గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
జనపనార కళారూపాల ఆధారిత జీవనోపాధిని పెంచటానికి వెబినార్ నిర్వహించిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
జనపనార కళారూపాల పరిశ్రమ స్థితిగతులు, సవాళ్లు, అవకాశాలను చర్చించటానికి పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన కీలక భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడమే వెబినార్ లక్ష్యం
Posted On:
09 JUL 2024 5:45PM by PIB Hyderabad
వ్యవసాయేతర రంగంలో జీవనోపాధిని పెంచటానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం)..జనపనార కళారూపాలపై వెబినార్ నిర్వహించింది. జనపనార కళారూపాల పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన కీలక భాగస్వాములను ఏకతాటిపైకి తెచ్చి దాని స్థితిగతులు, సవాళ్లు, అవకాశాలపై చర్చించే లక్ష్యంతో దీనిని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గ్రామీణ జీవనోపాధి విభాగం అదనపు కార్యదర్శి శ్రీ చరణ్ జిత్ సింగ్.. జీవనోపాధి విషయంలో 'గోల్డెన్ ఫైబర్'గా, పర్యావరణం విషయంలో 'గ్రీన్ ఫైబర్'గా నిలిచే సామర్థ్యం జనపనారకు ఉందని అన్నారు. ఈ దిశగా తగిన గుర్తింపు పొందేందుకు.. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు, మార్కెటింగ్ ప్రయత్నాలను పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలని పాల్గొన్నవారితో పాటు నిపుణులకు పిలుపునిచ్చారు.ఆదాయాలను పెంచే సామర్ధ్యం ఉన్న ఈ జనపనార పరిశ్రమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కలలుగన్న విధంగా ‘లక్‌పతి దీదీ(లక్ష రూపాయలు సంపాదించే సహాయక బృందం మహిళ)’ల సాధనలో ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తోడ్పడుతుంది.
ఈ రంగానికి సంబంధించి సాంకేతిక పురోగతి, మార్కెట్ వ్యూహాలు, ఈ రంగంలోని మహిళా కళాకారుల అనుభవాలకు సంబంధించి నిపుణులు, ప్రాక్టీస్ చేస్తున్న వారు లోతైన విషయాలు పంచుకునేందుకు ఈ వెబినార్ ఒక వేదిక అని గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రీమతి రాజేశ్వరి ఎస్ఎం తెలిపారు.
కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ జనపనార బోర్డు జాయింట్ డైరెక్టర్ శ్రీ కిషన్ సింగ్ ఘుగ్త్యాల్ మాట్లాడుతూ.. జనపనార ఉత్పత్తులలో వైవిధ్యం ఉండేలా చూసుకోవటం, పనుల భారాన్ని తగ్గించే విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు, తద్వారా జనపనార కళను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఫౌండేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్(ఎఫ్ఎంసీ) సీనియర్ సలహాదారు శ్రీ తమల్ సర్కార్.. క్లస్టర్ ప్రమేయాలపై లోతైన విషయాలను పంచుకున్నారు. జనపనార కళారూపాల మార్కెటింగ్, ప్రమోషన్ ఫెసిలిటేటర్లలో మహిళా చేతివృత్తుల పరిధి, సవాళ్లపై కళాకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రీమతి అంజలి సింగ్ పలు విషయాలను పంచుకున్నారు.
భారతీయ జనపనార పరిశ్రమ చాలా పురాతనమైంది. దేశ తూర్పు భాగంలో చాలా ఇది కేంద్రీకృతమై ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, త్రిపురలలో వాణిజ్య పంటగా పండించే మొక్క కాండం నుండి జనపనార ఫైబర్ తీస్తారు. ఈ రాష్ట్రాల్లో జనపనార మిల్లులు ఒక ముఖ్యమైన పరిశ్రమగా ఉన్నాయి. ఈ పరిశ్రమలకు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన స్థానం ఉంది.
***
(Release ID: 2032269)
Visitor Counter : 75