గనుల మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లోని ‘జిఎస్‌ఐ’ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో పైకప్పు సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించనున్న కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
11 OCT 2024 8:56PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని బండ్లగూడ-నాగోల్‌లోగల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (జిఎస్ఐటిఐ)లో పైకప్పు సౌర విద్యుదుత్పాదక వ్యవస్థను కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి రేపు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జ్యోతి వెలిగించి ప్లాంటును స్విచ్-ఆన్ చేసిన తక్షణమే విద్యుదుత్పాదన మొదలవుతుంది. తద్వారా ఈ ప్రారంభోత్సవం ఒక ప్రయోగాత్మక మలుపుగా నిలిచిపోనుంది. అనంతరం పర్యావరణ సుస్థిరత-పచ్చదనం పెంపుపై సంస్థ నిబద్ధతకు గుర్తుగా మంత్రితోపాటు ఇతర ప్రముఖులు ఆ ప్రాంగణంలో మొక్కలు కూడా నాటుతారు. ఆ తర్వాత సౌర విద్యుత్ ప్లాంటు పనితీరును కూడా మంత్రి పరిశీలిస్తారు.
ఈ కార్యక్రమాల్లో మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ సహా తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ అలీ ఫరూఖీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (దక్షిణ ప్రాంత) అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్.డి.పట్భాజే వంటి ప్రముఖులతోపాటు ‘జిఎస్ఐ’ సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు.
పైకప్పు సౌర విద్యుదుత్పాదన ప్లాంటు విశేషాలు
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 15న ‘‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’’కు శ్రీకారం చుట్టారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలపడంతోపాటు పరిశుభ్ర, సౌలభ్య విద్యుత్ ప్రయోజనాలు సమకూర్చడంలో కీలక ముందడుగుకు ఈ పథకం ఒక ప్రతీక. దీనికింద దేశం నలుమూలలా ప్రభుత్వ కార్యాలయాలు సహా ఇంటింటి పైకప్పు మీద సౌర విద్యుదుత్పాదన ఫలకాలు అమరుస్తారు. తద్వారా పునరుత్పాదకేతర ఇంధన వనరులపై పరాధీనత తగ్గడంతోపాటు సమృద్ధ సౌరశక్తి వనరులను మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. దీనికి అనుగుణంగా దేశమంతటా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా సౌరశక్తితో పనిచేసేలా చూడాలనే ప్రతిష్టాత్మక లక్ష్య నిర్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలో 100 శాతం సౌర విద్యుదీకరణ సాధించాలనే ఈ సంకల్పం కర్బన ఉద్గారాల తగ్గింపుపై నిబద్ధతకు తార్కాణం. అంతేకాదు... వాతావరణ మార్పులపై పోరాటాన్ని ముందుండి నడిపించడంలో భారత్ చొరవను చాటిచెప్పే ఒక ఉదాహరణ. ఆ మేరకు ఓ చిన్న స్థానిక కార్యాలయం నుంచి అతిపెద్ద జాతీయ సంస్థ దాకా ప్రతి ప్రభుత్వ భవనంపైనా అత్యాధునిక సౌర ఫలకాల అమరికతో పరిపాలనలో ఇంధనం ఆదా సామర్థ్యానికి ఇదొక కొత్త ప్రమాణం కాగలదు.
వాతావరణ మార్పు సవాళ్ల పరిష్కారంలో దేశం కట్టుబాటుకు ఈ ప్రాజెక్టు ప్రత్యక్షంగా దోహదం చేస్తుంది. పునరుత్పాదకేతర ఇంధనంపై పరాధీనతను తగ్గించడం ద్వారా భూతాపాన్ని పరిమితం చేయడంతోపాటు భవిష్యత్తరాల కోసం భూగోళ పరిరక్షణకు మనవంతు తోడ్పాటునిస్తున్నాం. పర్యావరణపరంగానే కాకుండా ఆర్థికంగానూ సౌరశక్తి మనకెంతో లాభదాయకం. ఇటువంటి ప్రాజెక్టుల వల్ల పునరుత్పాదక ఇంధన రంగంలో ఉపకరణాల తయారీ, అమర్చడం నుంచి నిర్వహణ దాకా వివిధ దశల్లో ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఇక ఈ సౌర విద్యుత్ ప్లాంటుతో ‘జిఎస్ఐటిఐ’కి నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గి నిధులు ఆదా అవుతాయి. తద్వారా పరిశోధన, శిక్షణ, అభివృద్ధి తదితరాలకు మరిన్ని వనరులు సమకూరడంతో విద్యార్థులు, బోధన సిబ్బందిసహా వైజ్ఞానిక సమాజానికీ ప్రయోజనం ఒనగూడుతుంది. ఈ సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు దేశంలోని ఇతర సంస్థలన్నిటికీ స్ఫూర్తిదాయకం కాగలదు. ‘జిఎస్ఐటిఐ’లో ఈ ప్లాంటు ఏర్పాటు కేవలం సాంకేతిక అభివృద్ధిని మాత్రమేగాక భవిష్యత్తుపై దేశానికిగల అకుంఠిత దీక్షను కూడా సూచిస్తుంది. ఆ మేరకు పరిశుభ్ర ఇంధనం, సుస్థిరత, బాధ్యతాయుత వృద్ధి పరస్పర పూరకాలనే వాస్తవం కూడా ప్రస్ఫుటమవుతుంది.
‘జిఎస్ఐటిఐ’లో మొత్తం 300 సౌర విద్యుదుత్పాదన ఫలకాలు అమర్చారు.
వీటి విశిష్టతలు:
ఫలకాల స్వరూపం: ద్విముఖ ప్యానెళ్లు
ఫలకం ఎత్తు: 7.5 అడుగులు; వెడల్పు: 3.75 అడుగులు.
రేటెడ్ పవర్: ప్రామాణిక పరీక్షా పరిస్థితుల్లో ప్రతి ప్యానెల్ ద్వారా నిరంతరం అందే విద్యుత్తు పరిమాణం (550 డబ్ల్యుపి).
రోజువారీ విద్యుదుత్పాదన: 500 నుంచి 700 యూనిట్లు.
***
(Release ID: 2064323)
Visitor Counter : 67