బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు ఉత్ప‌త్తికి... ఆర్థిక వృద్ధికి ఉత్తేజ‌మిస్తూ 10 కీల‌క బొగ్గు గ‌నుల త‌వ్వ‌కపు హ‌క్కు ఉత్త‌ర్వులు జారీ

Posted On: 01 AUG 2024 5:59PM by PIB Hyderabad

   దేశంలో బొగ్గు ఉత్ప‌త్తితోపాటు ఆర్థిక వృద్ధికి ఊపునిచ్చే దిశ‌గా కేంద్ర బొగ్గు-గ‌నుల‌ శాఖ మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి ఇవాళ 10 కీల‌క గ‌నుల త‌వ్వ‌కానికి హ‌క్కు ఉత్త‌ర్వులు అంద‌జేశారు. ఈ గ‌నుల‌లో త‌వ్వ‌కానికి సిద్ధంగా ఉన్న ఒక గ‌నితోపాటు మ‌రో 9 పాక్షిక అన్వేష‌ణ పూర్త‌యిన గ‌నులున్నాయి. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంధ‌న భద్రత మెరుగుద‌ల‌, ఆర్థిక వృద్ధి ల‌క్ష్యంగా ఈ గ‌నుల త‌వ్వ‌కానికి కేంద్ర  ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.


   ఆయా రాష్ట్రాల‌తోపాటు దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక వృద్ధికి కూడా ఈ గ‌నులు దోహ‌దం చేయ‌గ‌ల‌వు. ఈ ప‌ది గ‌నుల‌లో 2395 మిలియ‌న్ ట‌న్నుల మేర గ‌ణ‌నీయ స్థాయిలో  బొగ్గు నిల్వలున్న నేప‌థ్యంలో సుస్థిర‌ బొగ్గు ఉత్పత్తికి ఇవి బలమైన పునాది కాగ‌ల‌వు. ఈ గనుల ద్వారా 1,352 మందికి ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉపాధి ల‌భించ‌డమేగాక ఏటా రూ.166.36 కోట్ల రాబ‌డితోపాటు రూ.150 కోట్ల దాకా మూల‌ధ‌న పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉంటుందని అంచ‌నా.
    ఈ సంద‌ర్భంగా శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రధాన ప్రసంగం చేస్తూ- బొగ్గు ఉత్ప‌త్తి పెంపు, దిగుమ‌తుల త‌గ్గింపుపై దృష్టి సారించాల‌ని గ‌నుల త‌వ్వ‌కపు అనుమ‌తి ఉత్త‌ర్వులు పొందిన సంస్థ‌ల‌కు సూచించారు. అదే స‌మ‌యంలో  పర్యావరణ సుస్థిర‌త‌, బాధ్య‌తాయుత భూ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయ‌న నొక్కిచెప్పారు.  పచ్చదనం పెంపు, కఠిన భద్రత ప్రమాణాల అనుస‌ర‌ణ స‌హా ఆరోగ్య పరిరక్షణ, తాగునీరు, విద్య వంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు చేయూత ద్వారా స్థానిక సమాజాల సంక్షేమానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. బలమైన ప్రజాసంబంధాలు ఏర్ప‌ర‌చుకోవ‌డంతోపాటు సమర్థ పర్యావరణ పరిరక్షణ ప‌ద్ధ‌తులు అనుస‌రిస్తూ బొగ్గు రంగం దీర్ఘ‌కాలిక విజ‌యానికి భ‌రోసా ఇవ్వాల్సిందిగా కోరారు.

 


   అనంత‌రం బొగ్గు మంత్రిత్వ‌శాఖ స‌హాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్ల‌డుతూ-  ఈ రంగంలో నైతికత, వివేచ‌న‌ల అవసరాన్ని నొక్కిచెప్పారు. అంతేకాకుండా గ‌నుల త‌వ్వ‌కంలో సుస్థిర ప‌ద్ధ‌తుల అనుస‌ర‌ణ‌తోపాటు బొగ్గు గనులు ప‌రిస‌రాల్లో నివసించే స్థానికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
   బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా త‌న ప్ర‌సంగంలో విజయవంతమైన బిడ్డర్లను  అభినందించారు. బొగ్గు క్షేత్రాల కార్య‌క‌లాపాల్లో వేగం పెంచాలని, ఈ దిశ‌గా అందరికీ తమశాఖ నుంచి సంపూర్ణ మద్దతు ల‌భిస్తుంద‌ని హామీ ఇచ్చారు. త‌మ కార్య‌క‌లాపాల్లో పర్యావరణప‌ట్ల‌ బాధ్యత, సుస్థిర పద్దతులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే జీవావ‌ర‌ణంపై దుష్ప్ర‌భావం తగ్గించేలా వినూత్న మార్గాలను అనుస‌రిస్తూ  బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కూడా చెప్పారు.
   బొగ్గు రంగంలో స్వావ‌లంబ‌న‌, దిగుమ‌తి ప‌రాధీన‌త‌ త‌గ్గింపు, దేశ ఇంధ‌న అవ‌స‌రాలు తీర్చ‌గ‌ల స్థాయితో నిరంత‌ర బొగ్గు స‌ర‌ఫ‌రాపై ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణంగా ఈ హ‌క్కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.  
ఈ గనులు త‌వ్వ‌కం ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తోడ్పడడమేగాక మౌలిక సదుపాయాల వృద్ధి, సామాజిక సంక్షేమానికీ మద్దతిస్తుంది.
   సుస్థిర, పర్యావరణంప‌ట్ల‌ బాధ్యతగల త‌వ్వ‌క‌పు పద్ధతుల అమలుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది. ఇంధ‌న భ‌ద్ర‌త‌కు భ‌రోసా, క‌ర్బ‌న ఉద్గారాల త‌గ్గింపు, సుస్థిర ప్ర‌గ‌తికి ప్రోత్సాహం వంటి విస్తృత ల‌క్ష్యాల సాధ‌న‌కు ఈ క‌షి దోహ‌దం చేస్తుంది. స‌హ‌జ వనరుల బాధ్యతాయుత వినియోగం ద్వారా ఇంధ‌న భ‌ద్ర‌త‌లో స్వ‌యం స‌మృద్ధ భార‌తం (ఆత్మనిర్భర్ భారత్) ల‌క్ష్యానికి తోడ్ప‌డుతూ దేశ ప్రగతిపథంలో  భాగస్వామి కావడమే బొగ్గు మంత్రిత్వ శాఖ ధ్యేయం.

 

***



(Release ID: 2040630) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP