నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
రిటైల్ అనుబంధ సంస్థ ఏర్పాటు, పైకప్పు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు రుణాలు ప్రణాళికలను ప్రకటించిన ఇరెడా
Posted On:
20 FEB 2024 7:21PM by PIB Hyderabad
పైకప్పు సౌర విద్యుత్, పీఎం-కుసుమ్, విద్యుత్ వాహనాలు, బిజినెస్-టు-కన్జ్యూమర్ (బీ2సీ) విభాగాల్లో పని చేసే రిటైల్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించడానికి ఒక అనుబంధ సంస్థను స్థాపించే ప్రణాళికలో ఉన్నట్లు 'ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్' (ఇరెడా) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ చెప్పారు. భారత ప్రభుత్వ ఆమోదం రాగానే, పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ఇరెడా ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 2వ "సీఐఐ ఇండియా యూరోప్ బిజినెస్ & సస్టైనబిలిటీ కాన్‌క్లేవ్"లో భాగంగా "గ్రీన్ ఫైనాన్సింగ్: ఆర్కిటెక్చర్ ఫర్ యాక్సెస్‌బుల్ ఫైనాన్స్" అంశంపై ఈ రోజు న్యూదిల్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ పాల్గొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో సీఐఐ ఈ చర్చా వేదికను నిర్వహించింది.
13 ఫిబ్రవరి 2024న, ప్రధాన మంత్రి ప్రకటించిన "పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన" గురించి ప్రస్తావించిన ఈరెడా సీఎండీ, పైకప్పు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు రుణాలు అందించడంలో ఇరెడా చురుకైన పాత్ర గురించి వివరించారు.
భారత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మద్దతు ఇవ్వడంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. రిటైల్ ప్రాజెక్టుకు రుణాల అందుబాటు గురించి ప్రత్యేకంగా చర్చించారు. విద్యుత్ వాహనాలు, హరిత హైడ్రోజన్, తీరప్రాంతంలో గాలిమరల ద్వారా పవన విద్యుత్ ఉత్పత్తి వంటి వర్దమాన రంగాలు సహా వివిధ పునరుత్పాదక ఇంధన సాంకేతికతలకు రుణాలను అందుబాటులో ఉంచడంలో ఇరెడా నిబద్ధతతో పని చేస్తోందని శ్రీ దాస్ స్పష్టం చేశారు. రుణగ్రహీతల సమస్యలు పరిష్కరించడం ద్వారా, మెరుగైన పారదర్శకత ద్వారా నిరర్ధక ఆస్తులను తగ్గిచడంలో గత మూడేళ్లుగా విజయం సాధిస్తున్నామని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పర్యావరణ సుస్థిరతలో ఎంఎస్‌ఎంఈల పాత్ర చాలా కీలకమని ఇరెడా సీఎండీ చెప్పారు. ఎంఎస్‌ఎంఈల సమస్యలను పరిష్కరించడానికి, పునరుత్పాదక ఇంధన రంగంలో వాటిని మరింతగా ప్రోత్సహించడానికి ఇరెడా అంకితభావంతో పని చేస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ వడ్డీ రేట్లకు సులభంగా రుణాలు పొందాలంటే, తమ రేటింగ్‌లు & నిర్వహణలను ఎంఎస్‌ఎంఈలు మెరుగుపరుచుకోవాలని శ్రీ దాస్ స్పష్టం చేశారు.
***
(Release ID: 2007668)
Visitor Counter : 154