మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్ఎమ్ఎమ్ఎస్ఎస్ లో భాగంగా 2024-25కు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ లో దరఖాస్తుల (తాజా, రెన్యువల్) దాఖలుకు ఆఖరు తేదీ అక్టోబరు 31 వరకు పొడిగింపు
Posted On:
18 OCT 2024 4:21PM by PIB Hyderabad
ఎంపికైన ప్రతిభాశాలి విద్యార్థులు ‘నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్ఎమ్ఎమ్ఎస్ఎస్)’ కోసం వారి దరఖాస్తులను జాతీయ ఉపకార వేతనం పోర్టల్ (నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్- ఎన్ఎస్‌పీ)లో దాఖలు చేయడం కోసం చివరి తేదీని ఈ నెల 31 వరకు పొడిగించారు. విద్యార్థులు దరఖాస్తులను సమర్పించడానికి వీలుగా ఎన్ఎస్‌పీ పోర్టల్ ను ఈ ఏడాది జూన్ 30 న తెరచి ఉంచారు. ఈ ప్రాజెక్టు సంవత్సరం 2024-25లో ఎంపికైన విద్యార్థులు ముందుగా ఎన్ఎస్‌పీ లో ఒకసారి నమోదు (వన్ టైమ్ రిజిస్ట్రేషన్-ఓటీఆర్) చేసుకోవాలి. దీని తరువాత, వారు తాము ఎంచుకొన్న ఉపకార వేతన పథకం కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. ఎన్ఎస్‌పీ లో పేరు నమోదుకు సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూ స్)ను https://scholarships.gov.in/studentFAQs లో చూడవచ్చు.
పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం నిర్వహిస్తున్న నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్ఎమ్ఎమ్ఎస్ఎస్)లో భాగంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతిభాశాలి విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో.. అంటే ఎనిమిదో తరగతి స్థాయిలో బడికి వెళ్తూ చదువును అర్థంతరంగా మానివేయకుండా హయ్యర్ సెకండరీ స్థాయి వరకు.. అంటే పన్నెండో తరగతి వరకు.. పాఠశాల విద్యను పూర్తి చేసేటట్లు ప్రోత్సహించడానికి వారికి ఉపకార వేతనాలను ఇస్తున్నారు.
ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు స్కాలర్‌షిప్ కోసం నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏటా మొత్తం ఒక లక్ష కొత్త స్కాలర్‌షిప్ లను అందిస్తున్నారు. విద్యార్థులు కనబరచే ప్రతిభ ఆధారంగా పదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు నవీకరణ పద్ధతి (రెన్యూవల్) ద్వారా ఈ స్కాలర్‌షిప్ ను అందుకొంటూ ఉండవచ్చు. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న పాఠశాలలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల విద్యార్థులకు మాత్రమే వర్తిస్తున్నది. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి ఏటా రూ. 12,000 ఉపకార వేతనం సొమ్మును అందజేస్తున్నారు.
నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్ఎమ్ఎమ్ఎస్ఎస్)ను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌పీ) ద్వారా అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతన పథకాలన్నింటికీ ఎన్ఎస్‌పీ ఏకైక వేదిక (వన్ -స్టాప్ ప్లాట్ ఫార్మ్)గా ఉంటోంది. ఈ సంవత్సరంలో ఈ నెల 15 వరకు చూస్తే, మొత్తం మీద 84,606 తాజా దరఖాస్తులను, 1,58,312 నవీకరణ దరఖాస్తులు వచ్చాయి. ఎన్ఎమ్ఎమ్ఎస్ఎస్ స్కాలర్‌షిప్ లను డీబీటీ పద్ధతిని అనుసరిస్తూ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పిఎఫ్ఎమ్ఎస్) ద్వారా ఎలక్ట్రానిక్ బదిలీ మాధ్యమంలో ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బుల్ని జమ చేస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్ కు నిర్దేశించిన అర్హత పరిమితులలో విద్యార్థి తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి మూడున్నర లక్షల రూపాయలకు మించకూడదు. స్కాలర్‌షిప్ ను పొందటానికి నిర్వహించే ఎంపిక పరీక్షకు హాజరు అవ్వాలంటే ఏడో తరగతి పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు గాని, లేదా తత్సమాన గ్రేడ్‌ను గాని తెచ్చుకొని ఉండాలి. (ఎస్‌సీ/ఎస్‌టీ విద్యార్థులకు ఈ విషయంలో 5 శాతం సడలింపు ఉంది.)
ఎన్ఎస్‌పీ పోర్టల్‌లో ఎంపికైన అభ్యర్థుల ఉపకార వేతన దరఖాస్తు ధ్రువీకరణకు రెండు అంచెలు ఉన్నాయి: ఒకటో అంచె (ఎల్1) లో ఇనిస్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (ఐఎన్ఓ) దరఖాస్తును సరి చూస్తారు. రెండో అంచె (ఎల్2)లో జిల్లా నోడల్ అధికారి (డీఎన్ఓ) దరఖాస్తును తనిఖీ చేస్తారు. ఐఎన్ఓ స్థాయి (ఎల్1)లో ప్రమాణీకరణకు నవంబరు 15వ తేదీ చివరి తేదీ. డీఎన్ఓ స్థాయి (ఎల్2)లో ప్రమాణీకరణకు నవంబరు 30 ఆఖరు తేదీ.
***
(Release ID: 2066254)