జాతీయ మానవ హక్కుల కమిషన్
మానవ హక్కుల పట్ల అవగాహన కోసం శిక్షణార్థులకు తర్ఫీదునిచ్చిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
డాక్టర్ ఎంసీఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ సహకారంతో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు సిబ్బంది, మహిళా శిశు అభివృద్ధి అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రతినిధులు
అణగారిన వర్గాల హక్కులను పరిరక్షించడం సమష్టి బాధ్యత: డాక్టర్ శశాంక్ గోయల్
Posted On:
13 SEP 2024 7:39PM by PIB Hyderabad
దేశంలో మానవ హక్కుల పట్ల అవగాహనను పెంపొందించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ తన పరిధిని విస్తరించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని సెంటర్ ఫర్ లా అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖల ప్రతినిధులతో పాటు సుమారు 50 మంది అధికారులకు పాల్గొన్నారు. శిక్షణ తీసుకున్న వారంతా తమ తమ విభాగాల్లో ఇతరులకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో విద్యారంగ నిపుణులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, న్యాయవ్యవస్థకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ముగింపు సభలో తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ జనరల్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ పాల్గొన్నారు. మానవ హక్కులను పరిరక్షించడంలో, ముఖ్యంగా బలహీన వర్గాల వారి హక్కుల్ని రక్షించడం సమష్టి బాధ్యత అని ఆయన అన్నారు. శిక్షణార్ధుల అంకితభావం పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు. ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ చేస్తున్న కృషిని కొనియాడారు.
మానవ హక్కులకు సంబంధించిన వివిధ అంశాలు, రాజ్యాంగ నిబంధనలు, అంతర్జాతీయ మానవ హక్కుల డిక్లరేషన్, మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ, అంతర్జాతీయ యంత్రాంగాలు, మహిళల హక్కులు, బాలల హక్కులు, ఇతర బలహీన వర్గాల హక్కులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వీటితో పాటు ఎన్‌హెచ్‌ఆర్‌సీ, వివిధ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ల పనితీరును చర్చించారు.
మొదటి రోజు అవగాహన కార్యక్రమంలో- శిక్షణ అంశాలపై అవలోకనం, మానవ హక్కులపై రాజ్యాంగ నిబంధనలు వంటివాటితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.ఎస్.రామచంద్రతో ముఖాముఖిని నిర్వహించారు. మహిళల హక్కులపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ సలహాదారు శ్రీనివాస్ మాధవ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో రాజ్యాంగం, అంతర్జాతీయ చట్టాలు- మహిళా హక్కులు అన్న అంశంపై చర్చించారు. అనంతరం మానవ అక్రమ రవాణా, గృహహింస, భ్రూణహత్యలతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఐపీఎస్ అధికారి ఉమాపతి ప్రసంగించారు.
రెండవ రోజు భారతదేశంలోని మానవ హక్కుల సంఘాలు, మానవ హక్కుల పరిరక్షణ చట్టం -1993 గురించి విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ దామోదర్ శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు, వయోవృద్ధులు, సంక్షేమం చట్టం-2007, దివ్యాంగులు, ట్రాన్స్ జండర్ల హక్కులపై శ్రీనివాస్ మాధవ్ దృష్టి సారించారు. అనంతరం భ్రూణహత్యలు, వికలాంగుల చట్టం, మానవ హక్కుల పరిరక్షణ చట్టంపై చర్చించారు.
మూడో రోజు ప్రత్యక్ష సాక్షుల ప్రమేయం, మానవహక్కుల ఉల్లంఘన కేసుల్లో జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎంసీఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ కోర్సు కోఆర్డినేటర్ శ్రీమతి జి.ఝాన్సీరాణి వివరించారు. పనిప్రాంతాల్లో లైంగిక వేధింపులు, ఫిర్యాదులను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న యంత్రాంగాల గురించి సెంటర్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన ఐటీ సీనియర్ ఫ్యాకల్టీ- డాక్టర్ మాధవి రావులపాటి మాట్లాడారు.
దక్షిణ భారతదేశంలో మానవ హక్కుల పట్ల ప్రోత్సాహం, న్యాయవాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కమిషన్ కు ఉన్న నిబద్దతను తెలుపుతోంది. ఇది మానవ హక్కుల పట్ల అవగాహనను పెంపొందించడానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మానవ హక్కులను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి పరిధిలోని సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాల సమన్వయంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉత్తేజంగా పనిచేస్తోంది. వ్యక్తుల వ్యక్తిగత గౌరవాన్ని, న్యాయాన్ని కాపాడేందుకు, సమ సమాజానికి అవసరమైన హక్కుల చైతన్యం కలిగించేందుకు మానవ హక్కుల కమిషన్ అంకితభావంతో పనిచేస్తోంది.
***
(Release ID: 2055120)
Visitor Counter : 64