ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదాయపు పన్ను చట్టం, 1961 లో భాగంగా రాజీ కుదుర్చుకోవడానికి వీలు ఉన్న నేరాల విషయంలో మార్గదర్శక సూత్రాలను సవరించిన సీబీడీటీ
ఇప్పుడున్న మార్గదర్శక సూత్రాలలోని జటిలతలను తగ్గించే విధంగా ఈ సరికొత్త మార్గదర్శకాలను రూపొందించారు; అంతేకాక రాజీకి వీలైన నేరాల సంబంధిత ప్రక్రియతో పాటు ఖర్చులనూ తగ్గించారు
Posted On:
17 OCT 2024 9:02PM by PIB Hyderabad
ఆదాయపు పన్నును చెల్లించే వ్యక్తి (అసెసీ)కి వ్యతిరేకంగా నమోదు అయిన నేరాలలో రాజీ ప్రక్రియను సరళీకరిస్తూ, క్రమబద్ధీకరిస్తూ ఒక కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెటులో చేసిన ప్రకటనకు అనుగుణంగా, ఆదాయపు పన్ను చట్టం, 1961 లో కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ తాలూకు సవరించిన మార్గదర్శక సూత్రాలను ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ మండలి (సీబీడీటీ) నిన్న(2024 అక్టోబరు 17న) జారీ చేసింది.
ఈ అంశం లో ఇంతవరకు ఉన్న అన్ని మార్గదర్శక సూత్రాలను మార్పు చేస్తూ, ఈ సవరించిన మార్గదర్శకాలు ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులకు కూడా ఇవి జారీ చేసిన తేదీ నాటి నుంచి వర్తిస్తాయి. కాంపౌండింగ్ ప్రక్రియను సులభతరం చేస్తూ, కాంపౌండింగ్ చార్జీలను తగ్గిస్తూను వెలువడ్డ కొత్త మార్గదర్శకాలు, ఇప్పటివరకు అమలవుతున్న బహుళ మార్గదర్శకాలతో సంబంధిత వర్గాల కు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గిస్తాయని ఆశిస్తున్నారు.
నేరాల వర్గీకరణ పద్ధతిని ఎత్తివేయడం, దరఖాస్తులను దాఖలు చేయవలసిన సందర్భాల పైన ఉన్న పరిమితిని (సంఖ్య పరంగా) ఎత్తివేయడం, లోపాలను సరిచేసుకొని కొత్త దరఖాస్తులను సమర్పించడానికి అనుమతిని ఇవ్వడం, చట్టం లోని 275ఏ, 276బీ సెక్షన్‌లలో పేర్కొన్న నేరాలకు రాజీ ప్రక్రియకు అవకాశాన్ని కల్పించడం, ఫిర్యాదులు దాఖలు చేసిన రోజు నుంచి 36 నెలల లోపల దరఖాస్తును సమర్పించాలని ఇప్పుడు ఉన్నటువంటి కాలపరిమితిని తొలగించడం తదితర అంశాలలో మార్గదర్శక సూత్రాలను సులభంగా మార్చారు
వ్యాపార సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్ స్)కు రాజీకి వీలైన నేరాల సౌలభ్యాన్ని కల్పించడానికి ప్రధాన నిందితుడు లేదా నిందితురాలు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనను రద్దు చేశారు. ప్రధాన నిందితుడు/ప్రధాన నిందితురాలు తో పాటు సహ నిందితుడు/సహ నిందితురాలు లలో ఎవరైనా గాని, లేదా అందరు గాని కొంత సొమ్మును చెల్లించి, రాజీకి ముందుకు రావచ్చు. అయితే, దీనికోసం వారు (ప్రధాన నిందితుడు/ ప్రధాన నిందితురాలు లేదా సహ నిందితుడు/సహ నిందితురాలు లలో ఎవరైనా) సంబంధిత కాంపౌండింగ్ చార్జీలను చెల్లించాలని సవరించిన మార్గదర్శక సూత్రాలు సూచిస్తున్నాయి.
కాంపౌండింగ్ ఛార్జీలను సైతం క్రమబద్ధం చేశారు. ఈ చార్జీలను చెల్లించడంలో జాప్యం చేస్తే, అందుకు ప్రతిగా చెల్లించవలసిన వడ్డీని ఎత్తివేశారు. టీడీఎస్ చెల్లించకపోవడం వంటి వివిధ నేరాలకు వర్తింప చేస్తున్న రేటులను తగ్గించారు; ఒక్కో నెలకు 2 శాతం, 3 శాతం, ఇంకా 5 శాతంగా ఉన్న బహుళ రేటులను 1.5 శాతంగా ఉండే ఒకే రేటు పద్ధతి లోకి మార్చారు. అంతేకాకుండా, రిటర్న్ దాఖలు చేయనందుకు విధించే కాంపౌండింగ్ చార్జీల లెక్కింపు ప్రాతిపదికను సరళతరం చేశారు. సహ నిందితుడు/సహ నిందితురాలు వద్ద నుంచి విడిగా వసూలు చేసే కాంపౌండింగ్ చార్జీని ఎత్తివేయడం సహా మరికొన్ని సులభతర చర్యలు కూడా ఈ నూతన విధానంలో భాగం గా ఉన్నాయి.
నియామాలను పాటించడంలో సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రక్రియల సరళీకరణ దిశలో తీసుకు వచ్చిన ఈ సవరించిన మార్గదర్శక సూత్రాలు ఒక అదనపు వెసులుబాటుగా ఉన్నాయి.
రాజీకి వీలైన నేరాలకు సంబంధించిన సవరించిన మార్గదర్శక సూత్రాలను https://www.incometaxindia.gov.in లో నిన్నటి నుంచి అందుబాటులో ఉంచారు.
****
(Release ID: 2066262)
Visitor Counter : 58