హోం మంత్రిత్వ శాఖ
దేశీయాంగ వ్యవహారాలు-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో రెండో రోజు కొనసాగిన జాతీయ భద్రత వ్యూహాల సదస్సు-2024
Posted On:
14 SEP 2024 9:54PM by PIB Hyderabad
దేశీయాంగ వ్యవహారాలు-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో ఇవాళ రెండోరోజు జాతీయ భద్రత వ్యూహాల సదస్సు-2024 కొనసాగింది.
ఈ సందర్భంగా- ఉగ్రవాద నిరోధక కృషిని మరింత ముమ్మరం చేయడంపై సమగ్ర వ్యూహాన్ని కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ సంస్థలతో సహకారంసహా ఉగ్రవాద నిధుల నిరోధక సామర్థ్యం పెంపుపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉందని సూచించారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక చట్రాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళాల (ఎటిఎస్) మధ్య సహకారం-సమన్వయం మరింత పెరగాలని చెప్పారు. మావోయిస్టుల నిరోధంలో విజయంపై హోంమంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ- ఇటీవల ఆ సాయుధ బృందాల అధీనంలోని ప్రాంతాలను విముక్తం చేసిన రాష్ట్రాల్లో మరింత అప్రమత్తత అవసరమని హెచ్చరించారు.
భారత్‌ను 2047 నాటికి సుసంపన్న, శక్తియుత, ప్రగతిశీల దేశంగా రూపొందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత సాకారం దిశగా కృషి చేయాలని రాష్ట్రాల డీజీపీలను శ్రీ అమిత్ షా కోరారు. జమ్ముకశ్మీర్, ఈశాన్య భారత అలజడులు సహా వామపక్ష తీవ్రవాదం వంటి వారసత్వ జాతీయ భద్రత సమస్యల పరిష్కారంలో గణనీయంగా ముందంజ వేశామన్నారు. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు, నిఘా-స్మగ్లింగ్ డ్రోన్లు, ఆన్‌లైన్ మోసాల నిరోధం సహా జాతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను గుర్తించి, ఆదిలోనే అంతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
దేశంలో మూడు కొత్త నేరవిచారణ చట్టాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో పౌర హక్కుల పరిరక్షణ, బాధితులకు సత్వర-సకాల న్యాయ ప్రదానంపై దృష్టి పెట్టాలని డీజీపీలకు హోమ్-సహకార శాఖల మంత్రి సూచించారు. ఆలోచన ధోరణిలో మార్పు, సాంకేతికతల అనుసరణ, నిరంతర సమన్వయంతో మాత్రమే కొత్త చట్టాల ప్రగతిశీల ప్రభావం ప్రస్ఫుటం కాగలదని స్పష్టీకరించారు. కొత్త చట్టాలను తూచా తప్పకుండా అమలు చేయడం కోసం యువ పోలీసు అధికారుల బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
క్రిప్టో నుంచి హవాలా వరకూ మోసపూరిత ఆర్థిక లావాదేవీలన్నిటినీ అరికట్టే వ్యూహాత్మక పరిష్కారాన్వేషణపై యువ పోలీసు అధికారులు దృష్టి కేంద్రీకరించాలని శ్రీ అమిత్ షా ఉద్బోధించారు.
బహుకోణీయ విధానం, సమాచార విశ్లేషణ, కొత్త మెలకువలను అనుసరించడం వంటి మార్గాల ద్వారా అంతర్గత భద్రత చట్రాన్ని పటిష్టం చేయాలని డీజీపీలకు ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్న అత్యాధునిక ‘సమాచార భాండాగారాల’ (డేటాబేస్)ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
***
(Release ID: 2055104)
Visitor Counter : 58