వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దుబాయిలో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయం
Posted On:
07 OCT 2024 6:00PM by PIB Hyderabad
భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దుబాయి (యూఏఈ)లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. యూఏఈతో పాటు మరిన్ని ప్రాంతాల నుంచి కూడా వివిధ రకాల పెట్టుబడులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మధ్య ప్రాచ్యప్రాంతంలో ఇన్వెస్ట్ ఇండియా తొలి కార్యాలయం ఇదే. సింగపూరులో ఇప్పటికే ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయం ఉంది. విదేశీ భూభాగంలో పనిచేయనున్న రెండోది దుబాయ్ కార్యాలయం.
ఈ అంశాన్ని కిందటి ఏడాది అక్టోబరు 7న ముంబయిలో ‘పెట్టుబడులపై ఏర్పాటైన భారత్-యూఏఈ సంయుక్త మండలి’ పన్నెండో సమావేశంలో దీనిపై చర్చించారు. ఆ సమావేశానికి భారత ప్రభుత్వ వాణిజ్య- పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, అబు ధాబి ఇన్వెస్టుమెంట్ అథారిటి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షేఖ్ హామిద్ బిన్ జయేద్ అల్ నాహ్ యాన్ లు సహాధ్యక్షత వహించారు.
‘‘ఇన్వెస్ట్ ఇండియా కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి, పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారాన్నీ, అనుమతులను అందించడానికీ ఇన్వెస్ట్ ఇండియా కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆనాటి సమావేశంలో ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధీనం లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ఆధ్వర్యంలో పనిచేసే లాభాపేక్ష రహిత సంస్థ గా ఇన్వెస్ట్ ఇండియాను స్థాపించారు. భారతదేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికీ, తగిన ఏర్పాట్లను చేయడానికీ వీలుగా ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడిదారులు వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, కార్యకలాపాలను కొనసాగించడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి, వారికి సాధికారతను కల్పించడానికీ ఇది పని చేస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 3 బిలియన్ అమెరిన్ డాలర్ల విలువైన పెట్టుబడులను యూఏఈ భారతదేశంలో పెట్టింది. మన దేశంలో అరబ్ ప్రాంతానికి చెందిన అతి పెద్ద పెట్టుబడిదారుగా యూఏఈ నిలిచింది. 2023-24 లో ఆరో అతి పెద్ద పెట్టుబడిదారుగానే కాక గత 24 సంవత్సరాల కాలంలో కూడా ఏడో ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. జీసీసీ దేశాల నుంచి తరలివచ్చిన పెట్టుబడులు అన్నింటిని పరిశీలిస్తే 70 శాతానికి పైగా పెట్టుబడులు యూఏఈ నుంచే లభిస్తున్నాయి. గత ఆగస్టు 31న సంతకాలైన సరికొత్త ‘ఇండియా - యూఏఈ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం’ ఈ రెండు దేశాల్లో పరస్పర పెట్టుబడులను మరింత బలపరచనుంది.
***
(Release ID: 2063114)
Visitor Counter : 39