ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా వ్యవస్థలను బలోపేతం చేద్దాం: ప్రతిజ్ఞతో ముగిసిన రెండు రోజుల గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2024


ప్రపంచ ఆహార భద్రత విస్తారిత వ్యవస్థను బలోపేతం చేయడంలో ముందువరుసలో భారత్

ఆహార రక్షణతో పాటు ఆహార భద్రతను కాపాడుకోవడం మన బాధ్యత: చిరాగ్ పాశ్వాన్

"మన ఆహార వ్యవస్థల వైవిధ్యం నిజంగా చెప్పుకోదగినది- ఇది భారతదేశపు జీవనసారం. ఈ విశాల సమృద్ధిని అర్థవంతమైన అవకాశాలుగా మార్చే మార్గాలను మేధోమథనం చేయాల్సిన అవసరం ఉంది.”

Posted On: 21 SEP 2024 7:34PM by PIB Hyderabad

భారత్ మండపంలో జరిగిన రెండు రోజుల గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2024 ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం కేంద్ర ఆహార ఉత్పత్తి  పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్వహించిన ఈ సదస్సులో ఆహార భద్రత, నియంత్రణ అంశాలపై అంతర్జాతీయ సహకారం, పరస్పర విజ్ఞాన బదిలీ పెంపొందించడానికి ఉద్దేశించిన లోతైన సంభాషణలు, చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ ఆహార రక్షణతో పాటు ఆహార భద్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన ఆహార నాణ్యతను కాపాడుకోవడమే కాకుండా దాని విలువను పెంచే మార్గాలను అన్వేషించే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ ఆహార నియంత్రణ సంస్థలు, ఇతర భాగస్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్న అంతర్జాతీయ సదస్సును నిర్వహించినందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐని శ్రీ పాశ్వాన్ అభినందించారు.  “మన ఆహార వ్యవస్థల వైవిధ్యం నిజంగా చెప్పుకోదగినది- ఇది భారతదేశపు జీవనసారం. ఈ విశాల సమృద్ధిని అర్థవంతమైన అవకాశాలుగా మార్చే మార్గాలను మేధోమథనం చేయాల్సిన అవసరం ఉందని” ఆయన అన్నారు.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ తన ప్రత్యేక ప్రసంగంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ ఈట్ రైట్ ఇండియా ఉద్యమాన్ని ప్రశంసించారు. 'మన దేశంలో ఈట్ రైట్ ఉద్యమం నడుస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీరంతా ఈట్ రైట్ ఇండియా జన్ ఆందోళన్ ఉద్యమంలో భాగస్వాములై  ప్రవర్తనలో మార్పుకై ప్రయత్నించాలని కోరుతున్నాను.”
అంతకు ముందు సమాంతర సెషన్ గా జరిగిన ప్రాంతీయ సదస్సులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ అధ్యక్షోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో ప్రాంతీయ దేశాల పాత్రను ఇనుమడింపచేయడానికి దేశాల మధ్య ఐక్యత, సహకారం అవసరమని  ఆమె ఉద్ఘాటించారు. మన దేశ జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలను కోడెక్స్ ప్రాంత ప్రమాణాలతో అనుసంధానించడంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ పోషించిన కీలక పాత్రను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కోడెక్స్ అలిమెంటరియస్ కమిషన్  ప్రమాణ-రూపకల్పన ప్రక్రియకు లోబడి సహకారం, సమన్వయాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన ప్రాంతీయ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. రోమ్ లోని కోడెక్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఒక ప్రాంతీయ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ఆహార భద్రత, వాణిజ్యం, నియంత్రణ సవాళ్ల గురించి చర్చించడానికి ఇది ఆసియా దేశాలకు ప్రత్యేక వేదికను అందించింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్ డి) కుమారి పుణ్య సలీలా శ్రీవాస్తవ కీలకోపన్యాసం చేశారు.
రెండు రోజుల ఈ సదస్సులో చోటు చేసుకున్న చర్చల సారాంశాన్ని  ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో శ్రీ జి.కమలా వర్ధనరావు వివరించారు. చర్చల సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు అందించిన అమూల్యమైన సహకారం, నైపుణ్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రెండోరోజు సదస్సులో అవశేషాలు, కలుషితాల పర్యవేక్షణ వ్యవస్థలు, ఆహార పరీక్షలకోసం ఆధునిక విశ్లేషణ పద్దతులు,  బహిర్గతం అవ్వని ఆకలిని నిర్మూలించేందుకు పటిష్ట వ్యవస్థల నిర్మాణం, ఆహార భద్రత మానవ ఆరోగ్యంపై జంతువుల ఆహార ప్రభావం వంటి క్లిష్టమైన అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ఈ సదస్సును సెప్టెంబర్ 20 (శుక్రవారం) న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జెపి నడ్డా ప్రారంభించారు. వివిధ  ఆహార భద్రతా వ్యవస్థలు, నియంత్రణ, ప్రాధమిక ప్రణాళికలకు సంబంధించిన కీలక సమస్యలపై తమతమ దృక్పథాలను, జ్ఞానాన్నిపరస్పర బదిలీ చేసుకోడానికి వీలుగా  ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార నియంత్రణ సంస్థలను ఏకతాటిపైకి తెచ్చింది.
భారత సరిహద్దుల వద్ద ఆహార దిగుమతి తిరస్కరణ అప్రమత్తత కోసం ఆన్లైన్ పోర్టల్- ఫుడ్ ఇంపోర్ట్ రిజెక్షన్ అలర్ట్స్ (ఎఫ్ఐఆర్ఏ) ను , ఆహార దిగుమతి అనుమతి మంజూరు కోసం అధునాతన వెబ్ సైట్- ఫుడ్ ఇంపోర్ట్ క్లియరెన్స్ సిస్టమ్ (ఎఫ్ఐసీఎస్) 2.0 లతోపాటు అనేక నూతన కార్యక్రమాలను సదస్సు సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా 'ఫ్లేవర్స్ ఆఫ్ శ్రీ అన్నా - సెహత్ ఔర్ స్వాద్ కే సంగ్' అనే చిరుధాన్యాల వంటకం ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసారు. భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రత పనితీరును మూల్యాంకనం చేసే వార్షిక నివేదిక- స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (ఎస్ఎఫ్ఎస్ఐ) 2024 విడుదల కావడం కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
70కి పైగా  దేశాలకు చెందిన ఆహార భద్రతా నియంత్రణ సంస్థలు, నష్టాల మదింపు ప్రాధికార సంస్థలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల (ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్లు, రిస్క్ అసెస్ మెంట్ అథారిటీలు, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లు, యూనివర్శిటీల) ప్రతినిధులు కీలక నియంత్రణ అంశాలపై చర్చించి వ్యూహరచన చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలను పెంపొందించడంలో, ఆహార రక్షణను నిర్ధారించడంలో ప్రపంచ ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి భారతదేశం  నిబద్ధతను ఇది స్పష్టం చేసింది. ఈ సదస్సు, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత విస్తారిత వ్యవస్థను ప్రభావితం చేసే ఆహార భద్రత, నష్టాల మదింపు, విశ్లేషణాత్మక బలం, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల వంటి కీలక అంశాలపై చర్చలు ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమారి ఇనోషి శర్మ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

***


(Release ID: 2057624) Visitor Counter : 75


Read this release in: English , Hindi