పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ఉజ్వల యోజన వినియోగదార్లకు రూ.300 రాయితీ కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం


10.27 పీఎంయూవై లబ్ధిదార్ల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నగదు జమ

2024-25లో మొత్తం వ్యయం రూ.12,000 కోట్లు

Posted On: 07 MAR 2024 7:47PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదార్లకు శుభవార్త అందింది. పీఎంయూవై లబ్ధిదార్లకు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీ అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు, 14.2 కిలోల సిలిండర్‌కు రూ.300 చొప్పున (5 కిలోల సిలిండర్‌కు దామాషా ప్రకారం) రాయితీ కొనసాగుతుంది. 01 మార్చి 2024 నాటికి, 10.27 కోట్లకు పైగా పీఎంయూవై లబ్ధిదార్లు ఉన్నారు.


2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.12,000 కోట్లు. రాయితీని అర్హులైన లబ్ధిదార్ల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.

శుద్ధమైన వంట ఇంధనమైన ద్రవీకృత పెట్రోలియం గ్యాస్‌ను (ఎల్‌పీజీ) గ్రామీణ & నిరుపేద పేద కుటుంబాలకు అందుబాటులో ఉంచడానికి, పేద కుటుంబాల మహిళలకు డిపాజిట్-రహిత ఎల్‌పీజీ కనెక్షన్‌ అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 మే నెలలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రారంభించింది.

మన దేశం, మొత్తం ఎల్‌పీజీ అవసరాల్లో 60% దిగుమతి చేసుకుంటోంది. ఎల్‌పీజీ అంతర్జాతీయ ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి పీఎంయూవై లబ్ధిదార్లకు రక్షణ కల్పించడానికి, వంట గ్యాస్‌ను మరింత తక్కువ ధరలో అందుబాటులో ఉంచడానికి రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2022 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా, తొలుత, ఒక్కో 14.2 కిలోల సిలిండర్‌కు రూ.200 చొప్పున రాయితీ ఇచ్చింది. పీఎంయూవై వినియోగదార్లకు సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు (5 కిలోల సిలిండర్‌కు దామాషా ప్రకారం) రాయితీ వర్తిస్తుంది. 2023 అక్టోబర్‌లో, సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు, ఒక్కో 14.2 కేజీల సిలిండర్‌పై రాయితీని రూ.300కు పెంచింది. ఈ రాయితీ పోను, 01.02.2024 నాటికి, పీఎంయూవై వినియోగదార్లకు 14.2 కేజీల సిలిండర్‌కు రూ.603 (దిల్లీ ధర) అందుబాటులోకి వచ్చింది.

పీఎంయూవై వినియోగదార్ల సగటు ఎల్‌పీజీ వినియోగం 2019-20లో 3.01 సిలిండర్ల నుంచి 2023-24లో (2024 జనవరి వరకు) 3.87 సిలిండర్లకు, 29 శాతం పెరిగింది. పీఎంయూవై లబ్ధిదార్లంతా ఈ రాయితీకి అర్హులే.

***



(Release ID: 2012585) Visitor Counter : 137