ఆయుష్
azadi ka amrit mahotsav

జాతీయ ఆయుష్ మిషన్ ప్రాంతీయ సమీక్షా సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆయుష్ మంత్రి


జాతీయ ఆయుష్ మిషన్ పథకానికి రూ.1200 కోట్ల బడ్జెట్ కేటాయింపులు

Posted On: 15 FEB 2024 7:00PM by PIB Hyderabad

బీహార్ లోని పాట్నాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బీహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతీయ సమీక్షా సమావేశంలో కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సమగ్ర ఆరోగ్య రక్షణ వ్యవస్థ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది అన్నారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించే అంశంలో కీలక పాత్ర పోషించే సామర్థ్యం ఉన్న యోగ, ఆయుష్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని మంత్రి తెలిపారు. 

 రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఎస్ఏఎపి) కింద రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రతిపాదించిన వివిధ కార్యకలాపాలను అమలు చేయడానికి   కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు జరుగుతున్న జాతీయ ఆయుష్ మిషన్ కింద   ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది. . ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేయడం, మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సేవలు  అందించాలనే దార్శనికత, లక్ష్యంతో జాతీయ ఆయుష్ మిషన్  అమలు జరుగుతోంది.  జాతీయ ఆయుష్ మిషన్ లో భాగంగా 2023-24 నాటికి  ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా 12,500 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు (ఏహెచ్డబ్ల్యూసీ) ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

2014-15 నుంచి  జాతీయ ఆయుష్ మిషన్    కింద 07 రాష్ట్రాలకు (బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్) ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు రూ.1712.54 కోట్లు విడుదల చేసింది. 2022-23 వరకు రాష్ట్రాల్లోని 58 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు  మంత్రిత్వ శాఖ సహకారం అందించింది.  వాటిలో 14 ఆసుపత్రులు పని చేయడం ప్రారంభించాయి.  ఈ 07 రాష్ట్రాల్లో ఉన్న  12,500 ఎహెచ్ డబ్ల్యుసిలలో 4235 ఎహెచ్ డబ్ల్యుసిలకు మంత్రిత్వ శాఖ ఇప్పటికే సహకారం అందించింది. వాటిలో 3439 పనిచేస్తున్నాయి.

అయోధ్యలో ఆయుర్వేద వైద్య కళాశాల, 2022-23 లో ఉత్తరప్రదేశ్  వారణాసిలో నూతన హోమియోపతి మెడికల్ కాలేజీ, పశ్చిమ బెంగాల్ లోని హౌరా లో యోగా అండ్ నేచురోపతి కళాశాల ఏర్పాటుకు  జాతీయ ఆయుష్ మిషన్   కింద మంత్రిత్వ శాఖ సహకారం అందించింది. 

.ఆయుష్ విద్యా సంస్థల నిర్మాణ పనులను త్వరితగతిన వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా వాటిని  అందుబాటులోకి తీసుకు రావడానికి చర్యలు తీసుకోవాలని  ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఆయుష్ బృందానికి కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. ఆమోదించిన సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలు ఆయుష్ సేవలు వినియోగించుకునే విధంగా  వాటిని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

సమగ్ర ఆరోగ్య రక్షణ కోసం ప్రజలకు అవసరమైన అవసరమైన  వివిధ ఆయుష్ సౌకర్యాలు  అందించడానికి జాతీయ ఆయుష్ మిషన్  మార్గదర్శకాల్లో చేర్చిన ఆయుష్ ప్రజారోగ్య కార్యక్రమాల అమలు పై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.  ఆయుష్ ద్వారా పాఠశాల పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ఆయుర్ విద్య , ఆయుష్ మాతా శిశు, నవజాత శిశువుల కోసం అమలు చేస్తున్న సుప్రజ ,  ఆస్టియో ఆర్థరైటిస్, ఇతర కండరాల రుగ్మతల నివారణ , నిర్వహణ కోసం ఆయుష్ ఆధారిత వృద్ధాప్య కార్యక్రమం వయో మిత్ర ,  ఆయుష్ మొబైల్ మెడికల్ యూనిట్లు మొదలైన కార్యక్రమాలు ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శోషరస ఫైలేరియాసిస్ నివారణ కోసం అమలు చేస్తున్న  ఆయుష్ ఫర్ మోర్బిడిటీ మేనేజ్మెంట్ అండ్ డిజెబిలిటీ ప్రివెన్షన్ (ఎంఎండిపి)  జాతీయ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు మంత్రి సూచించారు. 

 కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేందభాయ్ మాట్లాడుతూ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో  పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ తో పాటు భాగస్వామ్య రాష్ట్రాల్లో  26  కేంద్ర/ ప్రాంతీయ పరిశోధనా సంస్థలు/ కేంద్రాలు/ క్లినికల్ రీసెర్చ్ యూనిట్లు/ డ్రగ్ స్టాండర్డైజేషన్ యూనిట్ మొదలైన సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు.ఆరోగ్య సేవలు అందించడానికి  స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ (SPMU)/ కింద  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లు , టెలీమెడిసిన్,ఉత్తమ  ప్రజారోగ్య విధానాలు  పంచుకోవడం, ఐఈసీ, పర్యవేక్షణ, క్షేత్ర స్థాయిలో  సందర్శనలు మొదలైన వాటితో సహా జాతీయ ఆరోగ్య మిషన్  కింద వివిధ కార్యకలాపాలు అమలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. 

 దేశంలో ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి  ప్రోత్సాహం కోసం రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో  ఆయుష్ మంత్రిత్వ శాఖ  జాతీయ ఆయుష్ మిషన్ ను ప్రధాన పథకంగా అమలు చేస్తోందని  మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా తెలిపారు.   గత ఏడాదితో పోలిస్తే  జాతీయ ఆయుష్ మిషన్   పథకానికి బడ్జెట్ కేటాయింపులు కూడా రూ.800 కోట్ల నుంచి .1200 కోట్ల రూపాయలకు  పెరిగాయి.

ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి కవితా గార్గ్ సంబంధిత రాష్ట్రాల జాతీయ ఆయుష్ మిషన్ స్థితి గురించి క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి లీనా జోహారీ, ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యయ్ అమిత్, బీహార్ అదనపు ప్రధాన కార్యదర్శి అలంకృత  తదితరులు పాల్గొన్నారు.

***


(Release ID: 2006503) Visitor Counter : 101


Read this release in: English , Urdu , Hindi