ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ కార్యనిర్వాహకవర్గం 86వ సదస్సులో పాల్గొన్న భారత్
సుగంధ ద్రవ్యాల అంతర్జాతీయ వ్యాపారం సజావుగా సాగేందుకు ప్రమాణాలను మెరుగుపరచడాన్ని బలపరిచిన భారత్
ఆహార ప్యాకేజింగ్ లో పునర్వినియోగ పదార్థాల వాడకం గురించి కోడెక్స్ నిబంధనావళి రూపకల్పన కోసం బలమైన వాదన
Posted On:
03 JUL 2024 2:03PM by PIB Hyderabad
భౌగోళిక స్థితిగతుల(ఆసియాలో) ఆధారంగా కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్(CAC)కు సభ్యురాలిగా ఎన్నికైన భారత్, సంస్థ 86 వ కార్యనిర్వాహక సదస్సులో(CCEXEC) చురుగ్గా పాల్గొంటోంది. ఆహార, వ్యవసాయ సంస్థ – (ఎఫ్.ఏ.ఓ.) కేంద్ర కార్యాలయమున్న రోమ్ నగరంలో ఈ ఏడాది జులై ఒకటవ తేదీ నుండి ఐదో తేదీ వరుకూ జరిగే ఈ సమావేశాల్లో మన దేశం తరఫున ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ - ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ సీ.ఈ.ఓ శ్రీ జీ కమలా వర్ధన రావు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ – WHO, ఎఫ్.ఏ.ఓ. లు నెలకొల్పిన కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్, వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ, ఆహార వర్తక రంగంలో న్యాయబద్ధమైన లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ కార్యనిర్వాహక బృందం, కొత్త పనుల గురించిన ప్రతిపాదనల పరిశీలన, ప్రమాణాల మెరుగుదల వేగాన్ని సమీక్షించే కీలక భూమికను పోషిస్తోంది.
సదస్సుల నేపథ్యంలో చిన్న ఏలకులు, పసుపు, వనీలా వంటి వివిధ మసాలా దినుసుల విషయంలో ప్రమాణాల మెరుగుదలకు భారత్ పట్టుపట్టింది. ఆయా దినుసుల ఉత్పత్తి ఎగుమతుల్లో అగ్రగామి అయిన భారత్ కు ఈ అంశం సానుకూలంగా పరిణమించి, అంతర్జాతీయ వ్యాపారం సులభతరం అవుతుంది. కొన్ని ప్రత్యేకమైన వంట నూనెల విషయంలో సైతం ప్రమాణాల మెరుగుదల ప్రతిపాదనలకు భారత్ మద్దతు తెలిపింది. ‘షిగా టాక్సిన్’ లుగా పిలువబడే విషపదార్థాలను వెలువరించే ఈ - (ఎస్చేరియా) కోలీ కట్టడి కోసం నిబంధనల రూపకల్పన, ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్ లలో సురక్షితమైన నీటి వినియోగ/పునర్వినియోగాల అంశాలకు కూడా భారత్ మద్దతు తెలిపింది.
ఆహార ప్యాకేజింగ్ లో పునర్వినియోగించబడే పదార్థాల భద్రతా ప్రమాణాలను నిర్ధారించేందుకు కోడెక్స్ నియమావళిని రూపొందించాలని కూడా భారత్ పట్టుపడుతోంది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణహిత పద్ధతులు వంటి ప్రపంచస్థాయి సవాళ్లను ఎదుర్కోవడంలో నియమావళి కీలకం కానుంది. వినియోగదారులు వాడి వదిలేసిన పెట్ వస్తువులను ఆహార పదార్థాల ప్యాకేజింగ్ లో సురక్షితంగా రీసైక్లింగ్ చేసే పద్ధతిని, ఇందు కోసం ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ రూపొందించిన నియమావళిని భారత్ సదస్సులో పంచుకుంది. ఈ నిబంధనలు/నియమావళి CCEXEC సభ్యుల ఆదరణను, ప్రశంసలను దక్కించుకున్నాయి.
అంతర్జాతీయ ఆహార వాణిజ్య రంగంలో సురక్షితమైన పద్ధతుల ఏర్పాటు, న్యాయబద్ధమైన లావాదేవీలను నెలకొల్పాలన్న లక్ష్యాలు కల భారత్ ఉన్నతస్థాయి CCEXEC కార్యనిర్వాహక వర్గంలో సభ్యురాలిగా పాల్గొనడం, అంతర్జాతీయ ఆహార భద్రతా రంగంలో మన దేశ కీలక పాత్రను సూచిస్తుంది.
***
(Release ID: 2030508)
Visitor Counter : 111