శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రతిష్టాత్మకమైన “జీవిత సాఫల్య పురస్కారం” అందుకున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.


దేశ, విదేశాలకు చెందిన వైద్యరంగ ప్రముఖులు, నిపుణులు, మెడికోల అంతర్జాతీయ సమావేశం సందర్భంగా చెన్నైలో జరిగిన వేడుకలు.

Posted On: 28 JUL 2024 3:31PM by PIB Hyderabad

దేశ, దేశాలకు చెందిన వైద్యరంగ ప్రముఖులు, నిపుణులు, మెడికోల అంతర్జాతీయ సమావేశ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో, డయాబెటాలజీ, మధుమేహ సంరక్షణ, మధుమేహ పరిశోధనల పురోగతిలో తన ఆదర్శప్రాయమైన అంకితభావంతో దేశ, విదేశాలలో గుర్తింపు పొందిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిష్టాత్మక “జీవిత సాఫల్య పురస్కారం” అందుకున్నారు.

చెన్నైలోని డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్, మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌ల చైర్మన్ డాక్టర్ వి. మోహన్ ప్రశంసాపత్రాన్ని చదువుతూ, డాక్టర్ జితేంద్ర సింగ్‌ కింది స్థాయి నుండి కష్టపడి క్రమంగా డయాబెటాలజీలో అధ్యాపక ఆచార్యులు, పరిశోధకులు మరియు ప్రాక్టీషనర్‌గా పేరు గడించి తన రాష్టానికి, దేశానికి సైతం గొప్ప పేరు తెచ్చారన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. సి. రాయ్ లాగా, డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన అతి తక్కువమంది వైద్య నిపుణులలో ఒకరు, అంతేగాక వారు విశేష జనాదరణతో వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికవడమే కాకుండా కేంద్ర మంత్రి మండలిలో వరుసగా మూడు పర్యాయాలు బెర్త్‌ దక్కించుకున్న దేశంలోని అతి కొద్ది మందిలో అలాగే జమ్మూ & కాశ్మీర్‌ నుండి ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా ఘనత సాధించారు. తన నిజాయితీ, నిష్కళంకమైన వ్యక్తిత్వంతో పేరుగాంచిన డాక్టర్ జితేంద్ర సింగ్ మూడు పర్యాయాలలో తనతో కలిసి పనిచేసిన సహచరుల గౌరవాభిమానాలను పొందారు అని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.

డయాబెటాలజిస్టుల అతిపెద్ద విద్యాసంబంధ సంఘం అయిన ఆర్‌.ఎస్‌.ఎస్‌.డి.ఐ. (భారతదేశంలో మధుమేహం అధ్యయనం కోసం గల పరిశోధనా సంస్థ) యొక్క జీవిత సాఫల్య పురస్కారం ద్వారా డాక్టర్ జితేంద్ర సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించినట్లు ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా చదివి వినిపించిన ప్రశంసా పత్రంలో డాక్టర్ జితేంద్ర సింగ్‌ను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అద్భుతమైన విద్యావేత్తగా, పరిశోధకునిగా, వైద్య అధ్యాపకునిగా, రచయితగా అభివర్ణించారు. గతంలో ఆయన అందుకున్న అవార్డులలో  పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (జిప్‌మర్) అందించిన "గోల్డ్ మెడల్ ఫర్ ఒరేషన్" అలాగే జర్నలిజం రంగంలో ప్రతిష్టాత్మకమైన "జమ్నా దేవి గియాన్ దేవి అవార్డు" సహా పలు అవార్డులు ఉన్నాయి.

డయాబెటీస్‌కు సంబంధించిన వివిధ అంశాలపై డాక్టర్ జితేంద్ర సింగ్‌ ఎనిమిది పుస్తకాలు, మూడు మోనోగ్రామ్‌లను రచించినట్లు ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. వైద్యశాస్త్రం యొక్క ప్రముఖ పాఠ్యపుస్తకాలలో ఆయన మధుమేహంపై వ్రాసిన అధ్యాయాలు చేర్చబడినవి, మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ప్రతిష్టాత్మక "ఏ.పీ.ఐ. టెక్స్ట్‌బుక్ ఆఫ్ మెడిసిన్" యొక్క పన్నెండు వరుస సంచికలలో డయాబెటిస్‌పై ఆయన ఒక అధ్యాయాన్ని వ్రాశారు. డయాబెటిస్ పట్ల అవగాహన గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వ్రాసిన పుస్తకాలలో ఒకటి అయిన "డయాబెటిస్ మేడ్ ఈజీ" న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ప్రపంచ పుస్తక ప్రదర్శనలో బెస్ట్ సెల్లర్ విభాగంలో స్థానం సంపాదించిన విషయాలను ప్రస్తావించారు.

"స్ట్రెస్ డయాబెటిస్ ఇన్ కశ్మీరీ మైగ్రాంట్స్" గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వ్రాసిన మార్గదర్శకమైన రచన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ.) ప్రశంసలను అందుకుంది. "గర్భధారణలో మధుమేహం నిర్వహణ కోసం మార్గదర్శకాలు" ఖరారు చేసిన డి.ఐ.పి.ఎస్.వై పరిశోధనా బృందంలో ఆయన సభ్యులుగా ఉన్నారు అలాగే ఈ మార్గదర్శకాలు రిఫెరల్ కోసం డబ్ల్యు.హెచ్.ఓ. ఆమోదం పొందినవి. వైద్యశాస్త్ర, డయాబెటిస్ అధ్యాపకులుగా డాక్టర్ జితేంద్ర సింగ్ దాదాపు రెండు డజన్ల మంది పరిశోధన విధ్యార్థులకు గైడ్‌గా మార్గదర్శనం చేశారు.

పార్లమెంటేరియన్‌గా, భారత ప్రభుత్వంలో మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ సేవలను కూడా ఈ ప్రశంసాపత్రంలో ప్రస్తావించారు అలాగే పార్లమెంట్‌లో అతని అద్భుతమైన చర్చలు, ప్రజెంటేషన్‌లను కూడా ప్రశంసించారు. భారత ప్రభుత్వంలో తన ఆధ్వర్యంలోని అనేక విభాగాలు, మంత్రిత్వ శాఖలను డాక్టర్ జితేంద్ర సింగ్ అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఆయన కృషి, గొప్ప దృక్పథం, అణకువగా ఉండే వ్యక్తిత్వంతో సమాజంలోని అన్ని వర్గాల మెప్పు పొందినట్లు ప్రశంసాపత్రం పేర్కొంది. ఆయన యొక్క నిరాడంబరమైన స్వభావం, ఆచరణాత్మక, మానవీయ విధానం, మాటల్లో అలాగే చేతలలో, డాక్టర్ జితేంద్ర సింగ్‌ను భారతదేశం యొక్క "నిజమైన బిడ్డ"గా మార్చినట్లు అభివర్ణించారు.

ప్రశంసాపత్రాన్ని చదవడం పూర్తయిన వెంటనే, డాక్టర్ జితేంద్ర సింగ్‌కు “జీవిత సాఫల్య పురస్కార” బంగారు పతకాన్ని అందిస్తుండగా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రేక్షకులందరూ ఆయన పట్ల గౌరవ సూచకంగా నిలబడి కొన్ని నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ తమ గౌరవాన్ని వ్యక్తపరిచారు. డాక్టర్ జితేంద్ర సింగ్ విద్యాభ్యాసం చెన్నైలో జరిగిందని అలాగే ఆయన ప్రతిష్టాత్మక స్టాన్లీ వైద్య కళాశాల పూర్వ విద్యార్ధి అని కార్యక్రమ నిర్వాహకులు ప్రకటిస్తున్న సమయంలోనూ ప్రేక్షకులు ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

తనకోసం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ప్రశంసలందిస్తున్న ప్రేక్షకుల స్పందనకు తల వంచి నమస్కరించి, ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్, అవార్డును స్వీకరించిన సందర్భంగా “అంగీకార ప్రసంగం” చేస్తూ, ఈ అవార్డు తనకు చాలా పెద్దదని, తన మనసు ఆదేశం మేరకు అత్యంత నిరాడంబరత, వినయంతో మాత్రమే దీనిని స్వీకరించగలనని చెప్పారు. దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణంలో దేశంలోని అత్యున్నత వైద్య నిపుణుల మార్గదర్శనంలో ఎదగడం, ప్రముఖు వైద్యులైన ఎందరో సీనియర్స్, సహోద్యోగుల సహచర్యం పొందడం దైవానుగ్రహమేనని అన్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, తన సహచరుల ఉన్నతమైన అంచనాలకు అనుగుణంగా జీవించడానికి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తానని అలాగే తనకు లభించిన ఈ పురస్కారానికి అర్హుడినని నిరూపించుకుంటానని అన్నారు.

***



(Release ID: 2038178) Visitor Counter : 74