వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

తొలి 110 రోజుల ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక వృద్ధి.. స్థానిక ఆర్థిక వ్యవస్థల బలోపేతంపై ‘డిపిఐఐటి’ నిశిత దృష్టి

Posted On: 04 OCT 2024 6:45PM by PIB Hyderabad

   దేశంలో పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణ, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం తదితరాలపై తొలి 100 రోజుల పాలనలో ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా అంత‌ర్గ‌త వాణిజ్యం-ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క విభాగం (డిపిఐఐటి) అనేక కీలక కార్యక్రమాలను ప్రకటించింది. ప్రపంచ పెట్టుబడులతోపాటు తయారీ రంగ కూడలిగా భారత్ స్థానాన్ని ఇవన్నీ మరింత బలోపేతం చేస్తాయి. ఈ మేరకు ‘డిపిఐఐటి’ ప్రకటించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు:

అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక పారిశ్రామిక నగరాలకు ఆమోదం

   జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం (ఎన్ఐసిడిపి)లో భాగంగా మొత్తం ₹28,602 కోట్ల అంచనా వ్యయంతో 12 కొత్త అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక పారిశ్రామిక నగరాల నిర్మాణానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వివిధ మౌలిక సదుపాయాల కల్పన రంగాలతో ఇమిడిపోయే భవిష్యత్తరం సాంకేతికతల నడుమ ఈ నగరాలు నిర్మితమవుతాయి. ఇప్పటికే ఆమోదం పొందిన 8 నగరాలకు అదనంగా ఈ కొత్త ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో 20 అత్యాధునిక పారిశ్రామిక కూడళ్లతో కొత్త వలయాన్ని రూపొందిస్తాయి.

   దేశంలోని 8 రాష్ట్రాలలో ఏర్పాటయ్యే ఈ నగరాలు ‘సర్వ సన్నద్ధ’ (ప్లగ్-ఎన్-ప్లే)/‘సకల సౌకర్య పని ప్రదేశాల’ (వాక్-టు-వర్క్) నమూనాలో రూపుదిద్దుకుంటాయి. వీటన్నిటిలోనూ అత్యాధునిక పారిశ్రామిక సదుపాయాలు, జీవనశైలి సౌకర్యాలన్నీ సదా అందుబాటులో ఉంటాయి. వీటి నిర్మాణం పూర్తయితే 10 లక్షల ప్రత్యక్ష, 30 లక్షల పరోక్ష ఉద్యోగావకాశాలు కలిసివస్తాయి. అలాగే ₹1.5 లక్షల కోట్ల పెట్టుబడి సామర్థ్యంతో ఆయా ప్రాంతాల సామాజిక-ఆర్థిక వ్యవస్థలను గణనీయంగా మెరుగుపరుస్తాయని అంచనా.

‘పిఎం ఏక్తా మాల్’ ద్వారా స్థానిక హస్త కళాకారులకు చేయూత

   ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ (ఒడిఒపి) పథకానికి ప్రాధాన్యంతో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని బలోపేతం చేయడమే ‘పిఎం ఏక్తా మాల్’ లక్ష్యం. హస్త కళాకారులు, గ్రామీణ చేతివృత్తులవారి విశిష్ట ఉత్పత్తుల ప్రదర్శన-విక్రయాలకు ఇదొక వేదికగా నిలుస్తుంది. అంతేగాక జాతీయ సమగ్రతను ప్రోది చేయడం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ధ్యేయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ‘పిఎం ఏక్తా మాల్’ నిర్మాణానికి శంకుస్థాపన పూర్తికాగా, కొన్ని రాష్ట్రాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. వీటికి అదనంగా జమ్ముకశ్మీర్, పుదుచ్చేరిలలో ఈ మాల్స్ నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదముద్ర పడింది.

   స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించే ఏక్తా మాల్స్ ద్వారా ఉపాధి అవకాశాల సృష్టికి వీలుంటుంది. దీనివల్ల గ్రామీణ కళాకారులకు ప్రోత్సాహంతోపాటు స్థానిక ఉత్పత్తులకు స్థిరమైన డిమాండ్‌ ఏర్పడుతుంది. స్వావలంబన దిశగా భారత్ కృషిని ఇవి మరింత ముందుకు తీసుకెళ్లగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ప్రభుత్వ కొనుగోళ్ల (మేక్ ఇన్ ఇండియా) ఆర్డర్-2024

   అన్ని ఇంజనీరింగ్, నిర్మాణ (ఇపిసి) లేదా సంసిద్ధ ప్రాజెక్టులకు అవసరమైన వస్తువులన్నిటినీ తగిన దేశీయ ఉత్పాదక సామర్థ్యంగల స్థానిక సరఫరాదారుల నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేయడాన్ని ఈ విధానం నిర్దేశిస్తుంది. దీనివల్ల భారత తయారీదారులకు గణనీయ ప్రోత్సాహం లభిస్తుంది. అంతేగాక దిగుమతి పరాధీనతను  తగ్గించి, వారికి మార్కెట్ సౌలభ్యం-తోడ్పాటును మరింత పెంచుతుంది.

   స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా స్థానిక విలువ జోడింపును ఈ విధానం ప్రోత్సహిస్తుంది. స్థానిక తయారీదారులకు సాధికారత, దేశీయ ఉపాధి పెంపు, విదేశీ ఉత్పత్తులపై దేశం ఆధారపడే అవసరం తగ్గించడం దీని లక్ష్యాలు. ఈ విధానంతో స్థానిక పరిశ్రమలకు విశాల ప్రయోజనాలు కలగడమేగాక వివిధ రంగాల్లో ఉత్పాదక సామర్థ్యం కూడా ఇనుమడిస్తుంది.

అంతర్జాతీయ విస్తరణ దిశగా ‘ఇన్వెస్ట్ ఇండియా’ పునర్వ్యవస్థీకరణ

   ‘డిపిఐఐటి’ ప్రస్తుతం తన పరిధిలోని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక-సౌలభ్య సంస్థ ‘ఇన్వెస్ట్ ఇండియా’ను కీలక మార్పుల ద్వారా పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రవాహం సంబంధిత ప్రతిష్టాత్మక లక్ష్యాల సాధన కోసం మరింత చురుకైన, సమర్థ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రక్రియ ప్రధాన ధ్యేయం. ‘ఇన్వెస్ట్ ఇండియా’ను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం ఈ కృషిలో ప్రధానాంశం. ఈ దిశగా ఇప్పటికే సింగపూర్‌లో కార్యాలయాలు ప్రారంభం కాగా- దుబాయ్, జ్యూరిచ్, సౌదీ అరేబియా దేశాలకు విస్తరణ కొనసాగుతోంది. భార‌త్‌లో పెట్టుబడులకు సంబంధించి అవసరమైన సమాచారమేగాక అనుమతులను కూడా ఆయా దేశాల్లోని పెట్టుబడిదారులకు ముంగిటకు చేర్చే ఏకైక ప్రాంగణంలా ఈ కార్యాలయాలు పనిచేస్తాయి.

   ఈ అంతర్జాతీయ సేవల సౌలభ్యం భార‌త్‌లోకి పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించగలదని అంచనా. తదనుగుణంగా ఆటోమోటివ్, రసాయనాలు, జౌళి వంటి రంగాల్లో 300 మిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులకు ‘ఇన్వెస్ట్ ఇండియా’ సౌలభ్యం కల్పించింది. ఈ మేరకు  హ్యుందాయ్ వియా, లుబ్రిజోల్, గెస్టాంప్ ఆటోమోటివ్ ఇండియా వంటి కంపెనీలు మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో గణనీయ పెట్టుబడులను ప్రకటించాయి. తద్వారా ప్రపంచ పెట్టుబడి గమ్యంగా భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తూ దేశంలో పెట్టుబడులకు సంబంధించి కొత్త అధ్యాయానికి ‘ఇన్వెస్ట్ ఇండియా’ శ్రీకారం చుట్టింది.

దేశాభివృద్ధి కోసం 60,000 ఎకరాల చౌడు భూముల సద్వినియోగం

   దేశంలోని దాదాపు 60,000 ఎకరాల అనుత్పాదక, ఉప్పు బంజరు భూమిని ఉత్పాదక, ప్రజా ప్రయోజనాల కోసం బదిలీ చేసేలా ‘డిపిఐఐటి’ తాజా మార్గదర్శకాలు జారీచేసింది. వీటికి అనుగుణంగా వివిధ జాతీయ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సరళ నిబంధనలపై భూ బదలాయింపు చేస్తారు. ఇందులో జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ హిత, పునరుత్పాదక ఇంధనం ప్రాజెక్టులు సహా సౌలభ్య గృహ నిర్మాణం కోసం భూబదిలీ కూడా అంతర్భాగంగా ఉంటుంది.

   దీనివల్ల విలువైన భూ వనరుల సద్వినియోగంసహా ఆక్రమణలు-వివాదాల నిరోధానికి వీలుంటుంది. అలాగే దేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనకు ఇవెంతో ఉపయోగపడతాయి. ఆ మేరకు రేవుల విస్తరణ, పర్యావరణ హిత పర్యాటకం, ఆక్వాకల్చర్ వగైరా ప్రాజెక్టులకు ఈ కొత్త మార్గదర్శకాలతో ప్రయోజనం ఉంటుందని అంచనా.

‘ఒఎన్‌డిసి’ ద్వారా శరవేగంతో డిజిటల్ వాణిజ్య వృద్ధి

   దేశంలో ‘డిజిటల్ వాణిజ్య సార్వత్రిక నెట్‌వర్క్’ (ఒఎన్‌డిసి) అద్భుత వృద్ధి సాధించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఏకంగా 12.6 మిలియన్ లావాదేవీలకు సౌలభ్యం ద్వారా నిరుడు ఇదే కాలంతో పోలిస్తే 300 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ మేరకు 1,200 నగరాల్లో 6 లక్షల మందికిపైగా విక్రేతలు, సేవా ప్రదాతలు 3 కోట్లకుపైగా ఉత్పత్తులను ఈ వేదిక ద్వారా అందించారు. ‘ఒఎన్‌డిసి’తో డిజిటల్ వాణిజ్య వాతావరణంలో ప్రగతిశీల పరివర్తనకు ఇది తార్కాణం. చిల్లర వర్తకులు, కిరాణా దుకాణాల యజమానులకు ఇది డిజిటల్ ఉపకరణాల సౌలభ్యం కల్పిస్తోంది. తద్వారా డిజిటల్ వాణిజ్య సార్వజనీనతకు దోహదం చేయడమేగాక నానాటికీ విస్తరిస్తున్న ‘ఇ-కామర్స్’ మార్కెట్‌లో వారు పోటీపడేలా ప్రోత్సహిస్తోంది.

   ముఖ్యంగా డిజిటల్ వాణిజ్యాన్ని దేశంలోని 2వ,3వ అంచె పట్టణాలకూ చేరువ చేయడంలో ‘ఒఎన్‌డిసి’ కీలక పాత్ర పోషిస్తోంది. ఆ మేరకు స్థానిక వ్యాపారులకు సాధికారత కల్పన సహా చిల్లర వర్తకులతోపాటు భారీ ‘ఇ-కామర్స్’ సంస్థల సమతుల వృద్ధికీ తోడ్పడుతోంది.

జిల్లాల స్థాయికి ‘పిఎం గతిశక్తి’

   ‘పిఎం గతిశక్తి’ బృహత్ ప్రణాళికలో భాగంగా ‘జిల్లా మాస్టర్ ప్లాన్’ (డిఎంపి) పేరిట డిజిటల్ పోర్టళ్లకు ‘డిపిఐఐటి’ శ్రీకారం చుట్టింది. తద్వారా ‘గతిశక్తి’ ప్రయోజనాలు జిల్లాల స్థాయికి విస్తరిస్తాయి. ప్రతి జిల్లాలో సామాజిక-ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా నిరంతర ప్రణాళికల రూపకల్పన-అమలుకు వీలు కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో 2024 సెప్టెంబరు నెల తొలిపక్షం నాటికి 28 జిల్లాల్లో ‘డిఎంపి’ పోర్టల్ అందుబాటులోకి రాగా, 2025 మార్చి నాటికి దేశంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటవుతాయి.

   మరోవైపు  న్యూఢిల్లీలోని ‘ఐటిపిఒ’ ప్రాంగణంలో ‘పిఎం గతిశక్తి’, ‘ఒఎన్‌డిపి’ పథకాలకు సంబంధించి అత్యాధునిక అనుభవ విజ్ఞాన కేంద్రం ఏర్పాటైంది. ఇందులో 270 డిగ్రీల స్క్రీన్, హోలోగ్రాఫిక్ డిస్‌ప్లే వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఈ కార్యక్రమాలపై అవగాహన పెంచడంతోపాటు వాటి విజయాలను ప్రదర్శిస్తారు.

కీలక మేధా సంపత్తి (ఐపి) చట్టాలు నేర రహితం

   ‘జన్ విశ్వాస్’ బిల్లులో భాగంగా ‘పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, భౌగోళిక గుర్తింపు’ సంబంధిత మూడు కీలక మేధా సంపత్తి చట్టాలు నేరరహితం అయ్యాయి. దీంతో ఈ చట్టాల కింద నిబంధనానుసరణ, అమలు ప్రక్రియలు సరళమవుతాయి. తద్వారా భారత మేధా సంపత్తి రంగంలో ఆవిష్కరణ-సృజనాత్మకతలకు ప్రోత్సాహం లభిస్తుంది.

  అంతేకాకుండా ప్రపంచంలోనే తొలి ‘ఆవిష్కర్త ధ్రువీకరణ’ (సర్టిఫికేట్ ఆఫ్ ఇన్వెంటర్‌షిప్‌) విధానాన్ని భారత్ ప్రవేశపెట్టింది. తద్వారా స్వీయ పరిశోధన ద్వారా పేటెంట్‌ పొందిన ఆవిష్కర్తలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నగదుతో నిమిత్తం లేని ఈ గుర్తింపు వైజ్ఞానిక సమాజానికి ఎనలేని ప్రేరణనిస్తుంది. అలాగే మూలాల్లోని సమస్యల పరిష్కారం దిశగా ఆవిష్కరణ- సృజనాత్మకతలను మరింత ప్రోత్సహిస్తుంది.

సంస్కరణల ద్వారా నాణ్యతా చైతన్యానికి ప్రోత్సాహం

   భార‌త్‌ను నాణ్యత చైతన్యసహిత దేశంగా రూపుదిద్దడంలో భాగంగా ‘డిపిఐఐటి’ అనేక సంస్కరణలు తెచ్చింది. ఈ మేరకు ‘నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్’ (ఎన్ఎబిఎల్‌) ద్వారా గుర్తింపు ప్రక్రియలో మార్పులు చేసింది. తదనుగుణంగా గుర్తింపు పునఃపరిశీలన వ్యవధిని 2 నుంచి 4 సంవత్సరాలకు పొడిగించింది. అలాగే మహిళల నేతృత్వంలోగల ప్రయోగశాలలకు రాయితీలు ప్రకటించింది. అంతేగాక చర్మ-పాదరక్షల రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తుల తయారీతోపాటు ఎగుమతులకు ప్రోత్సహించేలా నాణ్యత నియంత్రణ ఉత్తర్వులు (క్యుసిఒ) జారీ చేసింది.

   నాణ్యమైన కార్యకలాపాల ద్వారా దేశ ప్రగతి పయనానికి తోడ్పడేలా యువ నిపుణులను ప్రోత్సహించాలని ‘డిపిఐఐటి’ నిర్ణయించింది. ఈ మేరకు ‘నాణ్యత గురుకులం’ (గుణ్వత్త గురుకుల్) వంటి పరిపూర్ణ శిక్షణ సంస్థలను ప్రారంభించింది. ఈ చర్యలతో తయారీలో నాణ్యత, తక్కువ-నాణ్యతగల దిగుమతుల తగ్గింపు, ‘మేక్ ఇన్ ఇండియా’ బ్రాండుకు ప్రోత్సాహమిచ్చే బలమైన చట్రం రూపొందుతోంది.

ఏంజెల్ టాక్స్ మినహాయింపుతో అంకుర సంస్థలకు ఉత్తేజం

   దేశంలోని అంకుర సంస్థల్లో కొత్త పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా పరిణమించిన ‘ఆగంతుక పన్ను’ (ఏంజెల్ టాక్స్)కు 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇంతకుముందు సముచిత మార్కెట్ విలువకు మించిన పెట్టుబడులపై విధించే ఈ పన్ను ముఖ్యంగా అంకుర సంస్థలకు పెనుభారంగా మారింది. ఈ అడ్డంకి తొలగిపోవడంతో ఇక ఆరంభ దశలో... ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచే వచ్చే పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే కృత్రిమ మేధ, పరిశుభ్ర ఇంధనం, లోతైన సాంకేతికతలు (డీప్ టెక్) వంటి వర్ధమాన రంగాల్లో వృద్ధికి ఈ నిర్ణయం ఒక ఉత్ప్రేరకం కాగలదు.

 

***



(Release ID: 2062275) Visitor Counter : 16


Read this release in: English