శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రాబోయే పారిశ్రామిక విప్లవం జీవ-ఆర్థిక చోదితం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
2014 తర్వాత ప్రభుత్వ ప్రాథమ్యాలలో వినూత్న మార్పును
జీవ-సాంకేతిక రంగంలో పరివర్తన చాటుతుంది: 4వ బయో
ఇండియా-2024 సదస్సు ఆరంభ కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్య;
‘‘జీవ-ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలో 12వ స్థానం..
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 3వ స్థానంలో భారత్’’;
గత పదేళ్లలో రూ.75 వేల కోట్ల విలువను సాధించిన
జీవ-సాంకేతికరంగ కంపెనీలు: జీవ-సాంకేతిక విభాగం కార్యదర్శి
Posted On:
14 AUG 2024 4:17PM by PIB Hyderabad
‘‘రాబోయే పారిశ్రామిక విప్లవం జీవ-ఆర్ధికరంగ చోదితంగా ఉంటుంది’’ అని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూడిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంవద్ద నిర్వహించిన 4వ ప్రపంచ బయో ఇండియా-2024 సదస్సు ఆరంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లోగడ 1990 నాటి పారిశ్రామిక విప్లవం ‘ఐటీ’ చోదితం కాగా, 21వ శతాబ్దంలో రాబోయేది జీవ-ఆర్ధిక చోదిత విప్లవం కాగలదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ- ‘‘స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా’’ అంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోగడ పిలుపునివ్వడాన్ని కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. ఆ పిలుపే దేశంలోని శాస్త్ర-సాంకేతిక రంగాలు, ఆవిష్కరణల సంబంధిత అంకుర సంస్థల్లో సరికొత్త విప్లవానికి నాంది పలికిందని పేర్కొన్నారు. వీటిలో అధికశాతం సాగర/అంతరిక్ష/జీవ-ఆర్ధిక వ్యవస్థకు సంబంధించినవేనని చెప్పారు.
జీవ-సాంకేతిక శాస్త్ర విభాగం, దాని పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ‘బయో టెక్నాలజీ ఇండస్ట్రీ అసిస్టెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బిఐఆర్ఎసి-బిరాక్) భారీ అంతర్జాతీయ కార్యక్రమం ‘గ్లోబల్ బయో ఇండియా’. ఇది జాతీయ-అంతర్జాతీయ జీవ-సాంకేతిక రంగ భాగస్వాముల కోసం చేపట్టిన వ్యూహాత్మక కార్యక్రమం. అంతర్జాతీయంగా భారత జీవ-సాంకేతిక రంగ పురోగమనం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది.
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ 5వ మందిరం వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్ 12 నుంచి 14 వరకూ దేశంలోనే అత్యంత భారీ కార్యక్రమంగా ‘గ్లోబల్ బయో ఇండియా-2024’ సదస్సును నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా కేంద్రప్రభుత్వ విధానాల తోడ్పాటు, ప్రైవేట్ రంగంతో మిళితమైన నిరంతర మద్దతుతో ఇనుమడిస్తున్న భారత జీవ-ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను, వృద్ధి పథాన్ని ఆయా ఉన్నత స్థాయి వ్యాపార, సాంకేతిక ప్రతినిధుల బృందాలు తెలుసుకుంటాయి. జీవ-సాంకేతిక రంగానికి సంబంధించి ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ జాతీయ కార్యక్రమాలకు ‘గ్లోబల్ బయో ఇండియా’ సదస్సు మరింత ఊతమిస్తుందని అంచనా.
జీవ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాన్ని శ్రీ జితేంద్ర సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాత్కాలిక బడ్జెట్లో జీవ-ఆర్థిక, బయో-ఫౌండ్రీ అంశాలను పేర్కొనడాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ఏడాది కాబట్టి, బడ్జెట్లలో సాధారణంగా వీటి ప్రస్తావన ఉండదని చెప్పారు. ‘‘రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జాతిని, ఆర్ధిక రంగాన్ని శక్తిమంతం చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యం’’ అని ఆయన స్పష్టం చేశారు.
జీవ-సాంకేతిక శాస్త్ర ప్రభావాన్ని నొక్కి చెబుతూ- భారత జీవ-ఆర్ధిక వ్యవస్థ గత పదేళ్లలో 13 రెట్లు వృద్ధి చెందిందని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు 2014లో 10 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయి నుంచి 2024 నాటికి 130 బిలియన్లకుపైగా స్థాయికి జీవ-ఆర్థిక వ్యవస్థ వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ నవ్యావిష్కరణల సూచీలో (గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్)గల 132 ఆర్థిక వ్యవస్థలకుగాను 2015 నాటికి 81వ స్థానంలో ఉన్న భారత్ నేడు 40వ స్థానానికి దూసుకెళ్లిందని ఆయన వెల్లడించారు.
జీవ ఉత్పత్తుల తయారీపరంగా భారత్ ప్రపంచంలో 12వ స్థానంలో ఉండగా, ఆసియా పసిఫిక్ ప్రాంత స్థాయిలో 3వ స్థానంలో ఉండటాన్ని కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ సహాయ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించార. నవ్యావిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడంలో, జీవ-సాంకేతికరంగ ప్రగతిలో భాగస్వామ్యంగల కంపెనీలకు మద్దతివ్వడంలో జీవ-సాంకేతిక విభాగం, ‘బిరాక్’ కృషిని ఆయన ప్రశంసించారు. జీవ-ఆర్ధిక వ్యవస్థతోపాటు సంబంధిత సంస్థల్లో గణనీయమై వృద్ధి నమోదు కావడాన్ని మంత్రి గుర్తుచేశారు. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల మధ్య సహకారానికి తరుణం ఇదేననే వాస్తవాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తున్నదని పేర్కొన్నారు.
కోవిడ్-19 మహమ్మారి నాటి సంగతులను గుర్తుచేస్తూ- ఈ మహమ్మారి అశేష ప్రజానీకాన్ని సంక్షోభంలోకి నెట్టిందని డాక్టర్ సింగ్ గుర్తుచేశారు. అదే సమయంలో జీవ-సాంకేతిక శాస్త్ర ప్రాధాన్యాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందు తాను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘అనుసంధాన్ ఎన్ఆర్ఎఫ్’ బిల్లు ఆమోదం పొందడాన్ని గుర్తుచేశారు. దీనివల్ల శాస్త్ర-సాంకేతిక, నవ్యావిష్కరణల రంగంలో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని అంచనా వేశామన్నారు. దీనికి అనుగుణంగా ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతోపాటు పెట్టుబడులు కూడా పెరిగాయని డాక్టర్ సింగ్ వివరించారు. ఈ విధంగా విజ్ఞానం, ఆర్ధిక వనరుల సమ్మేళనంతో అత్యధిక లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అంకుర సంస్థలకు ప్రోత్సాహం కోసం ప్రారంభించిన సంపోషణ వ్యవస్థ ‘బయో-నెస్ట్’ ఈ ఆర్ధిక సంవత్సరం చివరికల్లా 120కిపైగా సంస్థలకు మద్దతునిస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు.
శాకాహార విబాగంలో ఆదరణ పొందుతున్న కొత్త శాస్త్ర-సాంకేతిక ఉత్పత్తులను ఈ సందర్భంగా మంత్రి ఉదాహరించారు. తద్వారా జీవ-సాంకేతిక రంగంలో అందుబాటులోకి రాగల గణనీయ ఉపాధి, వ్యాపార అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా ఔషధ, ఆహార తయారీ, వ్యవసాయ, వ్యాపార రంగాలపై జీవ-సాంకేతిక రంగం విశేష ప్రభావం చూపగలదని ఆయన వివరించారు.
పరిశ్రమల సత్వర అనుసంధానం ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూ- ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై అపోహలను ఇకనైనా విడనాడాలని డాక్టర్ జితేంద్ర సింగ్ హితవు పలికారు.
జీవ-సాంకేతిక విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే మాట్లాడుతూ- ఈ రంగంలోని కంపెనీల మూల విలువ గత పదేళ్లలో రూ.75 వేల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. జీవ-సాంకేతిక రంగం నవోదయ రంగాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ప్రస్తుతం 28 వేలకుపైగా ప్రతిపాదనలపై కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే దిశగా మూల్యాంకనం చేపట్టినట్లు తెలిపారు.
****
(Release ID: 2045524)
Visitor Counter : 112