వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. స్వయం సమృద్ధి/ఆహార భద్రత లక్ష్యంతో ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై).. ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకాల’ (కెవి)కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
ఈ పథకాల నిధులను నిర్దిష్ట అవసరాల మేరకు ఇతర అంశాలకు మళ్లించుకునేలా రాష్ట్రాలకు వెసులుబాటు
Posted On:
03 OCT 2024 8:15PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయం-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను (సిఎస్ఎస్) రెండు సాముదాయక పథకాలుగా హేతుబద్ధీకరించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు ఐచ్ఛిక అనుసరణీయ (కెఫెటేరియా) ‘ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై), ‘వ్యవసాయ దిగుబడుల పెంపు పథకా’ల (కెవై)కు ఆమోదముద్ర వేసింది. వీటిలో ‘పిఎం-ఆర్‌కెవివై’ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేది కాగా, ఆహార భద్రత-వ్యవసాయ స్వయం సమృద్ధికి ‘కెవై’ దోహదం చేస్తుంది. ఈ సాముదాయ పథకాల కింద వివిధ పథకాలు-కార్యక్రమాలను సాంకేతికత సద్వియోగంతో ప్రభావవంతంగా, సమర్థంగా అమలు చేస్తారు.
ప్రధానమంత్రి జాతీయ వ్యవసాయాభివృద్ధి పథకం’ (పిఎం-ఆర్‌కెవివై), వ్యవసాయ దిగుబడుల పెంపు పథకాల (కెవై) పథకాల మొత్తం అంచనా వ్యయం రూ.1,01,321.61 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇవి అమలవుతాయి.
ఈ కృషితో ఇప్పటికే అమలులోగల పథకాలన్నీ కొనసాగేందుకు భరోసా లభిస్తుంది. రైతు సంక్షేమానికి ఊతమిచ్చే దిశగా ఏ అంశానికి అవసరమో దానికోసం ఈ పథకం లక్ష్యనిర్దేశిత విధానంలో అమలవుతుంది. వంటనూనెలు-ఆయిల్ పామ్ జాతీయ కార్యక్రమం (ఎన్ఎంఇఒ-ఒపి), ఆరోగ్యకర మొక్కల కార్యక్రమం (క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్), డిజిటల్ వ్యవసాయం/ ఖాద్యతైలాలు-నూనెగింజల జాతీయ కార్యక్రమం (ఎన్ఎంఇఒ-ఒఎస్) ఇందుకు ఉదాహరణలు.
ఇక ‘కెవై’ పథకంలో ‘మిషన్ ఆర్గానిక్ వాల్యూ చెయిన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్’ (ఎంఒవిసిడిఎన్ఇఆర్) ఒక భాగం కాగా, ‘డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్’ (డిపిఆర్) పేరిట మరొకదాన్ని జోడించి దీన్ని ‘ఎంఒవిసిడిఎన్ఇఆర్-డిపిఆర్’గా మారుస్తారు. ఈశాన్య రాష్ట్రాలు సంక్లిష్ట సవాళ్లను అధిగమించడంలో ఇది తోడ్పడుతుంది.
ఈ పథకాల హేతుబద్ధీకరణ వల్ల రాష్ట్రాలు తమ పరిధిలో వ్యవసాయ రంగ సంబంధిత సమగ్ర వ్యూహాత్మక పత్రాన్ని సంపూర్ణ పద్ధతిలో రూపొందించుకోగలవు. పంటల దిగుబడి- ఉత్పాదకతను మాత్రమేగాక వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయం-వ్యవసాయోత్పత్తులకు తగిన విలువ శ్రేణి విధాన రూపకల్పనలో సమస్యల పరిష్కారానికి ఈ పత్రం దోహదం చేస్తుంది. వ్యూహాత్మక చట్రం కింద నిర్దేశిత లక్ష్యాలతో ముడిపడిన పథకాలు/కార్యక్రమాలతోపాటు మొత్తం వ్యూహాన్ని స్పష్టం చేసే దిశగా ఈ ప్రణాళికలు రూపొందాయి.
వివిధ పథకాల హేతుబద్ధీకరణ లక్ష్యాలు కిందివిధంగా ఉన్నాయి:
· పునరావృతి నివారణ, సమన్వయానికి భరోసా, రాష్ట్రాలకు సౌలభ్య కల్పన.
· వ్యవసారంగంలో భవిష్యత్ సవాళ్లపై దృష్టి- పోషకాహార భద్రత, సుస్థిరత, వాతావరణ మార్పు నిరోధకత, విలువ శ్రేణి అభివృద్ధి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం.
· అవసరాలకు తగినట్లు వ్యవసాయ రంగ సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు.
· రాష్ట్రాల వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఎఎపి)లకు విడివిడిగా కాకుండా ఏకకాలంలో ఆమోదం.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్దిష్ట అవసరాల ప్రాతిపదికన ఈ పథకం నిధులను ఇతర అంశాలకు మళ్లించుకునే వెసులుబాటు కల్పించడాన్ని ‘పిఎం-ఆర్‌కెవివై’లో కీలక మార్పుగా పేర్కొనవచ్చు.
ఈ రెండు పథకాలకు మొత్తం అంచనా వ్యయం రూ.1,01,321.61 కోట్లు కాగా, ఇందులో కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వాటా రూ.69,088.98 కోట్లుగా ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.32,232.63 కోట్లు సమకూర్చాలి. కాగా, మొత్తం వ్యయంలో ‘ఆర్‌కెవివై’కి రూ.57,074.72 కోట్లు, ‘కెవై’కి రూ.44,246.89 కోట్లుగా నిర్దేశించారు.
‘పిఎం-ఆర్‌కెవివై’ అంతర్భాగ పథకాలివే:
i. భూసార నిర్వహణ
ii. వర్షాధార ప్రాంత అభివృద్ధి
iii. వ్యవసాయ అటవీకరణ
iv. సంప్రదాయ వ్యవసాయాభివృద్ధి పథకం
v. పంట వ్యర్థాల నిర్వహణ-వ్యవసాయ యాంత్రీకరణ
vi. ప్రతి నీటిచుక్కకూ మరింత పంట
vii. పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం
viii. ‘ఆర్‌కెవివై’ డిపిఆర్ భాగం
ix. వ్యవసాయ అంకుర సంస్థల కోసం ‘యాక్సిలరేటర్ ఫండ్’
***
(Release ID: 2061802)
Visitor Counter : 177