బొగ్గు మంత్రిత్వ శాఖ
వికసిత భారత్-2047 దిశగా బొగ్గు తరలింపు మౌలిక సదుపాయాల కల్పనను వేగిరం చేస్తున్న మంత్రిత్వ శాఖ
Posted On:
29 AUG 2024 4:17PM by PIB Hyderabad
దేశంలో బొగ్గు రంగాన్ని పరివర్తనాత్మకం చేసే అవిరళ కృషిలో భాగంగా బొగ్గు మంత్రిత్వశాఖ ఒక సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనికి అనుగుణంగా కీలక భాగస్వాముల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనను వేగిరపరచడంలో సమన్వయం చేస్తోంది. దేశాన్ని 2047నాటికి ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దే సంకల్పానికి అనుగుణంగా సుస్థిర బొగ్గు ఉత్పత్తి-రవాణా సదుపాయాల రీత్యా భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలపడంలో ఈ కృషి మూలస్తంభం కానుంది.
దేశ ఇంధన భద్రత పెంపుసహా విద్యుదుత్పాదన కేంద్రాలు/పరిశ్రమల డిమాండ్ తీర్చడం, సుస్థిర-విశ్వసనీయమైన బొగ్గు సరఫరాకు భరోసా ఇవ్వడంలో బలమైన బొగ్గు తరలింపు నెట్‌వర్క్ కీలకం. ఈ లక్ష్య సాధనలో ప్రధాన పాత్రగల రవాణా ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారిస్తూ బొగ్గు మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసింది. ‘పిఎం గతిశక్తి’ కింద ‘‘సమీకృత ప్రణాళిక-సంలీన సమయ నిర్దేశిత అమలు’’ దృక్కోణానికి అనుగుణంగా రూపొందిన ఈ ప్రణాళిక ప్రతిష్ఠాత్మక ‘వికసిత భారత్-2047’ సంకల్ప సాకారంలో కీలకంగా నిలుస్తుంది.
ఈ వ్యూహంలో భాగంగా బొగ్గు రవాణా ప్రణాళిక కింద 38 ప్రాధాన్య రైల్వే ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీటన్నిటినీ రైల్వే మంత్రిత్వ శాఖతో సన్నిహిత సమన్వయం ద్వారా వేగంగా పూర్తి చేయనుంది. రైలు మార్గాల అనుసంధానం మెరుగుదల, సకాలంలో బొగ్గు సరఫరాకు భరోసా, రవాణా వ్యయం తగ్గింపు సహా దేశవ్యాప్త బొగ్గు రవాణా సామర్థ్యం పెంచడంలో ఈ ప్రాజెక్టులు అత్యావశ్యకాలు.
ఈ మేరకు ప్రభుత్వం ఇటీవలే ఆమోదించిన వాటిలో ఒడిశాలోని రెండు... ‘‘సర్దేగా-భలుముడ డబుల్ లైన్, బార్‌గఢ్ రోడ్-నవాపడా రోడ్ సింగిల్ లైన్’’ ప్రాజెక్టులున్నాయి. వీటిలో మొదటిది (సర్దేగా-భలుముడ)... 37.24 కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతుంది. ఈ మార్గం ‘ఐబి వ్యాలీ, మాండ్- రాయ్‌గఢ్ బొగ్గు గనుల పరిధిలోని వివిధ క్షేత్రాలగుండా వెళ్తుంది. తద్వారా మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్) సహా అనేక ప్రైవేట్ సంస్థలు నిర్వహించే గనుల నుంచి బొగ్గు తరలింపు సులభమవుతుంది. ఇది సర్దేగా నుంచి ఉత్తర భారతంలోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో దూరాన్ని గణనీయంగా తగ్గించి, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది.
***
(Release ID: 2049928)
Visitor Counter : 81