శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

"ఆలోచనా విధానంలో మార్పు, ప్రాంతీయ వనరుల అన్వేషణ జమ్మకశ్మీర్‌లో అంకుర సంస్థలకు కీలకం" అని తెలిపిన కేంద్రమంత్రి డా. జితేంద్ర సింగ్ చెప్పారు.


నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ అంకుర సంస్థల కాన్ఫరెన్స్ ఆర్ఏసీఈ 2024 ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్

జమ్ముకశ్మీర్ లో అంకుర సంస్థలు ప్రారంభించాలంటే వ్యవసాయ రంగం ప్రధాన అంశంగా ఉండాలి. అరోమా మిషన్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, పర్పుల్ విప్లవం భదేర్వా, గుల్‌‌మార్గ్ అనే చిన్న పట్టణాల నుండి పుట్టిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న కేంద్రమంత్రి

Posted On: 30 JUN 2024 7:26PM by PIB Hyderabad

ఆలోచనా విధానంలో మార్పు, ప్రాంతీయ వనరుల అన్వేషణ జమ్ము కశ్మీర్‌లో అంకుర సంస్థలకు కీలకం అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ అన్నారు. జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ అంకుర సంస్థల కాన్ఫరెన్స్ ఆర్ఏసీఈ 2024 ముగింపు కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

గత దశాబ్ద కాలంలో భారతదేశంలో అంకుర సంస్థల ఉద్యమం పెద్ద ఎత్తున ఊపందుకుందని డా. జితేంద్ర సింగ్ అన్నారు. ఈ ఘనత స్వాతంత్ర్య దినోత్సవం రోజు, ఎర్రకోట నుంచి 'స్టార్టప్ ఇండియా- స్టాండప్ ఇండియా' పిలుపునిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకే దక్కుతుందని కేంద్రమంత్రి డా. జితేంద్ర సింగ్ అన్నారు.  అప్పట్లో దేశంలో అంకురాల సంఖ్య కేవలం 350-400 మాత్రమేనని, నేడు అది 1.5 లక్షలకు పెరిగిందని ఆయన తెలిపారు. అంకుర సంస్థల సంఖ్య విషయంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు.

డా. జితేంద్ర సింగ్ సమావేశంలో ప్రసంగిస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా స్టార్టప్ ఉద్యమం ఈ ప్రాంతంలో సమాన వేగంతో ముందుకు సాగలేదు. జమ్ముకశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగం ప్రధాన జీవనోపాధి వనరుగా ఉండటం, ఇది యువతతో పాటు తల్లిదండ్రుల మనస్తత్వాన్ని మార్చడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.  కాబట్టి రోజ్‌గార్ అంటే సర్కారీ నౌకరీ మాత్రమే కాదని, వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగంతో పోలిస్తే కొన్ని అంకుర మార్గాలు మరింత లాభదాయకంగా ఉంటాయని, వాటిపట్ల అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని మంత్రి తెలిపారు.

ప్రాంతీయ వనరులను అన్వేషించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన డా. జితేంద్ర సింగ్, అంకురాల గురించి మాట్లాడేటప్పుడు ఏదో విధంగా మనస్తత్వం ఐటితో ఇరుక్కుపోతుందని, అయితే జమ్మకశ్మీర్ వంటి ప్రాంతంలో వ్యవసాయ రంగం అంకుర సంస్థలకు ప్రధాన ప్రాంతంగా ఉండాలని అన్నారు.  అరోమా మిషన్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, పర్పుల్ విప్లవం భదేర్వా గుల్‌మార్గ్ వంటి చిన్న పట్టణాల నుండి పుట్టిందని.., ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. పర్పుల్ రివల్యూషన్ శకటం కూడా జనవరి 26 న దిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద ప్రదర్శించబడిందని ఆయన అన్నారు.  దాదాపు 5 వేల మంది యువకులు వ్యవసాయ అంకుర సంస్థ ద్వారా లావెండర్ వ్యవసాయాన్ని చేపట్టి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారన్నారు.  వారి ప్రోత్సాహంతో కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న కొందరు యువకులు కూడా తమ ఉద్యోగాన్ని వదిలేసి లావెండర్ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.  జమ్ముకశ్మీర్ ఉదాహరణను ఇప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా అనుకరిస్తుండటమే అరోమా మిషన్ విజయానికి నిదర్శనమన్నారు.

జమ్ముకశ్మీర్ విషయానికొస్తే, పూల మొక్కలు పెంచే రంగంలో కూడా వ్యవసాయ అంకుర ప్రాంతాలను అన్వేషించడం సాధ్యమని, దీని కోసం సీఎస్ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్ ను ప్రారంభించిందని డా. జితేంద్ర సింగ్ తెలిపారు. హ్యాండ్ క్రాఫ్ట్ హార్టికల్చర్, టెక్స్ టైల్ అంకురాలు జమ్ముకశ్మీర్ లో గొప్ప రంగాలుగా ఆయన అభివర్ణించారు.
అంకురాల విజయానికి ముఖ్యమైన కారకాలలో ఒకటి విద్యారంగం, పరిశోధన, పరిశ్రమల మధ్య సన్నిహిత సమన్వయం అని, ఇందుకోసం వివిధ పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ఒకే వేదికపైకి రావాలని కేంద్రమంత్రి డా. జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.  జమ్ముకశ్మీర్‌లోని సీఎస్ఐఆర్ , ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, స్కిమ్స్, ఎస్కేయూఏఎస్‌టీ, ఎన్‌ఐటీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సహా వివిధ సంస్థలు సంయుక్తంగా స్టార్టప్ ప్రయత్నాల కోసం ముందుకు రావచ్చని తెలిపారు.

2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారత్' లక్ష్యం దిశగా భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఆలోచనల్లో మౌలికమైన మార్పు అవసరం గురించి మంత్రి సమావేశంలో మాట్లాడారు. సుస్థిరాభివృద్ధిని నిర్ధారించడానికి, అంకుర సంస్థలకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి... స్కిమ్స్ సౌరా, ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎంలు, జిఎంసిల వంటి విద్యా సంస్థలను పరిశ్రమ భాగస్వాములతో అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడానికి శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నిబద్ధతను డా. జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. జమ్ముకశ్మీర్‌లో వివిధ రంగాల్లో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి వివరించారు.

***



(Release ID: 2029840) Visitor Counter : 18