పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో "ఏక్ పేడ్ మా కే నామ్" భారీ మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి పాల్గొన్న శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 07 JUL 2024 6:38PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో "ఏక్ పేడ్ మా కే నామ్(తల్లి పేరు మీద ఒక చెట్టు)" కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే భారీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర ఇతర మంత్రులు, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ భూపేందర్ యాదవ్… పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధాన మంత్రి ఏక్ పెడ్ మా కే నామ్ అభియాన్‌ను ప్రారంభించారని, ప్రతి పౌరుడు ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం జరుగుతోందన్నారు. మనకు జీవితాన్ని ప్రసాదించిన తల్లిని గౌరవించడం బాధ్యత అని, ప్రకృతిని గౌరవించి ఆకుపచ్చని భూమిని సాధించాలనే సంకల్పాన్ని నెరవేర్చడం మన కర్తవ్యం అని వ్యాఖ్యానించారు. చెట్ల పెంపకంలో మధ్యప్రదేశ్ చేస్తున్న కృషిని ప్రసంశించిన ఆయన.. పరిశుభ్రమైన ఇండోర్‌తో పాటు నగరాన్ని హరితంగా మార్చేందుకు స్థానికులు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ పురాతన కాలం నుంచి ఇండోర్, ఉజ్జయినిలు.. పర్యావరణ ప్రాముఖ్యతతో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాయన్నారు. తల్లి క్షిప్రా ఇండోర్ నుంచి ఉద్భవించిందని,  ఈ నగరం 7 నదులకు పుట్టినిల్లని అన్నారు. దేశంతో పాటు ప్రపంచంలో ఇండోర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న ముఖ్యమంత్రి… పరిశుభ్రమైన నగరంతో పాటు హరిత నగరంగా ఇండోర్ కచ్చితంగా మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు.

ఇండోర్‌లో హరిత విస్తీర్ణం పెంచుతామని రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ కైలాష్ విజయ్ వర్గీయ అన్నారు. 51 లక్షల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యతను వివిధ సంఘాలు, సంస్థలు తీసుకుంటున్నాయని తెలిపారు.

చెట్లు నాటేందుకు "ఏక్ పేడ్ మా కే నామ్(తల్లి పేరు మీద ఒక చెట్టు)"తో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమంలో, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తన తల్లి స్వర్గీయ శ్రీమతి లీలాబాయి శ్రీ పూనమ్ చంద్ జీ యాదవ్ జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ తన తల్లి శ్రీమతి సంతారా యాదవ్ పేరు మీద మామిడి మొక్కను నాటారు. పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ కైలాష్ విజయ్ వర్గీయ తన తల్లి అయోధ్య దేవి విజయవర్గియా పేరు మీద మామిడి మొక్కను నాటారు.

***


(Release ID: 2032268) Visitor Counter : 112