రక్షణ మంత్రిత్వ శాఖ
వాయుసేన నూతన అధిపతిగా ప్రస్తుత వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియామకం
Posted On:
21 SEP 2024 1:37PM by PIB Hyderabad
వాయుసేనలో వైస్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న పరమ విశిష్ఠ, అతి విశిష్ఠ సేవా పతకాలు పొందిన (పివిఎస్ఎం/ఎవిఎస్ఎం), ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ను వాయుసేన నూతన అధిపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వును అనుసరించి, ఎయిర్ చీఫ్ మార్షల్ గా సెప్టెంబర్ 30 మధ్యాహ్నం నుంచి సింగ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత వాయుసేన అధిపతి, పివిఎస్ఎం/ఎవిఎస్ఎం/విఎమ్/ఎడిసి పతకాలు పొందిన ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేస్తారు.
అక్టోబర్ 27, 1964 లో జన్మించిన ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, భారతీయ వాయు సేనలోకి 1984, డిసెంబర్ లో యుద్ధ పైలెట్ గా అడుగుపెట్టారు. వాయుసేన ద్వారా దేశానికి అందించిన 40 ఏళ్ళ సుదీర్ఘ విశిష్ఠ సేవలో భాగంగా ఆయన కమాండ్, సిబ్బంది వ్యవహారాలు, బోధన, విదేశీ విభాగాల్లో బాధ్యతలు నెరవేర్చారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో శిక్షణనందుకున్న అమర్ ప్రీత్ సింగ్ అటు ప్రయోగాత్మక టెస్ట్ పైలట్, వైమానిక శిక్షకులే కాక, వివిధ రకాల విమానాలను నడపడంలో 5000 గంటలకు పైగా అనుభవం కలవారు.
విధుల్లో భాగంగా ఫ్రంట్ లైన్ ఎయిర్ బేస్, వైమానిక యుద్ధ దళాలకు నేతృత్వం వహించారు. టెస్ట్ పైలట్ హోదాలో రష్యా రాజధాని మాస్కోలో మిగ్-29 అప్గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బృందానికి నాయకత్వం వహించారు. నేషనల్ ఫ్లైట్ టెస్ట్ కేంద్రంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో తేజస్ తేలికరకం యుద్ధ విమానాన్ని పరీక్షించే కీలక బాధ్యతని స్వీకరించారు. సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ దళంలో ఎయిర్ డిఫెన్స్ కమాండర్, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ దళ సీనియర్ ఎయిర్ స్టాఫ్ అధికారిగా ముఖ్యమైన హోదాల్లో సేవలందించారు. వాయుసేన వైస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టక మునుపు, అమర్ ప్రీత్ సింగ్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ లో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా సైతం విధులు నిర్వర్తించారు.
****
(Release ID: 2057650)
Visitor Counter : 50