించారు. దీంతోపాటు అధీకృత పరిహార అటవీకరణ కార్యక్రమాల అమలుతోపాటు బొగ్గు తీసిన తర్వాత ఆయా క్షేత్రాల భూ పునరుద్ధరణ ప్రక్రియను సమర్థంగా పూర్తిచేయాలని కోరారు. గనుల మూసివేతను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, దీనివల్ల ప్రభావిత ప్రజానీకానికి మద్దతు లభించడంతోపాటు పునరావాస ప్రాంతాలు ఉత్పాదకంగా రూపొందేలా చూడాలని మంత్రి స్పష్టీకరించారు.
గని కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రత విధివిధానాలు, శిక్షణ కార్యక్రమాల పటిష్ట అమలుతోపాటు కార్మికుల ఆరోగ్యం-శ్రేయస్సుపై నిశితంగా దృష్టి సారించాలని చెప్పారు. వారి కుటుంబాల విషయంలోనూ శ్రద్ధ చూపాలని, ఆ మేరకు సురక్షిత పని వాతావరణం కల్పించడం కార్మికుల కోసమేగాక సామాజికంగానూ అవసరమని పేర్కొన్నారు. భద్రత, సామాజిక బాధ్యత సంస్కృతిని పెంచుకోవాలని శ్రీ రెడ్డి భాగస్వామ్య సంస్థలను కోరారు. స్థానిక ప్రజానీకాన్ని భాగస్వాములను చేసే, వారి అభ్యున్నతికి తోడ్పడే సామాజిక బాధ్యత కార్యక్రమాల (సిఎస్ఆర్)ను చురుగ్గా అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. పారిశ్రామిక పద్ధతులను సామాజిక అవసరాలతో సమ్మిళితం చేయడం, సాంఘిక సంక్షేమానికి ప్రోత్సాహం, పర్యావరణ సమస్యల పరిష్కారం తదితరాలతో బొగ్గు రంగం ఆధునికతకు, బాధ్యతాయుత నిర్వహణకు నమూనాగా రూపొందుతుందని చెప్పారు. ఇవన్నీ అంతిమంగా పరిశ్రమ-పర్యావరణం రెండింటి సుస్థిర భవితకు భరోసా ఇస్తాయని పేర్కొన్నారు.
అనంతరం కేంద్ర బొగ్గు-గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే తన సమీక్షలోని అంశాలను వివరిస్తూ- బొగ్గు రంగం గడచిన ఆరు నెలల్లో అద్భుత ప్రగతి సాధించిందని వెల్లడించారు. ఆ మేరకు భద్రత-పర్యావరణ సుస్థిరతపై నిరంతరం ప్రాధాన్యమిస్తూ ఉత్పత్తి సామర్థ్యం పెంచడంలో భాగస్వామ్య సంస్థలన్నీ తమవంతు కృషి చేశాయని కొనియాడారు. సామర్థ్యం పెంచుకోవడంతోపాటు నికరశూన్య ఉద్గారాల దిశగా వినూత్న పద్ధతులు, సాంకేతికతల అనుసరణ ఆవశ్యకతను శ్రీ దూబే స్పష్టం చేశారు. ఈ రంగంలో సవాళ్ల పరిష్కారంతోపాటు కీలక ఇంధన వనరుగా బొగ్గు దీర్ఘకాలిక ప్రయోజనం దిశగా సమష్టి కృషి కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కార్మికులతోపాటు స్థానిక ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పరిశ్రమకు మద్దతివ్వడంలో ప్రభుత్వ నిబద్ధతను కూడా పునరుద్ఘాటించారు.
సమీక్ష సమావేశం ఆరంభంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ- కీలక చర్చనీయాంశాలను వివరించారు. పర్యావరణ పరిరక్షణ, కార్మిక జీవన సంరక్షణ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడమేగాక దేశ ఇంధన అవసరాలు తీర్చడంలో ఈ రంగంలో నిలకడపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
బొగ్గు రంగం నిర్వహణపై సమీక్షలో భాగంగా ‘విజన్-2030’, ‘విజన్-2047’ వ్యూహాలతోపాటు కార్యాచరణ ప్రణాళికలపైనా అధికారులు ప్రదర్శనాత్మక వివరణ ఇచ్చారు. కొత్తగా కేటాయించిన బొగ్గు క్షేత్రాల నిర్వహణ, అన్వేషణ కార్యకలాపాల ప్రగతి, ఈ రంగంలో స్వావలంబనకు ప్రోత్సాహం, దేశ ఇంధన భద్రతకు భరోసా ఇస్తూ బొగ్గు ఉత్పత్తి వేగం పెంచడం తదితర అంశాలపై సమావేశం లోతుగా చర్చించింది. సుస్థిర ఇంధన భద్రతతోపాటు దేశ దీర్ఘకాలిక ఆర్థికవృద్ధికి మద్దతు దిశగా పరిష్కరించాల్సిన కీలక సమస్యలపైనా నిశితంగా దృష్టి సారించింది.
తదుపరి విడత సమీక్షలో భాగంగా బొగ్గు రంగం ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య పురోగమనంపై చర్చ సాగింది. ఈ రంగంలో ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తు అవకాశాలపై సమగ్ర అవగాహన దిశగా మూలధన వ్యయం (కేపెక్స్), ఆస్తుల విక్రయం, మార్కెట్ మూలధనీకరణ (మార్కెట్ కేప్) అంశాలపై ‘సిఎండి’లు, విభాగాధిపతు (హెచ్ఒడి)లతో మంత్రి లోతుగా చర్చించారు. అలాగే దిగుమతి పరాధీనత తగ్గింపు, కోకింగ్ కోల్ సామర్థ్యం పెంపు వ్యూహాలు, దేశీయ బొగ్గు ఉత్పాదన పెంపు లక్ష్యంగా... ప్రత్యేకించి భూగర్భ గనుల తవ్వకంలో అనుసరించదగిన అత్యాధునిక సాంకేతికతలపై ప్రతినిధులు ప్రదర్శనాత్మక వివరణ ఇచ్చారు. అలాగే గ్యాస్-ఆధారిత సాంకేతికతలకు మారడం, ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) వాడకం సహా మైనింగ్ రంగంలో పర్యావరణపరంగా సుస్థిర పద్ధతుల అనుసరణపైనా చర్చలో గణనీయ ప్రాధాన్యం ఇచ్చారు. ఇవన్నీ బొగ్గు గనుల కార్యకలాపాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే విస్తృత లక్ష్యానికి అనుగుణమైనవి. పర్యావరణ దుష్ప్రభావాల తగ్గింపు లక్ష్యంగా రూపొందించిన పర్యావరణ హిత బొగ్గు రవాణా వ్యవస్థలపై దృష్టి సారిస్తూ తొలి అంచె అనుసంధానం (ఎఫ్ఎంసి) ప్రాజెక్టుల పురోగతిని సమావేశం సమీక్షించింది. అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక దృక్పథంలో భాగమైన ‘మేక్ ఇన్ ఇండియా’కు అనుగుణంగా కార్యకలాపాల సామర్థ్యం పెంపు, ఉత్పాదకత మెరుగుదల కోసం భూగర్భ తవ్వకాల్లో భారీ యంత్రాల వినియోగానికి ప్రోత్సాహం వంటి అంశాలకూ చర్చలు ప్రాధాన్యమిచ్చాయి.
సమీక్షలో భాగంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ ప్రాధాన్యాన్ని శ్రీ జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సమన్వయంతోపాటు సుస్థిర ప్రగతిపైనా చర్చకు ఆయన నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా సంక్లిష్ట సవాళ్లను పరిష్కరిస్తూ, లక్ష్యాల ఏకీకరణ ద్వారా సహకారం పెంచుకోవడంపై పర్యావరణ-అటవీ- వాతావరణ మార్పు, విద్యుత్తు, రైల్వే మంత్రిత్వ శాఖలు వివరణలిచ్చాయి. ఈ సందర్భంగా సుస్థిర ప్రగతి ఆవశ్యకతను శ్రీ జి.కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ముఖ్యంగా అధీకృత పరిహార అటవీకరణ, పర్యావరణ కార్యక్రమాల అమలుతోపాటు బొగ్గు తీసిన తర్వాత ఆయా క్షేత్రాల భూ పునరుద్ధరణ-సద్వినియోగం అవసరమని స్పష్టం చేశారు. అలాగే గనుల మూసివేతను నిర్వహణ పరమైన నిబంధనగా కాకుండా దీర్ఘకాలిక స్థిరత్వానికి భరోసా ఇస్తూ పర్యావరణ పరిరక్షణపై నిబద్ధతను చాటుకునేదిగా ఉండాలన్నారు.
మైనింగ్ కార్యకలాపాల్లో భద్రత విధివిధానాలతోపాటు కార్మికులు-వారి కుటుంబాల సంక్షేమ కార్యక్రమాలపైనా కూడా విస్తృత చర్చ సాగింది. ఈ మేరకు భాగస్వాములందరికీ సురక్షిత, ప్రోత్సాహక వాతావరణం సృష్టించడం లక్ష్యంగా ఉద్యోగుల భవిష్యనిధి, ‘సిఎస్ఆర్’ సహా నియామకాలు, ప్రమోషన్లు, బదిలీ సంబంధిత మానవ వనరుల (హెచ్ఆర్) వ్యవహారాలు, కార్మిక సంబంధాలు వంటి అంశాలపైనా సమావేశం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరోవైపు ‘సిఎస్ఆర్’, ‘హెచ్ఆర్’, కార్మిక సంబంధాలపై పరస్పర అభిప్రాయ మార్పిడి కోసం ప్రత్యేక గోష్టి నిర్వహించారు. ‘సిఎస్ఆర్’ ప్రణాళికలు, వాటి అమలు వ్యూహాలపై ఇందులో చర్చించారు. బొగ్గు క్షేత్రాల పరిసర సమాజాల అవసరాలకు అనుగుణంగా సామాజిక కార్యక్రమాల ప్రభావశీల అమలుకు ఈ వ్యూహాలు భరోసా ఇస్తాయి. ఉద్యోగుల బదిలీ, ప్రమోషన్ తదితర విధానాల్లో మరింత పారదర్శక, ప్రతిభ-ఆధారిత వ్యవస్థ రూపకల్పన, కార్మిక సంబంధాల స్థాయి సహా ఆర్థిక భద్రతకు భరోసాగా ‘బొగ్గు గని ఉద్యోగుల భవిష్య నిధి’ (సిఎంపిఎఫ్ఒ) వంటి సంక్షేమ చర్యలకు సమావేశం ప్రాధాన్యమిచ్చింది.
బొగ్గు రంగంలో నిఘా అవగాహన వారోత్సవ నిర్వహణ ఈ సమావేశంలో మరొక కీలక చర్చనీయాంశంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా తమ కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యమివ్వడంలో అంకితభావాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు నిర్వహించే నిఘా అవగాహన కార్యక్రమాలను అధికారులు వివరించారు. టెండర్లు-కాంట్రాక్టులలో నైతిక ప్రమాణాలను కచ్చితంగా పాటించడం, నిష్పక్షపాత విధానాల అనుసరణ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ సందర్భంగా చీఫ్ విజిలెన్స్ అధికారు (సివిఒ)లతో మంత్రి సంభాషించారు. అవినీతి నిరోధంలో మంత్రిత్వ శాఖ దృఢ వైఖరిని, అవినీతి రహిత పాలన వ్యవస్థ దిశగా తమ కృషిని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
చివరగా- విజన్-2030 ప్రతిష్ఠాత్మక లక్ష్యాలకు మించి బొగ్గు రంగాన్ని ప్రగతిపథాన నడపడంలో ద్వితీయ అర్థ సంవత్సర కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రతినబూనుతూ వందన సమర్పణ చేయడంతో అర్ధ-సంవత్సర సమీక్ష సమావేశం సమాప్తమైంది.
***
(Release ID: 2067306)
|