ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
‘వికసిత భారత్-2047’ సంకల్పంలో భాగంగా ‘ఇండియా గ్రాఫీన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్’ (ఐజిఇఐసి)ను ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
అత్యాధునిక పరిష్కారాల రూపకల్పన... అధునాతన సరంజామా దిశగా బలమైన పారిశ్రామిక పునాది నిర్మాణంలో మా నిబద్ధతను ఐజిఇఐసి ప్రతిబింబిస్తుంది: కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్
Posted On:
04 SEP 2024 6:19PM by PIB Hyderabad
వికసిత భారత్-2047 సంకల్పం దిశగా కీలక చర్యల్లో భాగంగా ‘ఇండియా గ్రాఫీన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నొవేషన్ సెంటర్’ (ఐజిఇఐసి)ను ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
ఇది సెక్షన్ 8 పరిధిలోకి వచ్చే లాభాపేక్షరహిత సంస్థ. గ్రాఫీన్ సాంకేతికత వాణిజ్యీకరణలో భాగంగా అత్యుత్తమ నైపుణ్య కూడలిగా ఇది రూపొందింది. ఎలక్ట్రానిక్స్, ఇంధన నిల్వ, ఆరోగ్య సంరక్షణ, పదార్థాలపై పూత, రవాణా వ్యవస్థలు, సుస్థిర పదార్థ రూపకల్పన వంటి అనేకరకాల అనువర్తనాలపై ఈ కేంద్రం దృష్టి సారించింది.
ఈ కేంద్రాన్ని ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రిత్వశాఖలోని గ్రూప్ కో-ఆర్డినేటర్ శ్రీమతి సునీతా వర్మ, ‘ఐజిఇఐసి’ చైర్మన్ శ్రీ మాధవన్ నంబియార్, మంత్రిత్వశాఖ పరిధిలోని శాస్త్రవేత్త శ్రీ సురేంద్ర గోథర్వాల్, ‘ఐజిఇఐసి’ బోర్డు సభ్యులు ప్రొఫెసర్ అలెక్స్ జేమ్స్, శ్రీ కామేష్ గుప్తా తదితరులు కూడా పాల్గొన్నారు.
గ్రాఫీన్ సాంకేతికతలో అగ్రగామిగా నిలవనున్న భారత్
‘ఐజిఇఐసి’ ఏర్పాటును గ్రాఫీన్ సాంకేతికత వాణిజ్యీకరణలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలిపే ముందడుగుగా దీన్ని భావిస్తున్నారు. కేరళలోని త్రివేండ్రంలో పరిశోధన-అభివృద్ధి కేంద్రంసహా కర్ణాటకలోని బెంగళూరులో కార్పొరేట్-బిజినెస్ డెవలప్‌మెంట్ కూడలి అనుసంధానంతో వ్యూహాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశారు. కేరళ ప్రభుత్వ చేయూతతో నడిచే తయారీ యూనిట్ ఆ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో ఉంది. గ్రాఫీన్ సాంకేతికత అభివృద్ధి, వాణిజ్యీకరణ దిశగా సమగ్ర వ్యవస్థను ఇది సృష్టిస్తుంది.
అంకుర సంస్థలు, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధికి అవకాశాలు
ఈ సందర్భంగా శ్రీ ఎస్.కృష్ణన్- గ్రాఫీన్ పరివర్తనాత్మక సామర్థ్యం గురించి వివరించడంతోపాటు ఈ ప్రపంచ సాంకేతిక విప్లవంలో భారత్‌ను ‘ఐజిఇఐసి’ అగ్రస్థానాన నిలపగలదని పేర్కొన్నారు. ‘‘గ్రాఫీన్ అరోరా ప్రోగ్రామ్’ కింద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. అత్యాధునిక పరిష్కారాల రూపకల్పన, అధునాతన సరంజామాకు బలమైన పారిశ్రామిక పునాది నిర్మాణంలో మా నిబద్ధతకు ఇది నిదర్శనం. ఈ కేంద్రం కేవలం ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు అంకుర సంస్థలు, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధికి గణనీయ అవకాశాలను సృష్టిస్తుంది’’ అని వెల్లడించారు.
అంతర్జాతీయ కార్యక్రమంలో భాగమైన ద్వైపాక్షిక సహకారం సహా భారత్‌లోని అంకుర సంస్థలు, ‘ఎస్ఎంఇ’లు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వంతో సంయుక్తంగా దేశంలో గ్రాఫీన్ సంబంధిత వాతావరణ సృష్టికి ఈ కృషి దోహదం చేస్తుంది.
***
(Release ID: 2052105)
Visitor Counter : 99