అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

చంద్రుడు, మార్స్ గ్రహాల పరిశోధనల అనంతరం శుక్రగ్రహ ప్రయోగాలు చేపట్టేందుకు భారత్ సిద్ధం


శుక్ర గ్రహ వాతావరణం, దాని భూభౌతిక పరిస్థితుల అధ్యయనం ద్వారా

భారీ సమాచార సేకరణే లక్ష్యంగా శుక్రగ్రహ పరిశోధనకూ కేంద్ర మంత్రివర్గ ఆమోదం.

Posted On: 18 SEP 2024 3:15PM by PIB Hyderabad

శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన శుక్ర గ్రహ పరిశోధనలకూ(వీనస్ ఆర్బిటర్ మిషన్ – వీఓఎం) ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చంద్రుడు, మార్స్ గ్రహాల అధ్యయనాల అనంతరం, శుక్రగ్రహాన్ని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. భూమికి అతి సమీపంలో ఉన్న శుక్రగ్రహం కూడా భూమి ఏర్పడిన పరిస్థితులను పోలిన వాటితోనే ఏర్పడిందని భావిస్తారు. భిన్నమైన వాతావరణాల్లో గ్రహాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని యోచిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం నేతృత్వంలో రూపుదిద్దుకునే వీనస్ ఆర్బిటర్ మిషన్ కింద- ఒక స్పేస్ క్రాఫ్ట్ (విశ్వ వాహక నౌక) శుక్రగ్రహ కక్ష్యలో పరిభ్రమిస్తూ, శుక్రగ్రహ ఉపరితలాన్నీ, అంతర స్తరాన్నీ, భూగర్భాన్ని, వాతావరణ పరిస్థితులనీ, శుక్రగ్రహం వాతావరణంపై సూర్యుడి ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేస్తుంది. ఒకప్పుడు భూగ్రహంలాగే  ఆవాసయోగ్యంగా ఉన్న శుక్రగ్రహం మార్పులు ఎందుకు చోటు చేసుకున్నదీ, కారణాల అన్వేషణ, అక్కాచెల్లెళ్ల వంటి ఈ రెండు గ్రహాలు- భూమి, శుక్రగ్రహం ఆవిర్భావం గురించిన  అమూల్యమైన సమాచారం లభించగలదని భావిస్తున్నారు.

అంతరిక్ష నౌక రూపకల్పన, ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపడుతుంది. సంస్థలో అమలులో ఉన్న సమర్ధమైన విధివిధానాల ద్వారా ఈ కార్యక్రమాల రూపకల్పన, పర్యవేక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఈ పరిశోధనల ద్వారా సమీకరించిన సమాచారాన్ని నేడున్న సమాచార విధానంలో శాస్త్ర ప్రపంచం ముందు ఉంచుతారు.

అందుబాటులో ఉండే అవకాశాలను బట్టి, ఈ మిషన్ ను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని తలపోస్తున్నారు. దీని ద్వారా లభించే సమాచారం ఎన్నో జటిలమైన శాస్త్రపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదని, తద్వారా అనేక నూతన ఆవిష్కరణలకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతరిక్ష నౌక నిర్మాణం, ప్రయోగం అనేక పరిశ్రమలు సంయుక్తంగా అందించే సహకారం వల్ల సాకారం కానుండగా, అనేక ఉపాధి అవకాశాలను ప్రాజెక్టు కల్పిస్తుందని, కనుగొన్న సాంకేతిక అంశాలు ఆర్ధిక వ్యవస్థలోని అనేక రంగాలకు లబ్ధి చేకూర్చగలవని భావిస్తున్నారు.

వీనస్ మిషన్ కు మొత్తం రూ.1236 కోట్లు కేటాయించగా, ఇందులో అంతరిక్ష నౌక నిర్మాణానికి రూ.824 కోట్లు ఖర్చు చేస్తారు. అంతరిక్ష నౌక అభివృద్ధి పనులు, పేలోడ్ లు, సాంకేతిక ఉపకరణాలు, ప్రపంచవ్యాప్త సహాయ కేంద్రాల ఏర్పాటు వ్యయం, నావిగేషన్, నెట్ వర్క్- తదితర అంశాలపై మిగతా సొమ్ముని ఖర్చు చేస్తారు.

శుక్రగ్రహం వైపు ప్రయాణం

అధిక బరువులను తీసుకుపోయే వాహక నౌకలు, తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించడం వంటి వల్ల భవిష్యత్తులో భారత్ చేపట్టే విశ్వశోధనలకు ఇవన్నీ ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇక అంతరిక్ష నౌక, స్పేస్ క్రాఫ్ట్ తయారీలో భారత పరిశ్రమలు కీలక పాత్ర పోషించనున్నాయి. నౌక నిర్మాణం, డిజైన్, అభివృద్ధి, పరీక్షలు, డేటా కుదింపు, పరిశీలన, వంటి తొలి దశల్లో విద్యార్థుల భాగస్వామ్యం, వారికి తగిన శిక్షణనందించేందుకు వివిధ ఉన్నత విద్యా సంస్థలు భాగం కానున్నాయి. ఈ మిషన్ భారత వైజ్ఞానిక సమాజానికి విలువైన నూతన సమాచారాన్ని అందించగలదని, తద్వారా వినూత్న అవకాశాలకు ద్వారాలు తెరవగలదని భావిస్తున్నారు.

 

***


(Release ID: 2056413) Visitor Counter : 116