జాతీయ మానవ హక్కుల కమిషన్
తెలంగాణలోని కుమురం భీమ్-ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పట్టణంలో మహిళపై హత్యాచార యత్నం మీద గిరిజన సంస్థల నిరసన మతపరమైన హింసకు దారితీయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) స్వచ్ఛంద విచారణ
ఈ ఉదంతంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు నోటీసులు జారీ;
ఎఫ్‌ఐఆర్ ప్రస్తుత స్థితి... బాధితురాలి ఆరోగ్యం... కౌన్సెలింగ్.. రాష్ట్ర అధికార యంత్రాంగం నుంచి పరిహారం తదితర వివరాలన్నీ పొందుపరచాలని ఆదేశం
प्रविष्टि तिथि:
10 SEP 2024 6:03PM by PIB Hyderabad
తెలంగాణలోని కుమురం భీమ్-ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పట్టణంలో సెప్టెంబరు 4న మహిళపై హత్యాచారయత్నం మీద గిరిజన సంస్థల నిరసన ఉద్రిక్తతకు, మతపరమైన హింసాత్మక ఘటనలకు దారితీసింది. దీనిపై వివిధ మాధ్యమాలలో వచ్చిన కథనాల మీద స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) స్వచ్ఛంద విచారణ ప్రారంభించింది. ఈ ఉదంతాల్లో కొన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలను ఆందోళనకారులు తగులబెట్టారు. ఒక మతపరమైన ప్రదేశంపై రాళ్లు విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో అధికార యంత్రాంగం అదనపు పోలీసు బలగాలను మోహరించడంతోపాటు కర్ఫ్యూ సహా ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, సామాజిక సంఘాల పెద్దలు ఉద్రిక్తతలను ఉపశమింపజేశారు.
ఈ సంఘటనలన్నిటిపైనా వచ్చిన వార్తా కథనాలను కమిషన్ పరిశీలించింది. ఇదంతా వాస్తవమే అయిన పక్షంలో, దీన్ని తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని భావించింది. ఈ మేరకు మొత్తం సంఘటనలపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ ప్రస్తుత స్థితి, బాధితురాలి ఆరోగ్య పరిస్థితితోపాటు ఆమెకు ఉపశమనం దిశగా చేపట్టిన చర్యలు, రాష్ట్ర అధికార యంత్రాంగం నుంచి పరిహారం తదితర వివరాలన్నీ ఆ నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది.
కాగా, సెప్టెంబరు 5నాటి మీడియా కథనాల ప్రకారం- ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో కర్రతో తీవ్రంగా కొట్టి, అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో రోడ్డుపై పడేసి వెళ్లాడు. ఆ తర్వాత బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా- స్పృహలోకి వచ్చిన అనంతరం తనపై అత్యాచార-హత్యాయత్నం గురించి పోలీసులకు వివరించింది.
***
(रिलीज़ आईडी: 2053619)
आगंतुक पटल : 84