పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

భారత్‌లో సీప్లేన్ ఆపరేషన్స్ మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి


ఉడాన్ 5.4 వెర్షన్‌ను ఆవిష్కరించిన శ్రీ రామ్మోహన్ నాయుడు



దేశంలో సీప్లేన్ కార్యకలాపాల అభివృద్ధికి నదులు, సరస్సుల విస్తృతమైన నెట్‌వర్క్ ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తాయి - కేంద్రమంత్రి

Posted On: 22 AUG 2024 8:06PM by PIB Hyderabad

భారతదేశంలో సీప్లేన్ ఆపరేషన్స్ మార్గదర్శకాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నేడు న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఇండియన్ ఏవియేషన్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, ఈ మార్గదర్శకాలు సీప్లేన్ కార్యకలాపాలను దేశంలోని విమానయాన రంగంలో రవాణా కోసం అనుసంధానించడమే కాకుండా, ఉపాధి కల్పన, ఆర్థిక సాధికారతను పెంపొందిస్తాయని అన్నారు. సీప్లేన్లను ఏర్పాటు చేయడం దేశ వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిపై నిబద్ధతకు చిహ్నం అని మంత్రి అన్నారు.

ఇదే సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉడాన్ 5.4 పథకాన్ని కూడా ఆవిష్కరించారు.  ఉడాన్ 5.4 కింద ఏదో ఒక కారణంతో రద్దయిన మార్గాలకు, కొత్త మార్గాలకు టెండర్లు పిలవనున్నారు. డిహావిల్యాండ్ కంపెనీ తయారు చేసిన సీప్లేన్ విమానాల ప్రదర్శన త్వరలో జరుగుతుందని మంత్రి ప్రకటించారు.

భారతదేశంలో 7,517 కి.మీ పొడవైన సముద్రతీరం, నదులు, సరస్సుల విస్తృత నెట్‌వర్క్ దేశంలో సీప్లేన్ కార్యకలాపాల అభివృద్ధికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని కేంద్రమంత్రి అన్నారు. పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, హెలికాప్టర్ ఆపరేషన్ల అనుభవాన్ని గ్రహించి, సీప్లేన్ కార్యకలాపాల వృద్ధిని నిర్ధారించడానికి ప్రభుత్వం సరళమైన, ఆచరణాత్మకమైన విధానాన్ని చేపట్టనుంది. నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ (ఎన్ఎస్ఓపీ) కింద ఆర్సీఎస్ ద్వారా సీప్లేన్ ఆపరేషన్లను ప్రారంభించేందుకు ఈ మార్గదర్శకాలు వీలు కల్పిస్తాయి.  ఆర్సిఎస్ కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్)ను సీప్లేన్ కార్యకలాపాలకు వర్తింపచేయడం ఆపరేటర్లకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దీనితో పాటు సీప్లేన్ కార్యకలాపాల భద్రత, రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

వాటర్ ఏరో డ్రోమ్‌ల అభివృద్ధిలో ప్రారంభ సవాళ్లు ఉన్నప్పటికీ, సీప్లేన్ కార్యకలాపాలు నిరంతరం వృద్ధి చెందడానికి ప్రభుత్వం సరళమైన, ఆచరణాత్మక విధానాన్ని తీసుకుందని మంత్రి తెలియజేశారు. ఆర్సీఎస్ పథకం కింద హెలికాప్టర్లు, చిన్న విమానాల కోసం ఎన్ఎస్ఓపీ ఆపరేషన్ల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పుడు సమగ్ర సీప్లేన్ ఎన్ఎస్ఓపీ మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. ఈ మార్గదర్శకాలు కార్యకలాపాల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తాయి. అలాగే ఇందులోని వాటాదారుల బాధ్యతలను కూడా నిర్వచిస్తాయి. దేశవ్యాప్తంగా నిరంతరాయ, సమర్థవంతమైన సీప్లేన్ ఆపరేషన్‌ను నిర్ధారిస్తాయి. సీప్లేన్ల కోసం నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ (ఎన్ఎస్ఓపి) ఫ్రేమ్ వర్క్ ను స్వీకరించడంలోనూ, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడంలోనూ ప్రభుత్వ నిబద్ధతలో ఒక ముఖ్యమైన ముందడుగు.

భారతదేశంలో సీప్లేన్ పరిశ్రమకు అనుకూల విధాన అవసరాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ సీప్లేన్ల వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులపై ఐరాస ఫ్రేమ్‌వర్క్ కింద భారతదేశ కట్టుబాట్లకు అనుగుణంగా ఉండాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. దీని కోసం రూపొందించే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ స్థానిక శ్రామిక శక్తి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, పైలట్లు, నిర్వహణ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బందికి ఉపాధి అవకాశాలను సృష్టించే విధంగా ఉండాలన్నారు. సృజనాత్మకతను ప్రోత్సహించే, వృద్ధిని ప్రోత్సహించే విధానాలను తయారు చేయడం కేంద్రం లక్ష్యమని తెలిపారు. సీప్లేన్లు, ఇతర రవాణా విధానాల మధ్య అంతరాయం లేని అనుసంధానత కోసం మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ హబ్ లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి, సహకార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా, పర్యాటకాభివృద్ధికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, భారతదేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలను దగ్గర చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్తగా రూపొందించే మార్గదర్శకాలు సీప్లేన్ కార్యకలాపాలను సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక మంచి విధానాన్ని సూచిస్తాయి, ఇది భారతదేశ విమానయాన రంగంలో కొత్త శకంగా చెప్పవచ్చు అని ఆయన తెలపారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ వుమ్లున్‌మాంగ్ వుల్నామ్ మాట్లాడుతూ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ క్రియాశీల వైఖరిని అవలంబించిందని తెలిపారు. సీప్లేన్ నిర్వహణ కోసం నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్ (ఎన్ఎస్ఓపీ) విధానాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది ఇప్పటికే ఆర్సిఎస్ పథకం కింద హెలికాప్టర్లు, చిన్న విమానాల విషయంలో విజయవంతమైందన్నారు. నేడు ప్రారంభిస్తున్న సీప్లేన్ ఎన్ఎస్ఓపి మార్గదర్శకాలు వాటర్ ఏరోడ్రోమ్ మౌలిక సదుపాయాల పూర్తి అభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పటికీ, సీప్లేన్ కార్యకలాపాలు కొనసాగించడానికి, నిర్మాణాత్మక, సురక్షితమైన విధానాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ విక్రమ్ దేవ్ దత్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాధికారులు, ఎన్ఎస్ఓపీ, ఎస్ఓపీ ఆపరేటర్లు, మొదటి దశ పరికరాల తయారీదారులు (ఓఈఎం), సీప్లేన్ తయారీదారులు, మీడియా సిబ్బంది పాల్గొన్నారు.

 

****



(Release ID: 2047965) Visitor Counter : 30


Read this release in: English , Urdu , Hindi , Tamil