ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కోసం వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభించిన శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ రవ్‌నీత్ సింగ్

Posted On: 19 JUN 2024 2:15PM by PIB Hyderabad

త్వరలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా మూడో ఎడిషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌,మొబైల్ యాప్‌‌ను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్,  కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ విడుదల చేశారు.
 

 


వ్యవసాయ వృథాను తగ్గించటం, విలువ జోడింపు, ఆహార భద్రతను నిర్ధారించుకోవటం, వ్యవసాయ క్షేత్రం నుంచి భోజనం వరకు సరఫరా గొలుసును బలోపేతం చేయటంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల పాత్ర గురించి తన కీలకపోన్యాసంలో శ్రీ చిరాగ్ పాశ్వాన్ మాట్లాడారు. తమ పూర్తి ప్రభుత్వం విధానం ద్వారా ఆహార, అనుబంధ రంగాలలో వ్యాల్యూ చైన్ సమగ్ర అభివృద్ధికి భారత ప్రభుత్వం గొప్ప ప్రాధాన్యతను ఇచ్చింది. ఆత్మనిర్భర్, విక్‌సిత్ భారత్ లక్ష్యానికి కృషి చేస్తోంది. .
 


ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై), ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐఎస్), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) వంటి పథకాలను మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందని శ్రీ పాశ్వాన్ గుర్తుచేశారు. 
 


ప్రపంచ, భారత ఆహార రంగంలోని వాటాదారుల మధ్య సహకారం, భాగస్వామ్యాలను పెంపొందించడానికి దేశంలో అతిపెద్ద ఆహార కార్యక్రమమైన వరల్డ్ ఫుడ్ ఇండియాను 19 నుంచి 22 సెప్టెంబర్ 2024 వరకు నిర్వహిస్తుందని తెలిపారు. పెరుగుతోన్న స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు, సృజనాత్మకత ఊతమిచ్చేందుకు ఈ సంవత్సరం అదనంగా స్టార్టప్ ఇండియా సహకారంతో స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ రెండవ ఎడిషన్‌ను ప్రారంభిస్తోంది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023లో 1,208 మంది ఎగ్జిబిటర్లు, 90 దేశాలు, 24 రాష్ట్రాల నుంచి 715 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు, 75,000 మంది హాజరవ్వటంతో భారీగా విజయవంతమైంది. ఈ మెగా కార్యక్రమంలో 16,000కు పైగా బీ2బీ/బీ2జీ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చలు, 47 థీమాటిక్ సెషన్లు, అవగాహన ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు, ఎగ్జిబిషన్లు, స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్, మరెన్నో ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ఇవన్నీ ఆహార ప్రాసెసింగ్, అనుబంధ రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాయి.
 

 


భారత ఆహార శుద్ధి రంగం పరివర్తనా సామర్థ్యాన్ని సహాయ మంత్రి శ్రీ రవ్ నీత్ సింగ్ తన ప్రత్యేక ప్రసంగంలో నొక్కి చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో పురోగతి వ్యవసాయ సంపదను బలమైన ఆర్థిక శక్తిగా మార్చగలదని ఆయన పేర్కొన్నారు. భారతదేశ విస్తారమైన మార్కెట్, డైనమిక్ యువ శ్రామిక శక్తిని పెంపొందించడంతో పాటు వివిధ సంస్కరణల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించడంలో ప్రభుత్వ క్రియాశీల వైఖరిని ఆయన ప్రస్తావించారు.
 


రాబోయే ఈ మెగా ఈవెంట్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన… ఈ కార్యక్రమం ఆహార పరిశ్రమలోని అన్ని వైపుల నుంచి వాటాదారులను ఏకతాటిపైకి తీసుకువస్తుందన్నారు. తయారీదారులు, ఉత్పత్తిదారులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, ప్రపంచ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ
ఆలోచనలను మార్చుకునేందుకు, అవకాశాలను అన్వేషించడానికి, ఈ రంగం పూర్తి అభివృద్ధికి దోహదం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సహకారం, సృజనాత్మకతను పెంపొందించడమే ఈ ప్రత్యేక సమావేశం లక్ష్యమని, వృద్ధి రేటును కొనసాగించడంలో మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని సింగ్ కోరారు. సమిష్టి కార్యాచరణ, భాగస్వామ్య దార్శనికత ద్వారా గణనీయమైన పురోగతిని సాధించడానికి, ప్రపంచ ఆహార వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుంది.

 

 


ఎఫ్‌పీఐ కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్ మాట్లాడుతూ… మునుపటి ఎడిషన్‌కు కొనసాగింపుగా  డబ్ల్యూఎఫ్ఐ 2024 జరుగుతోందని, ఇది ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించే పరిశ్రమల ఆధారంగా జరిగే సమ్మిళిత కార్యక్రమం అని అన్నారు. మునుపటి ఎడిషన్‌లో భారీ సంఖ్యలో హాజరుపై ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 4 రోజుల ఈ ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌కు సీనియర్ ప్రభుత్వ ప్రముఖులు, ప్రపంచ పెట్టుబడిదారులు, వ్యాపార నాయకులు, ఫుడ్ ప్రాసెసర్లు, పరికరాల తయారీదారులు, లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్లు, టెక్నాలజీ అందించేవాళ్లు,  స్టార్టప్‌లు, ఆహార రిటైలర్లు తదితర భాగస్వాములను ఆమె ఆహ్వానించారు.

 

***



(Release ID: 2027259) Visitor Counter : 25