ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డా. మనసుఖ్ మాండవీయ, శ్రీ అనురాగ్ ఠాకూర్‌తో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని ఎయిమ్స్ బిలాస్‌పూర్‌లో నైట్ షెల్టర్‌కు శంకుస్థాపన సహా, నూతన ఆరోగ్యసంరక్షణ సౌకర్యాలను ప్రారంభించిన శ్రీ జెపి నడ్డా
ఆరోగ్య రంగం పరివర్తన కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పని చేస్తోంది, దీనిని కేవలం ఎయిమ్స్ నెట్‌వర్క్ విస్తరణలోనే కాక ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇతర రంగాలలో కూడా వీక్షించవచ్చుః శ్రీ జెపి నడ్డా
మొదటగా వ్యాధులను నిరోధించేందుకు నివారణ చర్యలపై దృష్టి పెట్టి ఒక సంపూర్ణ వైఖరిని నేడు మన ఆరోగ్య విధానం అందిపుచ్చుకుంది. మా దృష్టి నివారణకు ఆవల నిరోధక, ఉపశమన, పునరావాస ఆరోగ్య సంరక్షణ పై ఉంది
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలలో అంతరాయం కలిగించిన కోవిడ్-19 మహమ్మారి భారీ సవాళ్ళను విసిరినప్పటికీ, భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆ ఒత్తిడిని తట్టుకోవడమే కాదు, అటువంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు గతంలోకన్నా నేడు మరింత సంసిద్ధతతో ఉందిః డా. మన్‌సుఖ్ మాండవీయ
ఎయిమ్స్ బిలాస్‌పూర్ శంకుస్థాపన నుంచి కేవలం 3 ఏళ్ళలో పూర్తి అయ్యి, ఆఖరు మైలువరకు నాణ్యమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను తేవాలన్న కేంద్ర ప్రభుత్వ కృషిలో ఒక మైలురాయిగా నిలిచిందిః శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
23 FEB 2024 4:05PM by PIB Hyderabad
రేడియేషన్ ఆంకాలజీ, 128 స్లైస్ సిటి స్కానర్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ) కేంద్రంతో సహా నూతన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను హిమాచల్ ప్రదేశ్‌లోని ఎయిమ్స్ బిలాస్‌పూర్ లో శుక్రవారం నాడు ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ & రసాయనాలు, ఎరువుల మంత్రి డా. మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర సమాచార, ప్రసార & యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ సమక్షంలో రాజ్యసభ సభ్యులు, కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వీటిని ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ జయరాం ఠాకూర్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన కూడా ఎయిమ్స్ బిలాస్‌పూర్‌లో నిర్మిస్తున్న విశ్రామ్ సదన్ (నైట్ షెల్టర్)కు పునాదిరాయి వేశారు. అదనంగా ఈ సేవలను అందించడం అన్నది హిమాలయ రాష్ట్రంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడమే కాక, పొరుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత లాభదాయకం అయ్యి, రోగుల సంరక్షణలో నూతన శకానికి చిహ్నంగా నిలుస్తాయి.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పరివర్తన చేసేందుకు సానుకూలంగా పని చేస్తోందని శ్రీ జెపి నడ్డా అన్నారు. దీనిని ఎయిమ్స్ నెట్‌వర్క్ విస్తరణలోనే కాక, వైద్య కళాశాలలను రెట్టింపు చేయడం, ఎంబిబిఎస్, పిజి సీట్లు పెంచడం, నర్సింగ్ కళాశాలలను సృష్టించడం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఇంకా అనేక ఇలాంటి విధానాల ద్వారా చూడవచ్చని ఆయన అన్నారు.
మొదటగా వ్యాధులను నివారించేందుకు నిరోధక చర్యలపై దృష్టి పెట్టి నేడు మన ఆరోగ్య విధానం అనేది సంపూర్ణ వైఖరిని అనుసరిస్తోందని, శ్రీ నడ్డారు పేర్కొన్నారు. నిరోధకతకు ఆవల నివారణ, ఉపశమన, పునరావాస ఆరోగ్యరక్షణపై దృష్టి విస్తరిస్తుందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఎబి- పిఎంజెఎవై) కారణంగా, హిమాచల్ ప్రదేశ్‌లో అర్హులైన వ్యక్తులందరూ నేడు పూర్తిగా బీమాను కలిగి ఉన్నారని ఆయన పట్టి చూపారు.
గత 10 ఏళ్ళల్లో ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ, టిబి నోటిఫికేషన్లలో 64% పెరుగుదలతో పాటు, టిబి కేసుల్లో 80%పైగా విజయవంతమైన చికిత్స, స్టెంట్‌లు, మందుల ధరల తగ్గించి, దేశవ్యాప్తంగా వాటిని అందుబాటును సులభతరం చేసేందుకు జన ఔషధ కేంద్రాల విస్తరణ, ఎయిమ్స్ వంటి వైద్య సంస్థలలో ఆయుష్ బ్లాక్‌లను సృష్టించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ, బల్క్ డ్రగ్ పార్కుల సృష్టి వంటివన్నీ ప్రభుత్వం సాధ్యం చేసిందన్నారు.
సమాజంలో పరివర్తనాత్మక ప్రభావాన్ని తీసుకువచ్చేందుకు ప్రభావవంతమైన నాయకత్వ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, కొద్ది సంవత్సరాల కింద వరకూ, బిలాస్‌పూర్ వంటి ప్రాంతానికి ఎయిమ్స్ వంటి సంస్థ రావడమనేది అనూహ్యమైన విషయమని శ్రీ నడ్డా పేర్కొన్నారు. ఆఖరు మైలు వరకు ఆరోగ్యసంరక్షణ సేవలను తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషి కారణంగా ఇది సాధ్యమైందన్నారు. అలాగే, శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారి వంటిదైన కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాలా భయం, ఆందోళన ఏర్పడ్డాయన్నారు. అయితే, గౌరవ ప్రధానమంత్రి దాని వ్యాప్తిని నియంత్రించేందుకు ఎటువంటి శక్తిని లేక హింసాత్మక చర్యలను ఉపయోగించకుండా దేశం మొత్తాన్నీ ఐక్యం చేయడంలో విజయవంతం కావడాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించారని ఆయన పేర్కొన్నారు.
ఎయిమ్స్ బిలాస్‌పూర్‌లోని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను అభినందిచి, ఎయిమ్స్ సంస్కృతి స్ఫూర్తికి అనుగుణంగా ఈ ప్రాంతంలో ఉత్తమ సేవలను అందించాలని ప్రోత్సహిస్తూ జెపి నడ్డా తన ఉపన్యాసాన్ని ముగించారు.
అనంతరం మాట్లాడుతూ, ఎయిమ్స్ బిలాస్‌పూర్‌లో 12 నూతన సౌకర్యాలను ప్రారంభించడం లేదా నేడు శంకుస్థాపన చేయడం అనేది సంతోషించవలసిన పరిణామమని, దీని సంచిత వ్యయం రూ. 400 కోట్లకన్నా ఎక్కువ అని డా. మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
సవాళ్ళను, అవకాశాలుగా ప్రభుత్వం ఎలా మార్చుకుందో పట్టిచూపుతూ, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో సహా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలకు భంగం కలిగించి కోవిడ్-19 మహమ్మారి ఎంతటి భారీ సవాళ్ళను విసిరినప్పటికీ, భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఈ ఒత్తిడిని తట్టుకోవడమే కాక అటువంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు గతంలో కన్నా ఎంతో సంసిద్ధతతో నేడు ఉన్నదని అన్నారు. గత 10 ఏళ్ళలో ఎయిమ్స్‌లో, ఇతర వైద్య సంస్థలలో ఎల్ఎంఒ ప్లాంట్లు, అత్యాధునిక పరికరాలు, యంత్రాలు స్థాపన అన్నది ముఖ్యంగా ఆరోగ్య ఎమర్జెన్సీలను నిర్వహించేందుకు ఆరోగ్యం సంసిద్ధంగా ఉండేలా నిర్ధారించేందుకేనని ఆయన అన్నారు.
ఆఖరు మైలు వరకు ఆరోగ్యసంరక్షణ సేవలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఎయిమ్స్‌ను ప్రారంభించడం జరిగిందని డా. మాండవీయ అన్నారు. నాణ్యమైన వైద్య చికిత్స కోసం వ్యక్తులు మెట్రో నగరాలకు వెళ్ళకుండా ఉన్న చోటే పొందేలా చూడడమే దీని లక్ష్యమన్నారు.
శంకుస్థాపన చేసినప్పటి నుంచి ప్రారంభమయ్యేందుకు కేవలం 3 ఏళ్ళు మాత్రమే ఎయిమ్స్ బిలాస్‌పూర్‌కు పట్టిందని, ఆఖరు మైలు వరకు సమయానికి, నాణ్యమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ కృషిలో ఇది ఒక మైలు రాయి అని శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. విశ్రామ సదన్ నిర్మాణం పూర్తి అయితే, పర్వత ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇది అత్యంత అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
గౌరవ మంత్రులు ప్రధాన ఆసుపత్రి భవనంలో ఇటీవలే కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించిన కార్డియాక్ కాథ్ లాబ్, కరోనరీ కేర్ యూనిట్ (సిసియు), సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్‌మెంట్ (సిఎస్ఎస్‌డి), లాండ్రీ ని సందర్శించారు.
నేపథ్యం
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎంఎస్ఎస్‌వై) ఐదవ దశ కింద ప్రారంభించిన సంస్థ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్- ఎయిమ్స్), బిలాస్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్). దేశంలో సరసమైన/ విశ్వసనీయమైన ద్వితీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ లభ్యతలో అసమతుల్యతను సరిదిద్దే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు.
కాన్సర్ రోగులకు రూ. కోట్ల విలువైన అత్యాధునిక యంత్రాలతో అత్యంత ఆధునిక రేడియో థెరపీ చికిత్సను అందించేందుకు ఎయిమ్స్‌లో రేడియేషన్ ఆంకాలజీ సేవలను ప్రారంభించారు. ఆధునిక సాంకేతికత తోడ్పాటుతో కాన్సర్ రోగులకు హై ఎనర్జీ లీనియర్ ఆక్సిలరేట్ (హెచ్ఇఎల్ఎ), హెచ్‌డిఆర్ బ్రాకీ థెరపీ, 4డి సిటి సిమ్యులేటర్ ద్వారా కాన్సర్ రోగులకు చికిత్సను అందించవచ్చు. ఇవన్నీ కూడా చుట్టూ ఉండే ఆరోగ్యవంతమైన టిష్యూల సమగ్రతను పరిరక్షిస్తూ ట్యమూర్లను సమర్ధవంతంగా ఖచ్చితమైన చికిత్స ప్రణాళికను రూపొందించుకొని, అందించేందుకు తోడ్పడతాయి.
ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో పవర్‌గ్రిడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో (సిఎస్ఆర్)లో భాగంగా ఉదారంగా అందించిన రూ. 7 కోట్లతో అత్యాధునిక 128 స్లైస్ సిటి స్కానర్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలో అత్యంత స్పష్టతతో ఖచ్చితమైన చిత్రాన్ని అందించడం ద్వారా రోగులు వేచి ఉండవలసిన సమయాన్ని తగ్గిస్తుంది. తీవ్రమైన ఆనారోగ్యంతో బాధపడుతూ, వేగవంతంగా ఖచ్చితమైన రోగనిర్ధారణ అవసరమయ్యే పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. రానున్న కొద్ది నెలల్లో సిఎస్ఆర్ నిధి కింద రూ. 16 అంచనా ధర కలిగిన ఎంఆర్ఐ మెషీన్‌ను కూడా పవర్‌గ్రిడ్ అందించనుంది.
సిఎస్ఆర్ కింద పవర్‌గ్రిడ్ అందిస్తున్న మరొక ఉదార తోడ్పాటు బిలాస్‌పూర్ ఎయిమ్స్‌లో విశ్రామ సదన్ ఏర్పాటు. సుమారు 250మంది వ్యక్తులకు సరిపోయేలా దీనిని నిర్మించనున్నారు. వేచి ఉండే రోగులకు, వారి అటెండెంట్లకు సౌకర్యవంతమైన వసతితో పాటు గడ్డ కట్టించే చలి నుంచి, భయంకరమైన వేసవి నుంచి, ఆగకుండా కురిసే వర్షాల నుంచి రక్షణను అందిస్తుంది. ఇది దాదాపు 18 నెలల్లో సిద్ధం కానుంది. దీని అంచనా వ్యయం రూ. 26.75 కోట్లు.
ఎయిమ్స్ బిలాస్‌పూర్‌లోని లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ) కేంద్రం రోగుల పడకల పక్కనే ఇరవైనాలుగు గంటలూ ఆక్సిజన్ సరఫరాను అందిస్తుంది. ఒక్కొక్కటి 20 కిలో లీటర్ల (కెఎల్) ఎల్ఎంఒను నింపుకోగల సామర్ధ్యం గల రెండు ఎల్ఎంఒ ట్యాంకులు ఉన్నాయి.
ఎయిమ్స్ బిలాస్‌పూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొ. వీర్ సింగ్ నేగి, కేంద్ర ప్రభుత్వ, హిమాచల్ ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఎయిమ్స్ బిలాస్‌పూర్, పవర్‌గ్రిడ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2008740)
Visitor Counter : 120