గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మాస్టర్ ట్రైనర్లకు ఎంపీలాడ్స్ పథకం కింద నిధుల విడుదల పద్థతిలో చేసిన సవరణల విషయంలో ఈ-సాక్షి పోర్టల్‌పై ట్రైనింగ్ వర్క్ షాప్
Posted On:
21 JUN 2024 12:44PM by PIB Hyderabad
పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్స్) పథకం కింద నిధుల విడుదల పద్ధతిలో చేసిన సవరణకు సంబంధించి ఈ-సాక్షి పోర్టల్‌పై రెండు రోజుల ట్రైనింగ్ వర్క్‌షాప్‌ను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ(ఎమ్ఓఎస్‌పీఐ) 2024 జూన్ 20, 21 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఎంపీ ల్యాడ్స్ పథకం కింద ఒక్కో ఎంపీకి రూ.5 కోట్లు కేటాయించి స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా మన్నికైన సామాజిక ఆస్తులను సృష్టించేందుకు అభివృద్ధి పనులకు సిఫారసు చేయవచ్చు. ఈ పథకానికి ఏటా సుమారు రూ.4000 కోట్లు ఖర్చవుతున్నాయి. ఎంపీలు సిఫార్సు చేసి, జిల్లా అధికారులు మంజూరు చేసిన పనుల కోసం ఈ నిధులు వినియోగిస్తున్నారు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఎంపీ ల్యాడ్స్ మార్గదర్శకాలను సవరించి, ఈ-సాక్షి పోర్టల్‌ను ప్రారంభించారు. ఇది ఎంపీలాడ్స్ పథకాన్ని సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి ఎండ్ టు ఎండ్ పరిష్కారాన్ని ఇస్తుంది.
గతంలో గౌరవ ఎంపీల పనుల సిఫార్సు, జిల్లా అధికారులు పనుల మంజూరు మొదలుకొని పనులు చేసే ఏజెన్సీలకు చెల్లింపుల వరకు మొత్తం ప్రక్రియ మాన్యువల్‌గా జరిగి, అవసరమైన దస్త్రాల పనులు పూర్తయిన తర్వాతే గౌరవ ఎంపీలకు అనుమతులు ఇచ్చేవారు. కొత్త విధానంలో నిధుల విడుదలను క్రమబద్ధీకరించి, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఒకేసారి రూ.5 కోట్ల అనుమతులు జారీ చేస్తారు. భౌతిక ఖాతాల నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు మారడం వల్ల నిధుల విడుదలలో ముందస్తు షరతుల అవసరం తొలగింది. ఇది చురుకుదనం పెంచటంతో పాటు బ్యూరోక్రటిక్ అడ్డంకులను తగ్గించింది. క్లిక్, ఓటిపి ఆధారిత ధృవీకరణ వ్యవస్థ ద్వారా ఎంపీలు ఇప్పుడు ప్రాజెక్టులను డిజిటల్‌గా సిఫార్సు, వీక్షణ, సమీక్ష చేయచ్చు. మొబైల్ యాప్ ద్వారా కూడా పనులను సిఫార్సు చేయవచ్చు. జిల్లా అధికారులు పనులను మంజూరు చేయవచ్చు. ఏజెన్సీలు చేస్తున్న పనులను అమలును పర్యవేక్షించవచ్చు. జిల్లా అధికారులు ధృవీకరించి, పనులు పూర్తయినట్లు పోర్టల్‌లో అప్ లోడ్ చేసిన తర్వాత నేరుగా పనులు చేస్తున్న ఏజెన్సీలకు చెల్లింపులు అందుతాయి.
ఎంపీలాడ్స్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పాత్ర ప్రాముఖ్యతను ఎంఓఎస్పీఐ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ నొక్కి చెప్పారు. ఎంపీ ల్యాడ్ పథకం దేశ పౌరులను నేరుగా ప్రభావితం చేస్తుందని… ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి, విశ్లేషించడానికి పోర్టల్‌ను ఉపయోగించాలని, తద్వారా ఈ పథకం ప్రయోజనాలు నేరుగా ప్రజలకు అందేలా చూడాలని ఆయన అన్నారు.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 150 మంది మాస్టర్ ట్రైనర్లకు ఎమ్ఓఎస్‌పీఐకి చెందిన ఎంపీల్యాడ్స్ విభాగం ఈ వర్క్‌షాప్‌లో టైనింగ్ ఇచ్చింది. పోర్టల్‌లో ఉన్న ఆప్షన్లతో పాటు వాటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేయడమే ఈ వర్క్‌షాప్ లక్ష్యం. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేలా 785 జిల్లాల్లోని అధికారులతో పాటు 15000కు పైగా పనులు చేసే ఏజెన్సీలకు అవగాహన కల్పించి, మరింత శిక్షణ ఇచ్చే బాధ్యత మాస్టర్ ట్రైనర్లపై ఉంది.
***
(Release ID: 2028146)