శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
థీమాటిక్ హబ్స్, టెక్నికల్ గ్రూప్స్ జాతీయ క్వాంటమ్ ఏర్పాటును ప్రకటించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రభుత్వ నిధులతో నడిచే ప్రపంచంలోనే మొట్ట మొదటి మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ భారత్ జెన్ ప్రారంభం
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతయిన ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్- 2047 సాధనలో కీలకంగా జాతీయ క్వాంటమ్ మిషన్ : కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
క్వాంటమ్ సాంకేతికతలో భారత్ ను అగ్రగామి చేయడమే జాతీయ క్వాంటమ్ కార్యక్రమ లక్ష్యం
దేశంలోని ఏఐ తయారీ, భారత్ కోసం ఏఐ తయారీ సాధనలో భారతదేశ నిబద్దతకు సరైన ఉదాహరణ భారత్ జెన్
Posted On:
30 SEP 2024 8:30PM by PIB Hyderabad
జాతీయ క్వాంటమ్ కార్యక్రమమనేది కేవలం క్వాంటమ్ కార్యక్రమం మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ అని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. ఇది దేశ భవిష్యత్తుకోసం వ్యూహాత్మక పెట్టుబడి. ఆర్థిక వృద్ధికోసం పునాది వేస్తుంది, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది. అంతే కాదు క్వాంటమ్ ఆధారిత ప్రపంచంలో సాంకేతికపరమైన నాయకత్వం చేపట్టడానికి దేశానికి ఉపయోగపడుతుంది అని కేంద్ర మంత్రి డాకర్ట్ జితేంద్ర సింగ్ అన్నారు. థీమాటిక్ కేంద్రాలు, జాతీయ క్వాంటమ్ కార్యక్రమ ( ఎన్ క్యూ ఎం) సాంకేతిక బృందాల ప్రకటన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ( స్వతంత్ర బాధ్యత), భూ విజ్ఞానశాఖ (స్వతంత్ర బాధ్యత), ప్రధాని కార్యాలయ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 17 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో 14 సాంకేతిక బృందాల (17 ప్రాజెక్ట్ టీమ్‌లు)తో కూడిన నాలుగు థీమాటిక్ హబ్‌లను (టి-హబ్‌లు) ఏర్పాటు చేయడాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఈ హబ్‌లు 43 సంస్థలకు చెందిన మొత్తం 152 పరిశోధకులను ఏకతాటిపైకి తీసుకొస్తాయి. వీటిలో 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు, 8 పరిశోధనా ప్రయోగశాలలు, ఒక విశ్వవిద్యాలయం 3 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి.వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటం సాంకేతికతల రంగంలో దేశం అగ్రగామిగా ఉండాలనే ఐక్యతాపూర్వక ఆశయాన్ని ఈ కార్యక్రమం ప్రతిఫలిస్తోందని మంత్రి అన్నారు.
" ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ -2047 సాధనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించిన దార్శనికతను సాకారం చేయడంలో జాతీయ క్వాంటమ్ కార్యక్రమం కీలకమైంది.భవిష్యత్తును తీర్చిదిద్దే క్వాంటమ్ సాంకేతికతలల్లో అత్యాధునికమైనదాన్ని సాధించాలనే భారత్ సంకల్పాన్ని జాతీయ క్వాంటమ్ కార్యక్రమం ప్రతిఫలిస్తోంది" అని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రత్యేకంగా తన ప్రసంగంలో పేర్కొన్నారు. .
ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ సలహా మండలి ( పిఎంఎస్ టీ ఐఏసీ) కింద ఉన్న తొమ్మిది కార్యక్రమాల్లో ఎన్ క్యూ ఎం ఒకటి. శాస్త్రీయ పరిశోధనలను ప్రభావితం చేయడానికి, క్వాంటమ్ సాంకేతికతల రంగంలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి ఎన్ క్యూ ఎం రూపొందింది.. సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ , ప్రెసిషన్ సెన్సింగ్ టెక్నాలజీ లను అభివృద్ధి చేయడం ద్వారా, టెలికమ్యూనికేషన్స్, రక్షణ రంగం, ఆర్థికరంగం, ఇంకా ఆరోగ్య భద్రత వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులకోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది శాశ్వత సామాజిక ప్రభావాన్ని చూపే కార్యక్రమం.
మంత్రి ప్రత్యేకంగా పేర్కొన్న ఈ డైనమిక్ టి-హబ్‌ల ముఖ్య బలాలలో ఒకటి, వాటి బహుళ-క్రమశిక్షణా విధానం. ఇది భౌతిక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ , మెటీరియల్ సైన్స్ వంటి విభిన్న రంగాలకు చెందిన నిపుణులను ఒకచోటకు చేరుస్తుంది. తద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పనిచేసేలా చేసి క్వాంటమ్ టెక్నాలజీలో సంపూర్ణ పురోగతిని సాధించడానికి దోహదం చేస్తుంది.
పరిశోధనలు, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అభివృద్ధి చేసే ఆవిష్కరణలు మార్కెట్‌లో స్పష్టమైన పురోగతికి దోహదం చేస్తాయి. టెలికమ్యూనికేషన్స్, రక్షణ రంగం, సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, ఆరోగ్య భద్రత వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుస్తాయి.
అంకుర సంస్థలకు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమై కీలక మద్దతును ఎన్ క్యూ ఎం అందిస్తుంది. క్వాంటమ్ -ఆధారిత ఆవిష్కరణల కోసం శక్తిమంతమైన ఆవరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. మనదేశం క్వాంటమ్ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవ్యవస్థకు కేంద్రంగా మారేలా దోహదం చేస్తుంది. ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్వాంటమ్ సాంకేతిక రంగాలలో ఉద్యోగాలను కల్పిస్తుంది. భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాల తీరును పసిగడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ , మెటీరియల్ సైన్స్-రంగాలలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేస్తుంది.
'మేక్ ఇన్ ఇండియా, 'డిజిటల్ ఇండియా' వంటి ఇతర జాతీయ కార్యక్రమాలతో ఎన్ క్యూ ఎంను పటిష్ఠం గా అనుసంధానించామని, క్లిష్టమైన అంశాలలో సాంకేతిక స్వావలంబనను ప్రోత్సహించడం, ప్రపంచ సాంకేతిక అభివృద్ధిలో దేశం అగ్రగామి అయ్యేలా కృషి చేస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
దేశ క్వాంటమ్ ఆవరణ వ్యవస్థకు చెందిన స్థిరమైన వృద్ధి దీర్ఘకాలంగా కొనసాగేలా ఎన్ క్యూ ఎంను రూపొందించారు. ఇది సామర్థ్యాన్ని పెంపొందించడం, పరిశోధనలకు నిధుల్ని సమకూర్చడం, దేశ సాంకేతిక సామర్థ్యాలపై శాశ్వత ప్రభావాన్ని కలిగించడంపై దృష్టి సారిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
నేషనల్ క్వాంటమ్ మిషన్ విజయవంతానికి విద్యారంగ సంస్థలు, పరిశ్రమలు, శాస్త్రవేత్తలు కలిసికట్టుగా పని చేయాలని దేశం ప్రపంచ క్వాంటమ్ సూపర్ పవర్‌గా ఎదిగేలా కృషి చేయాలని డాకర్ట్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. మనందరం కలిసికట్టుగా పని చేసి క్వాంటమ్ ఆవిష్కరణల్లో ప్రపంచానికే భారత్ నేతృత్వంవహించేలా చేద్దాం.. ప్రపంచ వేదికపై శాస్త్రీయ ఆవిష్కరణల్ని, పారిశ్రామిక మార్పులను భారత్ నిర్దేశించేలా చూద్దాం అని మంత్రి తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు.
భారత్ జెన్ : సాంకేతికరంగ నాయకత్వంలో ఒక మైలురాయి
యుపిఐతో పాటు వివిధ రంగాలను మార్చిన ఇతర ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విజయాల మాదిరిగానే, జెనరేటివ్ కృత్రిమ మేధ ( ఏఐ) రంగంలోకూడా భారతదేశాన్ని అగ్రగామిగా చేయడానికిగాను స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయాలి. ఈ విషయంలో దేశ నిబద్ధతకు భారత్‌జెన్ ఒక గర్వించదగిన ఉదాహరణ" అని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర వివరించారు. ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్‌కు సంబంధించిన జాతీయ కార్యక్రమం భారత్‌జెన్ ను ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు.
ప్రభుత్వ-నిధులతో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్రాజెక్ట్‌గా ఈ కార్యక్రమాన్ని గుర్తించారు. ఇది భారతీయ భాషలలో సమర్థమంతమైన , సమగ్రమైన ఏఐని రూపొందించడంపై దృష్టి పెట్టింది. భారత్ జెన్ కార్యక్రమంలోని కీలక అంశం దాని ఓపెన్ సోర్స్ ఫౌండేషనల్ మోడల్స్. ఇవి దేశమంతటా ఏఐని అందుబాటులోకి తేవడానికి సహాయపడుతాయి. ఏఐని మరింతగా అందుబాటులోకి తేవడం ద్వారా, ఒక సహకారావరణ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇందులో పరిశోధకులు , డెవలపర్‌లు కలిసి వినూత్న పరిష్కారాలను కనుగొంటారు.
భారత్ జెన్ కార్యక్రమం ఆత్మనిర్భర్ భారత్ సాధనకోసం ప్రత్యక్షంగానే కృషి చేస్తుంది. ఎందుకంటే మనం కేవలం వినియోగదారులం మాత్రమే కాదు.. మన దేశ విభిన్న అవసరాలను, సంస్కృతులను ప్రతి ఫలించేలా వినూత్న ఏఐ నిర్మాతలం అని మంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
దేశ భాషలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రి , భారత్‌జెన్ కార్యక్రమం సామాజిక సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను గౌరవించుకుంటూనే, వారికి ప్రయోజనం జరిగేలా ఏఐ పనిచేస్తుందని మంత్రి అన్నారు.
'మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ ఫర్ ఇండియా కోసం దేశం కనబరుస్తున్న నిబద్ధతను మంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పరిశ్రమలు, ప్రభుత్వం, ప్రజా సంక్షేమానికి మద్దతుగా రూపొందించిన భారత్‌జెన్‌ను ఒక పరిపూర్ణ ఉదాహరణగా పేర్కొన్నారు. సమూల మార్పులను తీసుకురాగలిగే శక్తిని కలిగిన ఏఐ నుంచి ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారంటూ తన ప్రసంగంలో భరోసానిచ్చారు.
***
(Release ID: 2060587)
Visitor Counter : 106