రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘ప్రాజెక్ట్ సీబర్డ్’ కు డైరెక్టర్ జనరల్ గా వైస్ అడ్మిరల్ రాజేష్ ధన్ ఖడ్ పదవీ బాధ్యతల స్వీకారం

Posted On: 28 AUG 2024 3:02PM by PIB Hyderabad

‘ప్రాజెక్ట్ సీబర్డ్’కు డైరెక్టర్ జనరల్ గా వైస్ అడ్మిరల్ రాజేష్ ధన్ ఖడ్ ఎన్ఎమ్ ఈ రోజు పదవీ బాధ్యతలను చేపట్టారు.  వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి నుంచి ఈ పదవీ బాధ్యతలను వైస్ అడ్మిరల్  రాజేష్ ధన్ ఖడ్ ఎన్ఎమ్ స్వీకరించారు.  ప్రస్తుతం కార్వార్ నౌకాదళ స్థావరంలో పురోగమిస్తున్న అతి పెద్దదైన రక్షణ రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు పనులను పర్యవేక్షించవలసిన అధికారాలను వైస్ అడ్మిరల్  రాజేష్ ధన్ ఖడ్ కు ఇచ్చారు.  న్యూ ఢిల్లీలో గల ప్రాజెక్ట్ సీబర్డ్ ప్రధాన కేంద్రంలో ఈ పదవీ బాధ్యతల అప్పగింత కార్యక్రమం జరిగింది.  భారతీయ నౌకాదళంలో 1990 జులై 1న నియమితులైన రాజేష్ ధన్ ఖడ్ నేవిగేషన్, డైరెక్షన్ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో అందె వేసిన చేయి.

ఈ నౌకా దళాధిపతి రాజేష్ ధన్ ఖడ్ ప్రతిష్టాత్మక నేవల్ అకాడమి, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ ల పూర్వ విద్యార్థుల్లో ఒకరు;  ఈయన జపాన్ లో హయ్యర్ కమాండ్ కోర్స్ ను పూర్తి చేశారు.  తన 34 సంవత్సరాల సుదీర్ఘ  వృత్తి జీవనంలో రాజేష్ ధన్ ఖడ్ పాండిచ్చేరి, గోదావరి, కోరా, మైసూరు యుద్ధ నౌకలలో విశిష్ట పదవులను నిర్వహించారు.  ఈ అధికారి ఇదివరకు ప్రాజెక్టు 15 శిక్షణ బృందంలోను, నేవిగేషన్  & డైరెక్షన్ స్కూల్ లోను, సింగపూర్ లోని ఎమ్ఐడిఎస్ వింగ్ ఆఫీసర్స్ కేడెట్ స్కూల్ లోను బోధన విధులను కూడా నిర్వహించారు.

ఈయనకు లభించిన కమాండ్ అపాయింట్‌మెంట్స్ లో ఐఎన్ఎస్ ఢిల్లీ లో కార్యనిర్వహణ అధికారి పదవితో పాటు ఐఎన్ఎస్ ఘడియాల్, ముంబయి, విక్రమాదిత్య లలో కమాండింగ్ ఆఫీసర్ గా అప్పగించిన బాధ్యతలు ఉన్నాయి.  ఈయన చెప్పుకోదగ్గ స్టాఫ్ నియామకాలలో డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ప్లాన్స్ లో జాయింట్ డైరెక్టర్, డైరెక్టర్ పదవులు;  డైరెక్టరేట్ ఆఫ్ పర్సనెల్ లో ప్రిన్సిపల్ డైరెక్టర్/కమోడోర్ (సిబ్బంది) ఉన్నాయి.  నౌకా దళాధిపతి హోదాలో ఈయన చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ట్రైనింగ్) గాను , కమాండెంట్ నేవల్ వార్ కాలేజీలో ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రైనింగ్ గాను,తూర్పు నౌకాదళంలో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ గాను కర్తవ్య పాలన నిర్వహించారు.  ఈయన అదనంగా ఐఎన్ఎస్ విక్రాంత్ కు చెందిన యాక్సెప్‌టెన్స్ ట్రయల్స్ ను పర్యవేక్షించడానికి నియమించిన కేరియర్ యాక్సెప్‌టెన్స్ ట్రయల్స్ కు చైర్ మన్ గా కూడా వ్యవహరించారు.

యెమన్ లోని అదన్, అల్-హుదైదా ప్రాంతాల నుంచి భారత జాతీయులను పోరాట రహిత ప్రాతిపదికన చేపట్టిన తరలింపు కార్యకలాపాల (నాన్-కంబేటెంట్ ఇవేక్యుయేషన్ ఆపరేషన్స్.. ఎన్ఇఒ) లో ఈయన  ప్రశంసనీయ సేవలను అందించి, 2015లో నవో సేన పతకం (శౌర్య పతకం) అందుకొన్నారు.

ఫ్లీట్ కమాండర్ గా ఈయన గత పది నెలలల్లో  విధులను నిర్వర్తించారు. ఆ పదవీకాలంలో తూర్పు నౌకాదళం ఉన్నతస్థాయి పోరాట సన్నద్ధతను, విన్యాసాల జోరును నిలబెట్టుకొంది; వాటిలో భాగంగా అనేక సాహస కార్యాల ప్రదర్శన విన్యాసాలు, నిర్దిష్ట కార్యక్షేత్రాల్లో మోహరింపు, మిత్రదేశాల నౌకాదళాలతో కలసి ‘మిలన్ 24’ (MILAN 24) లో పాలుపంచుకోవడం సహా అనేక ద్వైపాక్షిక, బహుపాక్షిక కార్యకలాపాలు భాగంగా ఉన్నాయి.

 

***


(Release ID: 2049422) Visitor Counter : 73


Read this release in: English , Urdu , Hindi , Tamil