వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దుబయిలో ‘భారత్ మార్ట్ ప్రాజెక్టు’పనులలో మంచి పురోగతి
Posted On:
07 OCT 2024 6:12PM by PIB Hyderabad
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటైన భారతదేశం - యూఏఈ ఉన్నత స్థాయి సంయుక్త మండలి పన్నెండో సమావేశం నిన్న ముంబయిలో జరగ్గా, ఆ సమావేశానికి భారత వాణిజ్య- పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, అబు ధాబి ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షేఖ్ హామిద్ బిన్ జయేద్ అల్ నాహ్ యాన్ లు ఇరువురూ కలసి అధ్యక్షత వహించారు. భారత్ మార్ట్ పనులలో చక్కని పురోగతి కనిపిస్తున్నందుకు ఉభయులూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
భారత్ మార్ట్ ప్రాజెక్టు డిజైను
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని కిందటి సంవత్సరం ఫిబ్రవరి 14న సందర్శించిన సందర్భంగా దుబయి జబెల్ అలీ స్వేచ్ఛా వ్యాపార మండలంలో భారత్ మార్ట్ కు శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీ నరేంద్ర మోదీ తో పాటు దుబయి వైస్ ప్రెసిడెంట్, ప్రధాని, పాలకుడు అయిన శ్రీ షేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ కూడా పాలుపంచుకున్నారు. భారతదేశం - యూఏఈ ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచేందుకు ‘భారత్ మార్ట్’ తోడ్పడుతుందన్న విశ్వాసాన్ని నేతలు ఇద్దరూ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, జబెల్ అలీ నౌకాశ్రయానికున్న భౌగోళికంగా కీలక సానుకూలతను, లాజిస్టిక్స్ పరంగా గల శక్తిని భారత్ మార్ట్ వినియోగించుకోగలదని, తద్వారా ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులను భారత్ మార్ట్ మరింత పెంచగలదన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. విక్రయ కేంద్రాలకు, గిడ్డంగుల రూపురేఖలను తీర్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఫొటో రైటప్:
కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో ప్రాజెక్టు శంకుస్థాపన కోసం నిర్వహించిన కార్యక్రమంలో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దుబాయి వైస్ ప్రెసిడెంట్, ప్రధానీ, పాలకుడు అయిన శ్రీ షేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ తదితరులు పాలుపంచుకొన్నప్పటి దృశ్యం
భారత్ మార్ట్ ని యూఏఈ లాజిస్టిక్స్ రంగంలో ప్రధాన వ్యాపార సంస్థగా ఉన్న ‘డీపీ వరల్డ్’ నిర్మిస్తున్నది. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, యూరేషియాలలోని మార్కెట్లను భారతదేశ వ్యాపారులకూ, ఎగుమతి సంస్థలకు, తయారీ సంస్థలకు చేరువగా తీసుకు పోవాలన్న ధ్యేయంతో భారత్ మార్ట్ నిర్మాణాన్ని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు స్వేచ్ఛా మండలం సహా ప్రధాన రిటెయిల్ మార్కెట్ల లాభాలను అందించడంతో పాటు డీపీ వరల్డ్ వద్ద గల ప్రపంచ శ్రేణి లాజిస్టిక్స్ సదుపాయాలను కూడా భారత కంపెనీలకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్టు పనులు 2026లో పూర్తవుతాయని ఆశిస్తున్నారు. ఒక లక్ష చ.మీ.లలో విస్తరించిన 1400 యూనిట్లకు ఇంతవరకు తొమ్మిది వేలకు పైగా ఆసక్తి వ్యక్తీకరణ లేఖలను డీపీ వరల్డ్ అందుకొంది.
***
(Release ID: 2063159)
Visitor Counter : 44