యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పారిస్ పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన రూబినా ఫ్రాన్సిస్
పిస్టల్ పారా-షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళ
Posted On:
02 SEP 2024 7:31PM by PIB Hyderabad
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ క్రీడోత్సవాల్లో మహిళల 10ఎం ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ 1 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించి రూబినా ఫ్రాన్సిస్ చరిత్ర సృష్టించింది. ఎగువ లేదా దిగువ అవయవ లోపంతో బాధ పడుతున్న అథ్లెట్లు ఎలాంటి కష్టం లేకుండా నిలబడిన లేదా కూర్చున్న భంగిమలో షూట్ చేసేందుకు వీలు కల్పించిన ఈవెంట్ ఇది. ఇందులో 211.1 స్కోరుతో రూబినా కాంస్య పతకం సాధించడం మాత్రమే కాకుండా పారాలింపిక్స్ లో పిస్టల్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర నెలకొల్పింది. ఆమె ప్రదర్శించిన అద్భుత ప్రతిభ భారత పారాలింపిక్స్ చరిత్రలోనే ఒక కీలక ఘట్టంగా నిలుస్తుంది. ఈ ఈవెంట్ లో రూబినా అసాధారణ ప్రతిభ, అంకిత భావం ప్రదర్శించింది. ఈ విజయం భారత క్రీడారంగంలోనే ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది. భవిష్యత్ అథ్లెట్లకు రూబినా మార్గదర్శిగా నిలుస్తుంది.
ప్రారంభ జీవనం, ఎదుగుదల
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన రూబినా ఫ్రాన్సిస్ పారా-షూటింగ్ లో రాణించేందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబంలో కాలికి సంబంధించిన వైకల్యంతో ఆమె జన్మించారు. పారా షూటింగ్ లో ఆమె ఆసక్తిని గుర్తించిన తండ్రి సైమన్ ఫ్రాన్సిస్ ఆమెకు అవసరమైన మద్దతు అందించేందుకు ఎంతో శ్రమపడవలసి వచ్చింది. ఫలితంగా ఆమె ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గగన్ నారంగ్ ఒలింపిక్స్ లో సాధించిన విజయం స్ఫూర్తిగా రూబినా 2015 లో షూటింగ్ లో కెరీర్ ప్రారంభించారు. తండ్రి అందించిన గట్టి మద్దతుతో ఆమె 2017లో పూణెకు చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో చేరారు. ప్రారంభంలో శ్రీ జై ప్రకాష్ నౌతియాల్ వద్ద శిష్యరికం చేసిన ఆమెకు తదుపరి దశలో ఎంపి షూటింగ్ అకాడమీలో జస్పాల్ రాణా మార్గదర్శకత్వం చేశారు. వారిద్దరి మద్దతుతో ఆమె త్వరత్వరగా తనలోని ప్రతిభను ప్రదర్శించడం ప్రారంభించారు.
2018లో జరిగిన పారిస్ వరల్డ్ కప్ ఆమె జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. అక్కడ ఆమె సాధించిన పారాలింపిక్స్ కోటా శిక్షణలో వేగం పెరగడానికి దోహదపడింది. 2019లో పూర్ణత్వ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ షూటింగ్ ఆమెలోని ప్రతిభను గుర్తించింది. అక్కడ చీఫ్ కోచ్ శ్రీ సుభాష్ రాణా శిక్షణలో ఆమె రాణించడంతో పతకాల సాధన, రికార్డుల నమోదు పర్వం ప్రారంభమయింది. 2021 లిమా వరల్డ్ కప్ ఆమె విజయాలకు కీలక ఘట్టంగా చెప్పవచ్చు. అక్కడ ఆమె సాధించిన పారాలింపిక్స్ కోటా 2020 టోక్యో పారాలింపిక్స్ లో ప్రవేశానికి అర్హత సాధించి పెట్టింది. తద్వారా భారతదేశానికి చెందిన తొలి పారాలింపిక్స్ మహిళా పారా షూటర్ గా చారిత్రక ప్రాతినిథ్యం వహించేందుకు మార్గం సుగమం అయింది (కరోనా మహమ్మారి కారణంగా 2020 లిమా వరల్డ్ కప్ 2021 జూన్ లోను, 2020 పారాలింపిక్స్ 2021 ఆగస్టులోను జరిగాయి). షూటింగ్ లో రూబినా ప్రయాణం ఆమె సంకల్పశక్తికి, దృఢ నిశ్చయానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
****
(Release ID: 2051248)
Visitor Counter : 44