యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పారిస్ 2024 పారాలింపిక్స్ లో రజతం గెలిచిన మనీష్ నర్వాల్
అంకితభావం, విజయంతో కూడిన ప్రయాణం
Posted On:
02 SEP 2024 7:03PM by PIB Hyderabad
పారిస్ 2024 పారాలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన మనీష్ నర్వాల్ విజయం కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనే అనేక మందికి ఇది స్ఫూర్తి. సంకల్పం, సరైన మద్దతు ఉంటే, అడ్డంకులను అధిగమించి గొప్ప విజయాలను సాధించడం సాధ్యమనేందుకు అతని విజయమే నిదర్శనం!
షూటింగ్ ప్రారంభం
మనీష్ నర్వాల్ 2001, అక్టోబరు 17న హర్యానాలోని ఫరీదాబాద్‌లో జన్మించారు. అతని కుడిచేతిలో పుట్టుకతో లోపాన్ని కలిగి ఉన్నా, అతను దానిని తన ఆశయాలకు అడ్డుకానివ్వలేదు. హర్యానాలోని బల్లాబ్‌గఢ్‌లో పెరిగిన మనీష్‌ను 2016లో అతని కుటుంబం స్థానిక షూటింగ్ రేంజ్‌లో చేర్చడంతో షూటింగ్ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఈ క్రీడ పట్ల అతను త్వరగా ఆకర్షితుడయ్యాడు. ప్రతిరోజూ షూటింగ్ రేంజ్‌కి హాజరయ్యేవాడు. మొదట్లో పారాలింపిక్ పోటీల గురించి తెలియకపోయినా, తోటి అథ్లెట్లతో పోటీపడటానికి ఆసక్తి చూపేవాడు. అయినప్పటికీ, అతని సహజ ప్రతిభ, షూటింగ్ పట్ల అతనికి గల మక్కువ కారణంగా అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ఒక్కో మెట్టు ఎదుగుతూ: స్థానిక ప్రతిభ నుండి అంతర్జాతీయ స్టార్ వరకు
మనీష్ ప్రతిభకు అనతి కాలంలోనే మంచి గుర్తింపు లభించింది. శిక్షణ ప్రారంభించిన కొద్ది కాలానికే కోచ్ జై ప్రకాష్ నౌటియాల్ అతని సామర్థ్యాన్ని గుర్తించి శిష్యునిగా స్వీకరించారు. పారా-షూటింగ్ విభాగంలో అతనికి మార్గనిర్దేశం చేశారు. మనీష్ 2017 బ్యాంకాక్ ప్రపంచ కప్‌లో అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేశారు. ఆ పోటీలలో అతను P1 – 10మీటర్ ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో ఏకంగా స్వర్ణం సాధించారు. అతను ఈ పోటీల్లో అగ్రస్థానాన్ని సాధించడమే కాకుండా, అర్హత రౌండ్, తుది రౌండ్ పోటీలు రెండింటిలోనూ జూనియర్ స్థాయి ప్రపంచ రికార్డులు కూడా నెలకొల్పారు. మంచి నైపుణ్యం గల కోచ్ జై ప్రకాష్ నౌటియాల్, అలాగే జాతీయ కోచ్ సుభాష్ రాణాల మార్గదర్శకత్వంలో మనీష్ సాధించిన అనేక విజయాలలో ఇది మొదటిది.
గడిచిన కొన్ని సంవత్సరాలలో, మనీష్ 2020 టోక్యో పారాలింపిక్స్ లో P4 మిక్స్ డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకం, ఏషియన్ పారా గేమ్స్‌లో పలు పతకాలతో పాటు అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. వివిధ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ప్రపంచ కప్ పోటీలలో అతని స్థిరమైన ప్రదర్శన అతనిని ప్రపంచంలోని అగ్రశ్రేణి పారా-షూటర్‌ల సరసన నిలిపింది.
ప్రభుత్వ మద్దతు: అతని విజయంలో కీలకం
అథ్లెట్‌గా అతని అభివృద్ధిలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల మద్దతు కీలకంగా ఉంది. వాటి ద్వారా మనీష్ విజయ యాత్రకు మంచి మద్దతు లభించింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీఓపీఎస్), ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు అతనికి శిక్షణకు, పోటీలకు ఆర్థిక సహాయం అందించాయి. అలాగే ఢిల్లీలోని డా. కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ వంటి అగ్రశ్రేణి సౌకర్యాలు అతనికి అందుబాటులోకి వచ్చాయి. అంతేగాక, అతను దక్షిణ కొరియా, క్రొయేషియా, యూఏఈ, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, పెరూ వంటి దేశాలలో విదేశీ ఆటగాళ్లతో పోటీపడే అవకాశాల నుండి మంచి ప్రయోజనం పొందారు. ఈ సమగ్ర మద్దతు వ్యవస్థ మనీష్ అత్యున్నత స్థాయి శిక్షణకు, ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తులతో పోటీ పడేందుకు వీలు కల్పించింది.
పారిస్ 2024 పారాలింపిక్స్ లో విజయం: చిరస్మరణీయ రజతం
పారిస్ 2024 పారాలింపిక్స్ లో P1 - పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలవడం ద్వారా మనీష్ నర్వాల్ మరోసారి తన అసాధారణ ప్రతిభను, సంకల్పాన్ని చాటారు. ప్రపంచంలోని అత్యుత్తమ పారా-షూటర్‌లతో పోటీ పడుతున్న మనీష్ తన పూర్తిస్థాయి ఖచ్చితత్వం, ఏకాగ్రతను కనబరిచి రజతం సాధించాడు. తద్వారా తన కెరీర్‌లో మరో అద్భుత విజయాన్ని నమోదు చేశాడు.
పారా-క్రీడలలో అత్యున్నత వేదికపై అత్యంత ఒత్తిడిలో మనీష్ సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. హర్యానాలోని స్థానిక షూటింగ్ రేంజ్ నుండి పారిస్‌లోని పారాలింపిక్ పోడియం వరకు అతని ప్రయాణం, తన నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనం. అతని కోచ్‌లు, కుటుంబం, ప్రభుత్వం ద్వారా అతనికి లభించిన మద్దతు కూడా ఈ విజయాల్లో ముఖ్య భూమికను పోషించింది.
స్ఫూర్తిదాయక వారసత్వం
దేశం ఆశలు, కలలను మోస్తూ, పారా-షూటింగ్‌లో మనీష్ అద్భుత విజయాలను సాధిస్తున్నాడు. అతని విజయాలు భారతదేశానికి గర్వకారణం. పట్టుదల, అంకితభావం ద్వారా ఏదైనా సాధించవచ్చనే దానికి మనీష్ అత్యుత్తమ ఉదాహరణ. ఈ అద్భుతమైన అథ్లెట్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంది, అతను చరిత్ర సృష్టిస్తుంటే, నిస్సందేహంగా ప్రపంచమంతా చూస్తుంది.
***
(Release ID: 2051123)
Visitor Counter : 61