కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

విజయవంతంగా ముగిసిన సంగం-డిజిటల్ కవలలు ఇనిషియేటివ్ కింద నిర్వహించిన నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు


విభిన్న డేటా వనరులను ఉపయోగించి డిజిటల్ కవలలు-ఎనేబుల్డ్ పరిష్కారాల కోసం సమగ్ర బ్లూప్రింట్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన కార్యక్రమాలు

ఆచరణీయమైన ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌లు, అమలు చేసేందుకు కావాల్సిన వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌లను అందించిన కార్యక్రమాలు

ఆకాంక్షిత బ్లాక్‌లపై ప్రత్యేక దృష్టితో పాటు రవాణా.. పర్యావరణ నాణ్యత మదింపు, దాని ప్రభావం..ఆరోగ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ వంటి వాటిపై దృష్టి కేంద్రీకృతం

Posted On: 12 JUL 2024 6:23PM by PIB Hyderabad

సంగం-డిజిటల్ కవలలు కార్యక్రమం కింద టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) చేపట్టిన నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. 2024 జూలై 10-11 తేదీల్లో హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జరిగిన తుది కార్యక్రమంలో అధునాతన డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రణాళికలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన ఆకర్షణీయమైన, ఉత్పాదక సెషన్లు జరిగాయి.

ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబయి,బెంగళూరు పీఈఎస్ విశ్వవిద్యాలయం, టీ-హబ్ హైదరాబాద్ వంటి నాలుగు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో నిర్వహించిన ఈ సంగం నెట్వర్కింగ్ కార్యక్రమాల్లో ప్రముఖ కంపెనీలు, విద్యావేత్తలు, ప్రభుత్వ రంగాలకు చెందినవారు 400కు పైగా పాల్గొన్నారు. విభిన్న డేటా వనరులను ఉపయోగించడం ద్వారా వివిధ సవాళ్లను పరిష్కరించే డిజిటల్ కవలలు-ఎనేబుల్డ్ పరిష్కారాల కోసం సమగ్ర బ్లూప్రింట్లను అభివృద్ధి చేయడంపై ఈ కార్యక్రమాలు దృష్టి సారించాయి.

ప్రతి కార్యక్రమంలో గౌరవనీయ వక్తలు లోతైన అంశాలతో కూడిన కీలక ప్రసంగాలు చేశారు. వాస్తవ ప్రాపంచిక సమస్యలను పరిష్కరించడానికి డేటాను ఉపయోగించే ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు. 

 

టెలీకమ్యూనికేషన్స్ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ మాట్లాడుతూ, "ఆచరణీయమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, నిధులను పొందడం, జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రణాళిక సాధనాన్ని తయారు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వాటిని ప్రభుత్వానికి సమర్పించడం లక్ష్యం" అని అన్నారు.
 

తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ హైదరాబాద్‌లో జరిగిన తుది కార్యక్రమంలో పాల్గొన్నారు.  డిజిటల్ ట్విన్‌లను నిర్మించేందుకు పరిశ్రమ సహకారానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

 

“ఈ కార్యక్రమాలు పాల్గొనేవారి మధ్య గణనీయమైన సహకారాన్ని ప్రారంభించాయి, కొత్త ఆలోచనలు, జ్ఞానం, సామర్థ్యాలను పెంపొందించాయి. ఆచరణీయమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం, వాటికి నిధులు పొందడం, జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల ప్రణాళిక సాధనాన్ని సృష్టించే సాధ్యాసాధ్యాలను ప్రదర్శించడం మన లక్ష్యం” అని టెలికాం శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నీరజ్ వర్మ అన్నారు.

బ్రేక్ అవుట్ సెషన్‌లు

 

ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ, మల్టీమోడల్ ప్రజా రవాణా ఆప్టిమైజేషన్, సమగ్ర రవాణా ప్రణాళిక, ట్రాఫిక్ ఉద్గారాల నిర్వహణ, నీటి పంపిణీ నెట్‌వర్క్‌లు, విపత్తు నిర్వహణ.. ఆరోగ్యం, పోషకాహారం, విద్యపై దృష్టి సారించే ఆకాంక్షిత బ్లాక్‌లు వంటి కీలక విభాగాల గురించి ఈ సెషన్‌లు దృష్టి సారించాయి. 

 

వివిధ విభాగాల మధ్య సహకారం:
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా గోప్యతను పరిరక్షించే విషయంలో వివిధ వనరుల నుండి డేటాను ఏకీకృతం చేయటంపై సహకార చర్చలు జరిగాయి. గోప్యత మెరుగపరిచే సాంకేతిక పరిజ్ఞానాలు(పీఈటీ- ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్), డేటా ప్రొవైడర్, ఏఐ పరిపాలన  ఫ్రేమ్‌వర్క్.. వర్చువల్ ప్రపంచ సృష్టి, ఇంటరాక్షన్ సామర్థ్యాలు.. మ్యాథమెటికల్ మోడలింగ్, భౌతిక శాస్త్ర ఆధారిత సిమ్యులేషన్స్ వంటి వాటిపై చర్చ కార్యక్రమాలు  సమాంతరంగా జరిగాయి.

ఇన్నోవేటీవ్ పరిష్కారాలు, భవిష్యత్‌లో రోడ్‌మ్యాప్‌లు: ఆచరణీయమైన ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌లు, అమలు చేయడానికి వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌లను ఈ కార్యక్రమాలు అందించాయి. ఇక్కడ వచ్చిన ఫలితాలు.. భవిష్యత్తు పరిష్కారాల రూపకల్పన, నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తాయి, వివిధ భాగస్వాములు నిర్వహించాల్సిన పాత్రను నిర్వచిస్తాయి, సంభావ్య వినియోగదారులను గుర్తించటంతో పాటు నిధుల సేకరణ, పరిపాలనా యంత్రాంగాలను ఏర్పాటు చేస్తాయి.

 

అన్ని కార్యక్రమాలలో ఆకాంక్షిక బ్లాక్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆకాంక్షిత బ్లాక్‌లలో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, ఇతర అంశాలకు సంబంధించి ప్రధాన పనితీరు సూచికలను(కేపీఐ- కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) మెరుగుపరచడానికి పరిష్కారాలను కనుగొనడం, నమూనాలను తయారు చేయటంపై దృష్టి సారించారు.

ఇతర కీలక ఫలితాలు, దృష్టి కేంద్రీకృత అంశాలు: 

1. రవాణా: ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ, మల్టీ మోడల్ ప్రజా రవాణా ఆప్టిమైజేషన్, సమగ్ర రవాణా ప్రణాళిక‌పై దృష్టి సారించే డిజిటల్ ట్విన్స్ ద్వారా నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే పరిష్కారాలు.

2. పర్యావరణ నాణ్యత, దాని ప్రభావాన్ని అంచనా వేయడం: ట్రాఫిక్ ఉద్గారాల నిర్వహణ, నీటి పంపిణీ నెట్‌వర్క్‌లను ఆప్టిమైజ్ చేయడానికి కార్యక్రమాలు.

3. ఆరోగ్య సంరక్షణ: వివిధ ఆరోగ్య డిజిటల్ కవలలను నిర్వహించడానికి సంగం ఆరోగ్య కవలలు ప్లాట్‌ఫామ్ అభివృద్ధి. దీనిలో ఇవి ఉన్నాయి. 

- నిర్దిష్ట అవయవాలను మోడలింగ్ చేయడానికి ప్రత్యేక ఆరోగ్య డిజిటల్ కవలలు.

- ఆరోగ్య సంరక్షణ అందించే విషయంలో కవలలకు శిక్షణ.

- మౌలిక సదుపాయాలు, ఊహించదిగన నిర్వహణ కోసం మెడికల్ పరికరాల కవలలు.

- అంటువ్యాధుల నిర్వహణకు సామాజిక కవలలు.

4. విపత్తు నిర్వహణ: అధునాత డిజిటల్ సిమ్యులేషన్స్, డేటా ఇంటిగ్రేషన్ ద్వారా సమగ్ర రక్షణ ప్రణాళిక

హైదరాబాద్‌లో జరిగిన తుది కార్యక్రమంలో ఫలితాల(అవుట్ కమ్) డాక్యుమెంట్‌ను శ్రీ నీరజ్ వర్మ ఆవిష్కరించారు. మొత్తం నాలుగు నెట్‌వర్కింగ్ కార్యక్రమాల్లో విభిన్న భాగస్వాములు అభివృద్ధి చేసిన ఈ డాక్యుమెంట్ సంగం డిజిటల్ కవలల కార్యక్రమానికి సంబంధించి స్టేజ్ 2 విషయంలో ముందుకు వెళ్లే మార్గంపై దృష్టి పెడుతుంది. సంబంధిత భాగస్వాముల నుంచి అభిప్రాయాలను తీసుకోనుంది.

భవిష్యత్( ముందుకెళ్లే మార్గం):

 

ఈ నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు ఇచ్చిన ఊపుతో సంగం కార్యక్రమం కొనసాగనుంది. అభివృద్ధి చేసిన బ్లూప్రింట్‌లు, రోడ్‌మ్యాప్‌లను అమలు చేయడం, అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేలా పాలనా యంత్రాంగాలను సిద్ధం చేయటంపై దృష్టి సారించనున్నారు. ఆర్థిక, సామాజిక, పర్యావరణ సవాళ్లను పరిష్కరించే స్థిరమైన, సమర్థవంతమైన పరిష్కారాలను సృష్టించే అంతిమ లక్ష్యంతో జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళికలో అత్యాధునిక సాంకేతికతలు, డేటా-ఆధారిత పరిశీలనలను ఇంటిగ్రేట్ చేయడానికి సహకార ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు. 

 

ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భాగస్వాములందరికీ, కంపెనీలకు డీఓటీ కృతజ్ఞతలు తెలియజేసింది. డిజిటల్ పరిష్కారాలలో పరివర్తనాత్మక పురోగతికి సంబంధించి ఈ కార్యక్రమాలు ఒక వేదికను ఏర్పాటు చేశాయి.
 

మరింత సమాచారం కొరకు, దయచేసి https://sangam.sancharsaathi.gov.in/ వెబ్ సైట్‌లో వివరాలు చూడండి. 

సంగం గురించి:

 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమిష్టి మేధస్సును ఉపయోగించి మౌలిక సదుపాయాల ప్రణాళిక, రూపకల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సంగం లక్ష్యంగా పెట్టుకుంది. సుస్థిరమైన, సమర్థవంతమైన మౌలిక సదుపాయాల పరిష్కారాల కోసం సాంకేతిక పరిజ్ఞాన శక్తిని ఉపయోగించడానికి ఇది సహకార ప్రయత్నానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

 

నాలుగు నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు https://www.youtube.com/@DepartmentofTelecom/streams లో అందుబాటులో ఉన్నాయి. 

***



(Release ID: 2033047) Visitor Counter : 36