రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నావికాదళ నిర్వహణ సంసిద్ధతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన తెలంగాణలోని వికారాబాద్‌లో అత్యల్ప ఫ్రీక్వెన్సీ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన రక్షణ మంత్రి


నౌకా వాణిజ్య ప్రయోజనాలను కాపాడటమే కాకుండా, కమాండ్ సెంటర్లకు నౌకలు, జలాంతర్గాములకు మధ్య 'సురక్షితమైన, తక్షణ కమ్యూనికేషన్'

సముద్రాల లోతుల్లో భారత్‌ బలమైన శక్తిగా నిలవాలంటే అత్యాధునిక ప్లాట్‌ఫామ్స్‌, విఫలం కాని కమ్యూనికేషన్ వ్యవస్థ తప్పనిసరన్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

“హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి హామీనిచ్చే అతిపెద్ద భరోసా భారత నావికాదళం”

“సముద్ర భద్రత అనేది సమష్టి చర్య.. ఐఓఆర్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని మిత్ర దేశాలు కలిసి పనిచేయాలి”

“విభజన కంటే భారత్ ఐక్యతనే విశ్వసిస్తుంది. ఒక్క దేశం లేకపోయినా భద్రత అనే చక్రం గాడితప్పుతుంది’’

Posted On: 15 OCT 2024 4:38PM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ 2024 అక్టోబరు 15న తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌ ప్రాంతంలో భారత నావికాదళానికి చెందిన నూతన అత్యల్ప ఫ్రీక్వెన్సీ(వీఎల్ఎఫ్-వెరీ లో ఫ్రీక్వెన్సీ) స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. రూ.3,200 కోట్ల వ్యయంతో 2,900 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నారు. ఇది భారత నావికాదళ నిర్వహణ సంసిద్ధతను మెరుగుపరచనుంది. సముద్రాల్లో సవాలుతో కూడిన పరిస్థితుల్లో సమర్థవంతమైన కమాండ్ అండ్ కంట్రోల్ సామర్థ్యాన్ని నావికాదళానికి ఇది అందిస్తుంది. నౌకాదళ కమ్యూనికేషన్ మౌలికసదుపాయాలను బలోపేతం చేయడంలో పాటు సుదూర ప్రాంతాలకు విశ్వసనీయమైన, సురక్షితమైన ప్రసారాలను అందించటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ... వీఎల్‌ఎఫ్ స్టేషన్ దేశ సైనిక సామర్థ్యాలను పెంచుతుందని, సాయుధ దళాలకు వరంలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైటెక్ వీఎల్ఎఫ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. అది కేవలం సైనిక స్థావరంగా మాత్రమే ఉండదని, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ఆస్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు.

 

 

“ఉద్భవిస్తోన్న యుద్ధ పద్ధతుల దృష్ట్యా మనుషులు, యంత్రాల మధ్య సమర్థవంతమైన సమన్వయం చాలా ముఖ్యమైనది. నౌకా వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ వీఎల్‌ఎఫ్ స్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది. సాయుధ దళాల కమాండ్ సెంటర్లకు మన నౌకలు, జలాంతర్గాములకు మధ్య సురక్షితమైన, ప్రత్యక్ష సమాచార సంబంధం ఉండేలా ఈ కేంద్రం చూస్తుంది. విఫలం కాని సమాచార వ్యవస్థ అనేది గెలుపు, ఓటములను నిర్ణయించేదిగా ఉంటుంది. తక్షణ (రియల్ టైం) కమ్యూనికేషన్ లేకుండా, తగిన పరికరాలు, మానవ వనరులు ఉన్నప్పటికీ మనం పైచేయి సాధించలేం” అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

 

 

బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి విస్తృతంగా మాట్లాడిన రక్షణ మంత్రి.. ఏదైనా సంక్లిష్టమైన ఆపరేషనులో సమన్వయానికి ఇది కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. స్పష్టమైన, సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ- సకాలంలో, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడటమే కాకుండా.. కమాండ్‌ సెంటర్‌ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్ర స్థాయిలో ఉన్న వారికి తెలియజేయడానికి, వారి స్పందనను తెలుసుకోవటానికి ఒక ముఖ్యమైన మాధ్యమంగా ఉంటుందని ఆయన తెలిపారు.

యుద్ధక్షేత్రంలో, కార్యకలాపాల్లో సైనికులకు పూర్తి సమాచారం అందిస్తే.. వారి మనోధైర్యం, ఐక్యతకు పెద్దఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని.. ఇది భద్రత, వ్యూహం రెండింటినీ మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. “సంక్షోభ సమయంలో స్పష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకంగా మారుతుంది. మారే పరిస్థితుల మధ్య  ప్రతిస్పందన సమయం చాలా తక్కువగా ఉన్నప్పుడు దీని అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాలు చరిత్రాత్మకంగా నిరూపితమయ్యాయి. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్ భద్రత, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.

హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)పై నిరంతరం పెరుగుతున్న అంతర్జాతీయ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని భారత నౌకాదళాన్ని ఎల్లప్పుడూ శక్తిమంతంగా ఉంచాల్సిన అవసరాన్ని రక్షణ మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. “మన ప్రయోజనాలు ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటికీ విస్తరించి ఉన్నాయి. ఐఓఆర్‌లో మొదటి ప్రతిస్పందనగా, అందరికి ఇష్టమైన భద్రతా భాగస్వామిగా కూడా మనం ఆవిర్భవించాం. నేడు అనేక దేశాలు ఈ ప్రాంతంలోని సముద్ర వనరులపై దృష్టి సారించాయి. తన వాణిజ్య, భద్రతా ప్రయోజనాలను కాపాడుకునేందుకు సముద్ర లోతుల్లో బలమైన సముద్ర శక్తిగా భారత్‌ ఉండాలంటే అత్యాధునిక పరికరాలు, ప్లాట్‌ఫామ్స్, బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉండటం అవసరం” అని అన్నారు. 

'మంచి నౌకాదళం ఉంటే యుద్ధానికి రెచ్చగొట్టినట్లు కాదు... అది శాంతికి భరోసా' అనే అంశాన్ని ఉటంకిస్తూ.. బంగాళాఖాతంతో సహా మొత్తం ఐఓఆర్‌లో శాంతికి హామీనిచ్చే అతిపెద్ద శక్తి భారత నావికాదళమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. “ సముద్ర భద్రత అనేది సమష్టి కృషి. భారత్‌తో సముద్ర సరిహద్దులను పంచుకునే దేశాలు అర్థం చేసుకోవాలి. బాహ్య శక్తులను మీ సరిహద్దుల వద్దకు అనుమతించటం ఈ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. బంగాళాఖాతం, ఐఓఆర్‌లో శాంతి భద్రతలను కాపాడటం మనందరి ప్రథమ ప్రాధాన్యాంశం కావాలి. ఒక దేశాన్ని పక్కన పెట్టినా మొత్తం భద్రతా చక్రం గాడి తప్పుతుంది. కాబట్టి భారత్ చేస్తున్న ఈ ప్రయత్నంలో అన్ని మిత్రదేశాలూ మద్దతు ఇవ్వటం అవసరం. విభజన కంటే ఐక్యతనే భారత్ విశ్వసిస్తుంది. స్నేహపూర్వక పొరుగు దేశాలన్నింటితో కలిసి ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.” అన్నారు.

పర్యావరణంపై ఈ ప్రాజెక్టు ప్రభావం ఉంటుందన్న అనుమానాల గురించి మాట్లాడిన రక్షణ మంత్రి.. ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు పునరావాసం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామనీ, అవసరమైతే నిర్మాణ సమయంలోనే పునరావాసం కల్పిస్తామని అన్నారు. సుస్థిర అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని.. ఈ వీఎల్‌ఎఫ్ కేంద్రంలోని నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పర్యావరణానికి నష్టం కలిగించకుండా చూసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.

 

 

వీఎల్‌ఎఫ్ కేంద్రం స్థానికులకు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. “దీని నిర్మాణ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాత కూడా ఈ స్టేషన్ ప్రారంభమైన అనంతరం ప్రజలకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ స్టేషన్ ఉపాధి అవకాశాలను పెంచటమే కాకుండా, వృద్ధిని అందించేదిగా పనిచేస్తుందని, పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిస్తుంది” అని తెలిపారు.

ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన అందరికీ, ముఖ్యంగా స్థానిక ప్రజలకు రక్షణ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దేశ భద్రత, సార్వభౌమత్వం విషయానికి వస్తే ప్రజలందరూ సిద్ధాంతాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ఒక్కటవుతారని అన్నారు.

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశ రక్షణ రంగంలో కలాం చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతుందన్నారు. భారత్‌కు కొత్త సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా ఒక తరం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.

సముద్రాల్లో సురక్షితమైన, దృఢమైన, ప్రతిస్పందించే, విశ్వసనీయమైన కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఉండేలా నిర్ధారించటం ద్వారా ఈ ప్రాజెక్టు భారత నావికాదళ కమ్యూనికేషన్ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుందని నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పేర్కొన్నారు. ఈ కేంద్రం నిర్మాణం పూర్తి అయితే, తిరునల్వేలిలోని ఐఎన్ఎస్ కట్టబొమ్మన్‌లో ప్రస్తుతం ఉన్న వీఎల్ఎఫ్ స్టేషన్‌కు అనుబంధంగా ఉంటుందని ఆయన తెలిపారు.

" జలాంతర్గాములతో సహా ప్రపంచవ్యాప్తంగా నిరంతర సురక్షితమైన కమ్యూనికేషన్‌ ఉండేలా చూసుకోవటంలో ఈ వీఎల్ఎఫ్‌ స్టేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తద్వారా వాటి భద్రత, ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది. ఈనాటి మన దేశ సామర్థ్యం, హోదాకు… మన జాతీయ సముద్ర ప్రయోజనాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా రక్షించాలన్న నావికాదళ అచంచల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలవాలి" అని ఆయన అన్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్.. తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధర్కర్, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2065136) Visitor Counter : 89


Read this release in: English , Urdu , Hindi , Tamil